వసుంధర ఊసే ఇక అక్కడ ఉండకపోవచ్చట

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టినట్లే కనపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆమెను పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలున్నాయి. [more]

Update: 2021-01-25 17:30 GMT

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టినట్లే కనపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆమెను పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఆమె సేవలను కేవలం ప్రచారానికే ఉపయోగించుకోవాలని నాయకత్వం భావిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. గత ఎన్నికల్లో ఓటమితో పాటు గత రెండున్నరేళ్లుగా వసుంధర రాజే వ్యవహరిస్తున్న తీరు కూడా కేంద్ర నాయకత్వానికి ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు.

సెంటిమెంట్ తో…..

వసుంధర రాజేకు ఇప్పటికే 70 ఏళ్లు దాటిపోయాయి. మరో మూడేళ్లకు గాని రాజస్థాన్ ఎన్నికలు జరగవు. బీజేపీ నిబంధనల ప్రకారం వయసు రీత్యా పదవులు చేపట్టడానికి వీలులేదు. నిజానికి రాజస్థాన్ లో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరుసటి ఎన్నికల్లో రాదు. గత కొన్ని సార్లుగా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతూ వస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి కావడానికి ప్రధాన కారణం వసుంధర రాజే అని అధిష్టానం గుర్తించింది.

విమర్శలు చేయకుండా….

దీంతో పాటు గత రెండున్నరేళ్లుగా వసుంధర రాజే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అలాగే పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. బీజేపీకి కలసి వచ్చిన అవకాశం కూడా వసుంధర రాజే కారణంగానే దక్కలేదన్న భావన ఉంది. సచిన్ పైలట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినప్పుడు తనకు టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడి అశోక్ గెహ్లాత్ కు మద్దతివ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.

అందుకే ఆగ్రహం….

ఇక సచిన్ పైలట్ కూడా బీజేపీలో చేరక పోవడానికి ప్రధాన కారణం వసుంధర రాజే అన అంటున్నారు. తొలి నుంచి వసుంధర రాజే సచిన్ పైలట్ నే టార్గెట్ చేశారు. రాజస్థాన్ ఆపరేషన్ కమల్ సాధ్యపడకపోవడానికి వసుంధర రాజే ప్రధాన కారణమని గుర్తించిన అధిష్టానం వచ్చే ఎన్నికల నాటికి ఆమెను అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. కానీ వసుంధర రాజే లేకుండా రాజస్థాన్ బీజేపీని చూడలేం. మరి రాజకుటుంబాన్ని కాదని బీజీపీ ముందుకు వెళుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి వయసు రీత్యా కాని, రాజకీయ కారణాలతో గాని వసుంధర ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి.

Tags:    

Similar News