పాపం… ప్రతాప్ రెడ్డి..!

అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఇంకా తేరుకోకముందే ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ఇస్తున్నారు. మొదట ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని [more]

Update: 2019-01-19 05:00 GMT

అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఇంకా తేరుకోకముందే ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ఇస్తున్నారు. మొదట ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వీడి ఏకంగా శాసనమండలి కాంగ్రెస్ పాక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ సంచలనానికి తెరలేపారు. తాజాగా కేసీఆర్ ప్రత్యర్థి, గజ్వేల్ లో ఆయనపై రెండుసార్లు పోటీచేసి ఓడిన వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ చేరాలని నిర్ణయించుకోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేపోతున్నాయి. వంటేరు వంటి బలమైన నేతలే పార్టీని వీడితేచ పార్టీ పరిస్థితి ఏంటని గుబులు చెందుతున్నారు. అయితే, ప్రతాప్ రెడ్డి పార్టీ మారడం వెనుక పలు కథనాలు వినిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన పార్టీ మారారని అంటున్నారు.

మూడుసార్లు ఓడిపోవడంతో…

టీడీపీ తరపున 2009 ఎన్నికల్లో పోటీచేసిన ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై 7 వేల ఓట్లతో ఓడిపాయారు. 2014లో టీడీపీ నుంచే బరిలో ఉండి కేసీఆర్ కి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఆయనకు సానుభూతి కలిసొస్తుందని, ఈసారి కూడా గట్టి పోటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. ప్రతాప్ రెడ్డి అయితే తన విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. కానీ, ఊహించని విధంగా 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతాప్ రెడ్డి ఓడిపోయారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరున్నా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ముందు ఆయన బలం సరిపోలేదు. దీంతో భారీ తేడాతో ఓడిపోయారు. ఆర్థికంగా సాధారణ స్థాయిలోనే ఉన్న ఆయన వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇదే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం అంటున్నారు.

ఓటమిని జీర్ణించుకోలేక…

ఇక, కేసులు వెంటాడుతుండటం కూడా పార్టీ మార్పుకు మరో కారణంగా తెలుస్తోంది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన పెద్దఎత్తున పోరాటం చేశారు. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ విద్యార్థి ఆత్మహత్యా చేసుకున్న సమయంలోనూ ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఇన్ని కేసులు అనుభవించి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం వంటేరు కొట్లాడితే ఆయా గ్రామాల్లోనూ ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మెజారిటీ రావడం కూడా ఆయనను మానసికంగా దెబ్బతీసింది. ప్రజలు కేసీఆర్ వైపు, టీఆర్ఎస్ వైపు ఉన్నారనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈ మేరకు కేటీఆర్, కేసీఆర్ తో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంటేరు చేరిక లాంఛనమైంది.

ఎమ్మెల్సీతో పాటు పార్టీ బాధ్యతలు…

ఆయనకు ఎమ్మెల్సీ లేదా ఏదైనా నామినేటెడ్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కేంద్ర రాజకీయాలపై దృష్టిపెట్టిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి బరిలో ఉంటారని అంటున్నారు. అదే జరిగితే ప్రతాప్ రెడ్డిని గజ్వేల్ బరిలో నిలిపే అవకాశం కూడా ఉంది. ఇక, గజ్వేల్ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలను ప్రతీసారి హరీష్ రావు చూడాల్సి వస్తోంది. ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం వల్ల ఇక నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు తిరుగు ఉండదని ఆ పార్టీ అంచనా వేస్తోంది. నియోజకవర్గ పార్టీ బాధ్యతలు కూడా ఆయనపై పెట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News