రాధా …రాం..రాం..చెప్పేశారా…?

విజయవాడ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వంగవీటి రాధా టీడీపీ తీర్థం ఎందుకు పుచ్చుకోలేదు. పసుపు కండువా కప్పుకునేందుకు ఆయన జంకుతున్నారా? సొంత సామాజిక వర్గం, రంగా, [more]

Update: 2019-02-15 01:30 GMT

విజయవాడ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వంగవీటి రాధా టీడీపీ తీర్థం ఎందుకు పుచ్చుకోలేదు. పసుపు కండువా కప్పుకునేందుకు ఆయన జంకుతున్నారా? సొంత సామాజిక వర్గం, రంగా, రాధా అభిమానుల నుంచి వత్తిడి వస్తుండటమే కారణమా? అంటే అవుననే సమాధానం వస్తుంది. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఇప్పటి వరకూ వేసినవన్నీ తప్పటడుగులే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక పార్టీలు మారి నిలకడలేని నేతగా ముద్రపడి పోయారు. రాధా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య కక్ష్యలు, కార్పణ్యాల నేపథ్యంలో దేవినేని ఉన్న పార్టీలో రాధా చేరలేదు. కాంగ్రెస్ లో దేవినేని ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి రాధా వెళ్లిపోయారు.

టీడీపీలో చేరతారనుకుంటే…

ఇక తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరతారని అందరూ భావించారు. గత నెల 25వ తేదీనే రాధా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు అధికారికంగా ప్రకటించకపోయినా బెజవాడ టీడీపీ నేతలతో ఆయన చెప్పారు. ఈ మేరకు టీడీపీ నేతలు రాధా ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకుద టీడీపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి రాధా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

సన్నిహితుల ఒత్తిడితో…..

అంతేకాకుండా వైసీపీని వీడుతూ రాధా చేసిన వ్యాఖ్యలు కూడా సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకతను పెంచాయి. తన తండ్రి రంగా హత్యకు టీడీపీ కారణం కాదని, కొందరు వ్యక్తులు కారణమంటూ రాధా చేసిన కామెంట్స్ కాపు సామాజిక వర్గంలో కలకలం సృష్టించాయి. రాధాపై సోషల్ మీడియాలో నెటిజెన్లు విరుచుకుపడ్డారు. దీంతో పాటు బంధుగణం, రంగా, రాధా అభిమానులు, కాపు సామాజిక వర్గం నేతలు సయితం రాధా నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాధా టీడీపీలో చేరడం సరికాదని ఆయనకు నేరుగా చెప్పేసి వెళ్లిపోయారు. కాపు సామాజిక వర్గం నేతలు కూడా వరుసగా టీడీపీని వీడి వైసీపీలో చేరుతుండటం రాధా పునరాలోచనలో పడటానికి కారణమంటున్నారు.

మౌనం వీడితేనే….

దీంతో రాధా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎదగాల్సిన తరుణంలో ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీలోకి వెళితే ప్రయోజనం ఉండదని సన్నిహితులు కూడా రాధాకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రాధా మనసు మార్చుకున్నారని ఆయన సన్నిహితులుచెబుతున్నారు. అందుకే రాధా గత కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారంటున్నారు. వంగవీటి రాధా టీడీపీలో చేరతారా? లేదా? అన్న సస్పెన్స్ కు మాత్రం తెరపడలేదు. ఆయన జనసేనలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. మొత్తం మీద రాధా మౌనం వీడితేనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో అన్నది తేలుతుంది.

Tags:    

Similar News