రికార్డును బీట్ చేస్తారా?

ఏపీ టీడీపీ తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ టీచ‌ర్ వంగలపూడి అనితకు పార్టీ అధినేత చంద్రబాబు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప‌ద‌విని చేప‌ట్టిన‌వారిలో [more]

Update: 2020-02-15 00:30 GMT

ఏపీ టీడీపీ తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ టీచ‌ర్ వంగలపూడి అనితకు పార్టీ అధినేత చంద్రబాబు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప‌ద‌విని చేప‌ట్టిన‌వారిలో అతి పిన్న వ‌య‌సు మ‌హిళ స‌హా రాజ‌కీయంగా కూడా అత్యంత త‌క్కువ స‌మ‌యంలో కీల‌క‌మైన బాధ్యత‌లు ద‌క్కిన వనితగా కూడా అనిత టీడీపీలో రికార్డు సృష్టించారు. గ‌తంలో ఎంతో మంది కీల‌క నాయ‌కురాళ్లు ఈ ప‌ద‌విని నిర్వహించారు. వీరిలో ప్రముఖంగా అంద‌రి గుర్తింపును పొందిన వారిలో న‌టి, ఇప్పుడు జాతీయ స్థాయి రాజ‌కీయ నేత‌గా ఎదిగిన జ‌య‌ప్రద, మ‌రో కీల‌క నాయ‌కురాలు, తెలుగుదేశం పార్టీ సినియ‌ర్ మోస్ట్ న‌న్నప‌నేని రాజ‌కుమారి.

కీలక నేతలకే….

అదేవిధంగా, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడా గ‌తంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తెలుగు మ‌హిళ అధ్యక్షురాలిగా ప‌నిచేశారు. అదేవిధంగా శోభా హైమావ‌తి కూడా టీడీపీ తెలుగు మ‌హిళ అధ్యక్షురాలిగా ప‌ని చేశారు. చీరాల‌లో ఓడిన పోతుల సునీత‌కు ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెను ఏపీ టీడీపీ మ‌హిళా విభాగానికి అధ్యక్షురాలిని చేసినా ఆమె పార్టీ వీడారు. ఇక ఇప్పుడు నిజానికి టీడీపీలో ఉన్న నేతలు ఈ ప‌ద‌విని పొంద‌డాన్ని అత్యంత గౌర‌వంగా భావిస్తారు. అయితే, రానురాను ఈ ప‌ద‌వి కి కూడా అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

నన్నపనేని హయాం నుంచే…

ఎప్పటిక‌ప్పుడు మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని మ‌హిళ‌ల ప‌రంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డం అధ్యక్షురాలి బాధ్యత‌. ఎప్పటిక‌ప్పుడు అనేక ఎదుర‌య్యే స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డం, మ‌హిళ‌ల‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డం, స‌భ్యత్వాలు పెంచ‌డం కీల‌క విధుల్లో భాగం. గ‌తంలో టీడీపీ తెలుగు మ‌హిళా అధ్యక్షురాలిగా ప‌నిచేసిన న‌న్నప‌నేని రాజ‌కుమారి కాలం నుంచి ఈ ప‌ద‌వికి మ‌రింత వ‌న్నె చేకూరింద‌నే విష‌యం ఒప్పుకోవాల్సిందే. ఆమె హ‌యాంలో పార్టీలో మ‌హిళ‌ల‌కు మ‌రింత స్వేచ్ఛ పెంచేలా కీల‌క చ‌ర్యలు తీసుకున్నారు.

నామ్ కే వాస్తేగా….

అప్పటి వ‌ర‌కు నామ్‌కేవాస్తేగా ఈ ప‌ద‌వికి గౌర‌వం పెంచారు. మ‌హిళ‌ల సంఖ్యను పెంచారు. స‌భ్యత్వాల‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడ స‌మ‌స్య ఉంటే అక్కడ ప్రత్యక్ష మ‌య్యారు. దీంతో న‌న్నప‌నేని ఓ రికార్డును సృష్టించార‌నే చెప్పాలి. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చూసుకుంటే పార్టీ మ‌రిన్ని క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యం. పైకి బాగున్నట్టుగానే క‌నిపించినా మ‌హిళ‌ల బ‌లం పెద్దగా క‌నిపించ‌డం లేదు. ఈ స‌మ‌స్యను అధిగ‌మించ‌డంతోపాటు వైసీపీకి దీటుగా పార్టీని న‌డిపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఈవిష‌యంలో అనిత ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

ప్రకటనలకే పరిమితమైతే…

ముఖ్యంగా న‌న్నప‌నేని వ్యూహాన్ని ఫాలో అవుతారో త‌న‌కంటూ ప్రత్యేక వ్యూహం ఏర్పాటు చేసుకుంటారో చూడాలి. ఏదేమైనా తెలుగు మ‌హిళ అధ్యక్షురాలిగా ఏదో నాలుగు విమ‌ర్శలు, రెండు ప్రక‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైతే అనిత సాధించేది ఏమీ ఉండ‌ద‌ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎక్కడ ఎలాంటి ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలో గుర్తించి ఆ విధంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం అనితకు ప‌రీక్ష పెట్టనుంది కూడా.

Tags:    

Similar News