అంతా రాజమాత వల్లేనట

రాజస్థాన్ కమలనాధుల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. ఇందుకు వసుంధర రాజే కారణమన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి. రాజస్థాన్ రాజకీయ అనిశ్చితి దాదాపు నెల రోజుల [more]

Update: 2020-08-17 17:30 GMT

రాజస్థాన్ కమలనాధుల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. ఇందుకు వసుంధర రాజే కారణమన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి. రాజస్థాన్ రాజకీయ అనిశ్చితి దాదాపు నెల రోజుల పాటు నడిచింది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకునే వీలుంది. కానీ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తప్పించి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే నుంచి సహకారం లభించలేదంటున్నారు. వసుంధర రాజే పూనుకుని ఉంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయేదన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

దక్కించుకోవడం సులువైనా…?

నిజానికి రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఓటమి చివరి వరకూ వచ్చింది. సచిన్ పైలట్ ను దువ్వి ఉన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దరిచేర్చుకున్నా అధికారం కమలం పార్టీ చేతికి చిక్కేది. దాదాపు నెల రోజుల పాటు రిసార్ట్ రాజకీయాలు నడిచాయి. బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను గుజరాత్ కు తరలించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజస్తాన్ లో దాదాపు 13 మంది వరకూ ఉన్నారు. వారిని కూడా బీజేపీ ఆకట్టుకోలేకపోయింది. బీజేపీ సర్కార్ వస్తే వసుంధర రాజే మళ్లీ సీఎం అవుతారని భావించే స్వతంత్ర ఎమ్మెల్యేలు సయితం అశోక్ గెహ్లాత్ కే జైకొట్టారంటున్నారు.

ఈజీ వే ఉన్నా…

వసుంధర రాజే మీద సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆమె అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకం ఇప్పుడు శాపంగా మారింది. నిజానికి సచిన్ పైలట్ తో మంతనాలను జరపడానికి రాజమాతకు ఈజీ వే ఉంది. జ్యోతిరాదిత్య సింధియా ద్వారా సచిన్ పైలెట్ ను బీజేపీకి దగ్గర చేసే వీలున్నా ఆమె మూడు నెలల నుంచి మౌనంగా ఉండటాన్ని బీజేపీ నేతలు సయితం ప్రశ్నిస్తున్నారు. తనకు సంబంధం లేనట్లుగా వసుంధర రాజే వ్యవహరించారంటున్నారు.

అధిష్టానానికి ఫిర్యాదులు….

సచిన్ పైలట్ వైపు 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. అనధికారికంగా చూస్తే అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే. మిగిలిన రాష్ట్రాల్లో సులువుగా అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రాజస్థాన్ లో మాత్రం పవర్ ను అందుకోలేక పోయింది. సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇప్పుడు వసుంధర రాజేను టార్గెట్ చేస్తూ అధిష్టానానికి బీజేపీ నేతలు ఫిిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అధికారం చిక్కినట్లే చిక్కి చేజరడానికి రాజమాత కారణమని తేల్చేశారు.

Tags:    

Similar News