వాసుపల్లి వైసీపీకి ప్లస్సా.. మైనస్సా…?

విశాఖ సిటీలో వైసీపీ బలపడేందుకు టీడీపీ నాయకులను వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చేసుకుంది. అయితే ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వీరి [more]

Update: 2021-03-06 03:30 GMT

విశాఖ సిటీలో వైసీపీ బలపడేందుకు టీడీపీ నాయకులను వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చేసుకుంది. అయితే ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వీరి చేతిలో అధికారం లేదు కాబట్టి పెద్దగా సమస్యలు లేవు కానీ విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరడమే పెద్ద ట్విస్ట్. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండేవారు. అలాంటి నాయకుడు పార్టీ మారడం అంటేనే అంతా ఆశ్చర్యపోయారు. సరే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడారు, వైసీపీకి జై కొట్టారు, మరి ఆయన వల్ల అధికార పార్టీకి ఉపయోగం ఏమైనా ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

టచ్ మీ నాట్ …..

వాసుపల్లి గణేష్ కుమార్ దశాబ్దన్నరకు పైగా టీడీపీలో కొనసాగి తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఆయన‌ హఠాత్తుగా వైసీపీ లోకి జంప్ చేయడంతోనే ఆ వర్గం కూడా ఆయన వెంట వచ్చేసింది. దాంతో ఫ్యాన్ పార్టీకి ఉక్క బోత మొదలైంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు విలవిలలాడుతున్నారు. ఇక విశాఖ సౌత్ లో ఏదైనా సరే తనదే పెత్తనం అంటూ వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహరిస్తూండంతో ఆది నుంచి పార్టీలో కొనసాగుతున్న వారు విసిగిపోతున్నారు. దీని మీద అధినాయకత్వానికి చెప్పినా కూడా ఫలితం లేకపోవడంతో రగిలిపోతున్నారు.

విచిత్రమైన సీన్…..

ఇదిలా ఉంటే జీవీఎంసీ ఎన్నికల వేళ ఒక విచిత్రమైన పరిస్థితినే వాసుపల్లి గణేష్ కుమార్ తీసుకు వచ్చారు అంటున్నారు. ఇంతవరకూ రాజకీయ చరిత్రలో ఇలా జరిగి ఉండదు అని కూడా భావిస్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గత ఏడాది మార్చి నాటికి టీడీపీ విశాఖ నగర ప్రెసిడెంట్. ఆయన ఆ హోదాలో సౌత్ లో ఉన్న 13 వార్డులలో టీడీపీ అభ్యర్ధులకు బీ ఫారాలు ఇచ్చాడు. ఇపుడు ఎన్నికలు జరుగుతున్న నాటికి ఆయన వైసీపీలో ఉన్నారు దాంతో ఆయన సంతకం పెట్టిన బీ ఫారాలు చెల్లుతాయా లేదా అన్నది ఒక వైపు తమ్ముళ్ళ బాధగా ఉంది. ఇక తన వెంట తీసుకువచ్చిన టీడీపీ మద్దతుదారులకు వైసీపీ బీ ఫారాలు ఇవ్వాలనుకోవడంతో వైసీపీలో కూడా కొత్త చిచ్చు రేగుతోంది.

దెబ్బయిపోతారా…?

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ కేవలం మూడు వేల ఓట్ల తేడాతోనే వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అంటే సౌత్ లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉందనే అర్ధం. ఇక ఎన్నికల తరువాత మాజీ ఎమ్మెల్యే రహమాన్ వచ్చి వైసీపీలో చేరారు. దాంతో మరింత బలపడింది. అయినా సరే సిట్టింగ్ ఎమ్మెల్యేను తెచ్చి చేర్చుకోవడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని వైసీపీ భావించింది కానీ ఇపుడు సౌత్ లో వైసీపీ దెబ్బైపోతోంది అంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ కంటే కూడా తన వర్గాన్నే ప్రోత్సహిస్తారు. ఆయన ఎక్కడ ఉంటే వారు అక్కడ ఉంటారు. దాంతో అసలైన వైసీపీ నేతలు ఈ పరిణామాలతో డీ మోరలైజ్ అవుతున్నారు. రేపటి రోజున ఏపిలో పొలిటికల్ సీన్ మారితే వాసుపల్లి మళ్ళీ సైకిల్ ఎక్కినా ఎక్కుతారని అనుమానాలూ ఉన్నాయి. అదే జరిగితే సౌత్ లో వైసీపీ పరిస్థితి ఏంటి అన్నదే కార్యకర్తల బాధగా ఉందిట. ఇవన్నీ సరే కానీ ముందు జీవీఎంసీ ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఎంతవరకూ వైసీపీకి ప్లస్ అవుతారు అన్నది కూడా మరో చర్చగా ఉంది.

Tags:    

Similar News