వంగ‌వీటి కుదురుకున్నట్లేనా?

స‌హ‌జంగా `ప‌డి లేచిన కెర‌టం` అంటూ ఉంటారు.. చాలా మంది నాయ‌కుల గురించి. అయితే.. బెజ‌వాడ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యువ నాయ‌కుడు.. దివంగ‌త వంగ‌వీటి రంగా వార‌సుడుగా [more]

Update: 2020-12-30 02:00 GMT

స‌హ‌జంగా 'ప‌డి లేచిన కెర‌టం' అంటూ ఉంటారు.. చాలా మంది నాయ‌కుల గురించి. అయితే.. బెజ‌వాడ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యువ నాయ‌కుడు.. దివంగ‌త వంగ‌వీటి రంగా వార‌సుడుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వంగ‌వీటి రాధా విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఆయ‌న 'లేచి.. ప‌డిన కెర‌టం'గానే రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తారు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. 2004లో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలోనే ఆయ‌న పిన్న వ‌య‌స్సులోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. విజ‌య‌వాడ తూర్పులో ఆయ‌న గెలుపు ఓ సంచ‌ల‌నం. అప్పటి వ‌ర‌కు క‌మ్మ నాయ‌కుల‌కే ప్రాధాన్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి వంగ‌వీటి రాధా విజ‌యం సాధించారు. బ‌ల‌మైన వంగ‌వీటి పొలిటిక‌ల్ బ్రాండ్ ఉండ‌డంతో ఇక‌, ఆయ‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని… తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

ఐదేళ్లకే పరిమితమయి….

కానీ, అనూహ్యంగా వంగ‌వీటి రాధా వ్యవ‌హారం ఐదేళ్లకే 2009 నాటికే నేల మ‌ట్టమైంది. ఆయ‌న వేసిన అడుగులు ఆయ‌న సామాజిక వ‌ర్గానికే ఆగ్రహం తెప్పించా యి. అంతేకాదు.. త‌న తండ్రికి మిత్రులుగా ఉన్న వారు సైతం దూర‌మ‌య్యే ప‌రిస్థితిని క‌ల్పించాయి. దీంతో వంగవీటి రాధా ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్‌ను వ‌దిలేసి ప్రజారాజ్యం, త‌ర్వాత వైసీపీ, అనంత‌రం.. ఇప్పుడు టీడీపీలోను కొన‌సాగుతున్నా రు. అయితే.. ఆయ‌న 2004 తర్వాత ఇప్పటి వ‌ర‌కు విజ‌యం సాధించింది లేదు. త‌న కేడ‌ర్‌లో ఊపు తెచ్చింది కూడా లేదు. ఇక‌, త‌న తండ్రి రంగాకు బద్ధ శ‌త్రువైన టీడీపీలో చేర‌డాన్ని రంగా అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. అయిన‌ప్పటికీ.. రాధా త‌న ప్రయాణం సైకిల్‌పైనే సాగిస్తున్నారు. ఇదిలావుంటే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున టికెట్ ఆశించినా.. ఆయ‌న‌కు లభించ‌లేదు.

ఎలాంటి పదవి…..?

అయిన‌ప్పటికీ చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలంటూ వంగ‌వీటి రాధా పెద్ద ఎత్తున య‌జ్ఞ యాగాలు చేశారు. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిర‌గ‌డంతో పాటు కొంద‌రి టీడీపీ అభ్యర్థుల‌ త‌ర‌ఫున ప్రచారం చేశారు. దీంతో చంద్రబాబు దృష్టిలో ప‌డ్డారు. ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఆఫ‌ర్ అన్నారు. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు వంగ‌వీటి రాధాకు ఎలాంటి ప‌ద‌వి వ‌చ్చే ఛాన్సే లేదు. ఎన్నిక‌ల‌ త‌ర్వాత వైసీపీ నేత‌లు, ముఖ్యంగా ఆయ‌న మిత్రులుగా ఉన్న కొడాలి నాని, వ‌ల్లభ‌నేని వంశీల నుంచి ఆహ్వానం అందినా.. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్టప‌డ లేదు. ఇది మ‌రింత‌గా చంద్రబాబుకు న‌మ్మకం క‌లిగించింది.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో…..

అంతేకాదు, అమ‌రావ‌తి ఉద్యమంలోనూ వంగవీటి రాధా త‌న‌దైన పాత్ర పోషిస్తున్నారు. మూడు రాజ‌ధానులు వ‌ద్దు.. అంటూ.. పెద్ద ఎత్తున ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. ఉద్యమ నాయ‌కులు కూడా వంగవీటి రాధాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ వంగవీటి రాధా చెప్పిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మొత్తంగా చూస్తే.. రాధా రాజ‌కీయం 2004 త‌ర్వాత ఇప్పుడు గ్రాఫ్ పెరుగుతున్నట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. నిల‌క‌డ‌లేని నాయ‌కుడిగా ముద్ర వేసుకున్న వంగవీటి రాధా ఈ దూకుడును ఇలానే నిల‌బెట్టుకుంటారా? లేక‌.. మ‌ధ్యలోనే వ‌దిలేస్తారా? అనేది సందేహం. చూడాలి ఏం జ‌రుగుతుందో!!

Tags:    

Similar News