పామ‌ర్రుకు పాత మొగుడే.. బాబు వ్యూహం

రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు కామ‌నే. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే త‌ర‌హాలో ముందుకు సాగుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా నియ‌మించిన పార్లమెంట‌రీ క‌మిటీల్లో కీల‌క [more]

Update: 2020-10-12 09:30 GMT

రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు కామ‌నే. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే త‌ర‌హాలో ముందుకు సాగుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా నియ‌మించిన పార్లమెంట‌రీ క‌మిటీల్లో కీల‌క ఎస్సీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్యకు ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న అనుకున్నా ఆయ‌న‌కు మొండి చేయి త‌ప్పలేదు. పార్టీ కోసం వ‌ర్ల రెండు ద‌శాబ్దాలుగా ఎన్నో త్యాగాలు చేస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో తిరుప‌తి ఎంపీగా పోటీ చేసి ఓడిన వ‌ర్ల రామయ్య ఇటీవల రాజ్యస‌భ ఎన్నికల్లో ఓడిపోతాన‌ని తెలిసి కూడా పార్టీ కోసం పోటీ చేశారు. 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న నందిగామ సీటు ఆశించ‌గా.. అప్పట్లో దేవినేని ఉమా రాజ‌కీయానికి బ‌లి కావ‌డంతో సీటు రాలేద‌న్న టాక్ ఉంది.

తిరిగి అప్పగించేందుకు….

ఇక 2014లో పామ‌ర్రు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ‌ర్ల రామయ్య స్వల్ప తేడాతో ఓడిపోయారు. గ‌త ఎన్నికల్లో ఆయ‌న‌కు సీటే రాలేదు. ఇక తాజాగా పార్లమెంట‌రీ జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌ల పంపిణీలో ఆయ‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నా ఆయ‌న్ను ప‌క్కన పెట్టిన బాబు మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌కు రాజ‌మ‌హేంద్రవ‌రం పార్లమెంట‌రీ జిల్లా ప‌గ్గాలు అప్పగించారు. కానీ వ‌ర్ల రామయ్యకు మాత్రం ఆ అవ‌కాశం చిక్కలేదు. దీంతో ఏం జ‌రిగి ఉంటుంద‌నే చ‌ర్చకు దారితీసింది. కొంచెం లోతుగా ఆలోచిస్తే వ‌ర్ల రామయ్యకు తిరిగి పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను అప్పగించేందుకు బాబు ముహూర్తం రెడీ చేశార‌ని అంటున్నారు.

కల్పన ఉన్నప్పటికీ….

కృష్ణా జిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్కడ ఉప్పులేటి క‌ల్పన ఆదిలో టీడీపీలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. అయితే, ఆమె 2014కు ముందు వైసీపీలో చేరి ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత మ‌ళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌విని ఆశించినా ఆమెకు ఆ ప‌ద‌వి రాలేదు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌ను ఆమెకు ఇచ్చారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి ఆమె పార్టీలో ఉండాలా ? వ‌ద్దా ? అనే ధోర‌ణిలో ఊగిస‌లాడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఆమె తిరిగి వైసీపీలోకి వెళ్లే యోచ‌న‌లో కూడా ఉన్నార‌న్న చ‌ర్చలు న‌డుస్తున్నాయి. అయితే అక్కడ కూడా ఆమెను ప‌ట్టించుకునే వారు లేక‌పోవ‌డంతో క‌ల్పన నిర్ణయం తీసుకోలేని ప‌రిస్థితి.

వర్లకు బాధ్యతలను అప్పగించాలని…..

ఈ క్రమంలో పామ‌ర్రులో టీడీపీ జెండా ప‌ట్టుకునే నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు 2014లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ‌ర్ల రామ‌య్యకే తిరిగి ఈ నియోజ‌వ‌క‌ర్గం బాధ్యత‌ల‌ను అప్పగించాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పార్టీలో యాక్టివ్ నాయ‌కుడిగా ఉన్నారు. ప్రధానంగా పార్టీ వాయిస్‌ను వినిపించ‌డంలోను, ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పించ‌డంలోను ఆయ‌న ముందున్నారు. వ్యూహాత్మక నిర్ణయాల విష‌యంలోనూ ఆయ‌న పార్టిసిపేష‌న్ ఉంది.

సీనియర్ నేతలు కూడా…

దీంతో వ‌ర్ల రామయ్య అయితేనే.. పామ‌ర్రులో పార్టీకి మంచి ఊపు వ‌స్తుంద‌ని భావిస్తున్నట్టు స‌మాచారం. అక్కడ క‌మ్మ సామాజిక వ‌ర్గంతో పాటు పార్టీ సీనియ‌ర్ నేత‌లు అంద‌రూ వ‌ర్ల రామయ్యకే ప‌గ్గాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇప్పటికే ఇదే జిల్లాలోని గ‌న్నవ‌రం బాధ్యత‌ల‌ను ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడుకి కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు పామ‌ర్రు ప‌గ్గాలు వ‌ర్ల రామయ్యకు ఇవ్వడం కూడా దాదాపు ఖ‌రారైనట్టే అని తెలుస్తోంది.

Tags:    

Similar News