ఆయనకు రాజయోగం ఉందా ? బ్యాడ్ లక్ అంటే ఆయనదేనా?

విశాఖ వైసీపీ రాజకీయాల్లో బ్యాడ్ లక్ లీడర్ గా ఆయన్ని చెప్పుకుంటారు. ఆయన పదేళ్ళుగా పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఆయన కనీసం [more]

Update: 2020-03-25 15:30 GMT

విశాఖ వైసీపీ రాజకీయాల్లో బ్యాడ్ లక్ లీడర్ గా ఆయన్ని చెప్పుకుంటారు. ఆయన పదేళ్ళుగా పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఆయన కనీసం చిన్న ప్రభుత్వ పదవినైనా పొందలేకపోయాడు. ఆయనే ప్రస్తుత వైసీపీ నగర అధ్యక్షుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్. ఆయన 2009 ఎన్నికల్లో తొలిసారిగా ప్రజారాజ్యం తరఫున విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో పరాజయం పాలు అయ్యాడు. నిజంగా కాపులు, యాదవులు ఎక్కువగా ఉన్న విశాఖలో ఆయన ఓడిపోవడం అంటే అది తొలి దెబ్బగా చూడాల్సిందే.

వైసీపీలో అలా….

ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలసిపోయింది. పెద్ద వాళ్ళు సర్దుకున్నారు. పేదలు మాత్రం దెబ్బతిన్నారు. అలాంటివారిలో ఒకరుగా ఉన్న వంశీ అపుడే కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చిన జగన్ పార్టీ పెడితే అందులో చేరిపోయారు. ఆ తరువాత వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో మళ్ళీ విశాఖ తూర్పు నుంచే పోటీ చేశారు. ఈసారి టీడీపీ ప్రభంజనంలో ఆయన భారీ తేడాలో ఓడిపోయారు. ఇక లాభం లేదని అయిదేళ్ళ పాఱు పార్టీని గాడిలో పెడుతూ తూర్పులో మార్పు తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కితే జగన్ వేవ్ లో గెలిచేసేవారే కానీ. సరిగ్గా అదే టైంలో ఆయనకు గట్టి షాక్ తగిలింది.

టికెట్ గోవిందా…?

నామినేషన్ల వరకూ వచ్చిన వంశీ కధ కాస్తా ఒక్కసారిగా తారుమారు అయింది. భీమిలీ నుంచి వచ్చిన అక్రమాన విజయనిర్మలకు విశాఖ తూర్పు కేటాయించారు. దాంతో వంశీకి చుక్కలు కనిపించాయి. పార్టీలో ఘోర అవమానం జరిగింది. ఇక వీడిపోదామనుకుంటున్న వేళ జగన్ స్వయంగా పిలిచి హామీ ఇచ్చారు. మన పార్టీ అధికారలోకి వస్తుంది. కాబోయే మేయర్ నీవేనని చేతిలో చేయి వేసి మరీ చెప్పారు. నాటి నుంచి వేయి కళ్ళతో వంశీ లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎదురుచూశారు. అవి అలా జరిగి జరిగి చివరికి మార్చిలో పెట్టారు. ఇక మేయర్ సీటు ఖాయమని అనుకున్న వంశీకి తీరని శాపంగా కరోనా ఎదురొచ్చింది. అంతే లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడిపోయాయి.

బ్యాడ్ లక్కేనా…?

చేతిలోకి వచ్చిన అన్నం ముద్ద నోటి దాకా రాలేదంటే ఇదేనేమో. వంశీ జాతకం మార్చి నెల గడిస్తే మారిపోతుందని ఆయన అభిమానులు, అనుచరులు అంతా భావించారు. కానీ మార్చి మధ్యలోనే జాతకం తిరగబడింది. ఇపుడు అంతటా కరోనా ప్రభావం ఉంది. అది ఎంతవరకూ ఉంటుందో తెలియదు. ఎపుడు ఎన్నికలు జరుగుతాయో అంతకంటే తెలియదు. దాంతో కరోనా దెబ్బ వంశీకి నేరుగా కొట్టిదని అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మనిషి ఇండైరెక్ట్ ఎన్నికలు కాబట్టి తగ్గి మరీ కార్పోరేటర్ గా పోటీకి దిగినా కూడా స్థాయి పడిపోయింది కానీ పదవి మాత్రం అందని పండుగానే మిగిలిందని అంటున్నారు

Tags:    

Similar News