ఈయనే త‌ల‌నొప్పి అంటే.. కొడుకు కూడా తోడ‌య్యాడా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేల‌ది ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంద‌నే వ్యాఖ్యలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అందునా.. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ [more]

Update: 2021-09-09 08:00 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేల‌ది ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంద‌నే వ్యాఖ్యలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అందునా.. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎంపీ.. వ‌ర‌ప్రసాద్ విష‌యంలో అయితే..ఇప్పటికే స్థానిక నేత‌లు, మంత్రి ఒక‌రు త‌ల ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. 'ఆయ‌నేంటో.. ఆయ‌న రాజకీయం ఏంటో అర్దం అవ‌డం లేద‌బ్బా!“ అంటూ నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క మంత్రి ఒక‌రు కొన్నాళ్ల కింద‌టే వ్యాఖ్యానించారు. అంతా నా ఇష్టం అనే రేంజ్‌లో వ‌ర‌ప్రసాద్ రాజ‌కీయం చేస్తుంటారని..పార్టీలో నేత‌లు గుస‌గుస‌లాడ‌డం కూడా ఇటీవ‌ల కాలంలో స‌హ‌జంగా మారిపోయింది.

ఆయన వైఖరి వల్లనే..?

నిజానికి ఇదేదో.. వ‌ర‌ప్రసాద్ అంటే.. ఇష్టం లేక పోవ‌డంతో చెప్పిన, చేస్తున్న వ్యాఖ్యలు కావు. స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు , ఎమ్మెల్యే అనుస‌రిస్తున్న వైఖ‌రిని ప్రత్యక్షంగా చూసిన వారే చెబుతున్న మాట‌లు. ఆయ‌న పార్టీ సీనియ‌ర్లను గౌర‌వించ‌రు. జూనియ‌ర్లను ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వర‌నే పేరుంది. ఈ కార‌ణం గానే కీల‌క నేత‌లు ఒక్కొక్కరుగా వ‌ర‌ప్రసాద్‌కు దూర‌మ‌య్యారు. నిజానికి గూడూరు ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. అలాంటి చోట వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీనిని నిల‌బెట్టుకునేందుకు పార్టీ ఎంతో శ్ర‌మించాల్సి ఉంది. అయితే.. ఎమ్మెల్యే వైఖ‌రితో ఇక్కడ మ‌ళ్లీ టీడీపీ గెలిచినా సందేహం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో….

గూడూరు ఎస్సీ స్థానమైనా.. రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. 2019 ఎన్నికల సమయంలో అనూ హ్యంగా ఇక్కడి టికెట్ ద‌క్కించుకున్న వరప్రసాద్‌కు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు సహకరించారు. ఆయ‌న‌ను గెలిపించుకునేందుకు నిధులు కూడా ఖ‌ర్చు చేశారు. దీనికి కార‌ణం.. కొన్ని ఎన్నిక‌లుగా.. ఇక్కడ టీడీపీ విజ‌యం సాధించ‌డంతో త‌మ వ్యక్తిగ‌త అభివృద్ధి నిలిచిపోయింద‌ని.. ఇప్పుడు వైసీపీని గెలిపించడం ద్వారా త‌మ‌కు వ్యక్తిగ‌తంగా పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వారు భావించారు. అయితే.. వ‌ర‌ప్రసాద్ ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కు ఒక విధంగా వ్యవ‌హ‌రించి తర్వాత వర్గ విభేదాలకు ప్రోత్సహించేలా వ్యవ‌హ‌రించారు.

ఒక్కొక్కరుగా పార్టీకి దూరంగా…?

గూడూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ టికెట్‌ ఆశించి వైసీపీలో కీలంగా పనిచేసిన పారిశ్రామిక వేత్త హరిశ్చంద్రరెడ్డి తర్వాతకాలంలో పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తీరు నచ్చకే ఆయన వైసీపీని వీడి వెళ్లారనే ప్రచారం ఉంది. అదేవిధంగా పార్టీలో కీలకంగా పనిచేస్తున్న పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, మాజీ సీఎం కుమారుడు నేదురమల్లి రాంకుమార్‌రెడ్డి సైతం వరప్రసాద్‌తో పొస‌గ‌క పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో గూడూరు వైసీపీలో వ‌ర‌ప్రసాద్ వ్యతిరేక వ‌ర్గం పెరిగిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది.

విసిగిపోయిన వారంతా..?

.ఇక‌, ఎమ్మెల్యే వరప్రసాద్‌ తీరుతోనే ఇక్కడి నేత‌లు విసిగిపోతే.. కొన్నాళ్లుగా ఆయ‌న కుమారుడి జోక్యం పెరిగిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో బదిలీలు.. పోస్టింగ్‌లు.. కాంట్రాక్టుల.. ఇలా అన్నింటిలో వరప్రసాద్‌ కుమారుడి జోక్యం పెరిగి.. సీనియ‌ర్లకు అస్సలు విలువే లేకుండా పోయింద‌ని అంటున్నారు. ప్రతి పనికీ 'మాకేంటి' అని గట్టిగానే నిలదీస్తున్నట్టు గూడూరు వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాలు మంత్రి అనిల్ కుమార్ వ‌ర‌కు చేర‌డంతో ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఆయ‌న ఫిర్యాదు చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి ఈ ప‌రిస్థితిని క‌ట్టడి చేయ‌డ‌మా? లేక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌ర‌ప్రసాద్‌ను ప‌క్కన పెట్టడమా? అనేది అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News