నోరు జారుతున్నారే?

గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ కి రాజకీయంగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయని ప్రచారం జరుగుతోంది. ఆది నుంచి కూడా త‌న‌కంటూ ప్రత్యేక అజెండా పెట్టుకుని ప‌నిచేస్తార‌నే [more]

Update: 2020-01-25 00:30 GMT

గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ కి రాజకీయంగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయని ప్రచారం జరుగుతోంది. ఆది నుంచి కూడా త‌న‌కంటూ ప్రత్యేక అజెండా పెట్టుకుని ప‌నిచేస్తార‌నే పేరున్న వ‌ర‌ప్రసాద్ పైకి సౌమ్యంగానే ఉన్నా లోలోన మాత్రం ఆయ‌న అగ్రవ‌ర్ణాలంటే ఒకింత ద్వేష భావం చూపిస్తున్నా ర‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి. గ‌తంలో తిరుప‌తి ఎంపీగా ఉన్న స‌మ‌యంలో కూడా ఆయ‌న కొన్ని వివాదాస్ప ద వ్యాఖ్యలు చేసి అగ్రవ‌ర్ణాల ఆగ్రహానికి గుర‌య్యారు. రోజూ వెళ్లి వెంక‌న్నకు మొక్కక‌పోతే.. మ‌రే ప‌నీలేదా మీకు? అని ఆయ‌న గతంలో అగ్రవ‌ర్ణ ప్రజ‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

వారికి సమస్యలేముంటాయి?

ఈ వ్యాఖ్యల‌పై జ‌గ‌న్‌కు కూడా ఫిర్యాదు అందాయి. ఈ ప‌రిణామ‌మే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎంపీ టికెట్ లేకుండా చేసింద‌నే వాద‌న కూడా వినిపించింది. అయితే, జ‌గ‌న్ తో ఉన్న స‌ఖ్యత నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుని విజ‌యం సాధించారు. అయితే, ఇప్పుడు ఇక్కడ కూడా ఆయ‌న ఎవ‌రితోనూ క‌లివిడిగా ఉండ‌డం లేద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. పైగా అగ్రవ‌ర్ణాల‌కు చెందిన వారికి స‌మ‌స్యలు ఏముంటాయ‌ని తాజాగా చేసిన వ్యాఖ్యలు మ‌రింత దుమారం రేపుతున్నాయి.

స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ…

గూడూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమే అయిన‌ప్పటికీ ఇక్కడ కూడా అగ్రవ‌ర్ణాల వారు ఉన్నార‌ని, వారి ఓట్లతోనే మీరు ఎమ్మెల్యే అయ్యార‌నే విష‌యం మ‌రిచిపోవ‌ద్దని ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో వైసీపీ నాయ‌కులు ఎమ్మెల్యేని ప్రశ్నించారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్ సీఎం జ‌గ‌న్‌పైనా విమ‌ర్శలు చేశార‌ని స్థానిక వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. సీఎం త‌న‌కు స్వేచ్ఛను ఇవ్వడం లేద‌ని, ఇస్తే త‌న స‌త్తా చూపిస్తాన‌ని, ఎవ‌రిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాన‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌పై వైసీపీ నాయ‌కులు మ‌రింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం దృష్టికి….

త్వర‌లోనే స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు ఉండ‌డం, నాయ‌కులు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ఎమ్మెల్యేనే ఇలా వ్యాఖ్యానించ‌డంపై వారు నేరుగా సీఎంతోనే చెప్పుకొనేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. వ‌ర‌ప్రసాద్ కృష్ణా జిల్లా ముదినేప‌ల్లికి చెందిన వ్యక్తి. ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల అధికారిగా ప‌నిచేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గూడూరుకు ఆయ‌న నాన్ లోక‌ల్. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని వ‌ర్గాల‌కు ఆయ‌న‌కు పొస‌గ‌డం లేదు. ఇదిలావుంటే, విష‌యం జిల్లా మంత్రి అనిల్ కుమార్ దృష్టికి వెళ్లింద‌ని, ఆయ‌న ఇప్పటికే ఫోన్‌లో ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్‌తో మాట్లాడార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ దృష్టికి వెళ్తే ప‌రిస్తితి ఎలా ఉంటుందోన‌ని అంటున్నారు. మ‌రి ఆయ‌నపై క్రమ‌శిక్షణ చ‌ర్య‌లు తీసుకుంటారో.. వేచిచూస్తారో. చూడాలి.

Tags:    

Similar News