ముట్టుకుంటే మసేనటగా

విశాఖ ఏంటో ఇపుడు భూములతో నిండిన పంచభక్ష్య పరమాన్నపు విస్తరిగా రాజకీయ జీవులకు కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో విశాఖ జోలికి వచ్చే ఓపికా, తీరికా ఎవరికీ లేవు. [more]

Update: 2020-02-13 02:00 GMT

విశాఖ ఏంటో ఇపుడు భూములతో నిండిన పంచభక్ష్య పరమాన్నపు విస్తరిగా రాజకీయ జీవులకు కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో విశాఖ జోలికి వచ్చే ఓపికా, తీరికా ఎవరికీ లేవు. కానీ విభజన తరువాత మాత్రం అందరి కన్నూ విశాఖ మీదనే పడింది. అప్పట్లో రూరల్ ఏరియాల్లో భూముల కబ్జా ఓ వైపు యధేచ్చగా సాగితే నాటి అధికార పార్టీ పెద్దల ప్రమేయంతో వాల్తేరు క్లబ్ పరిసరాల్లోని భూములు ఎకరాలకు ఎకరాలు ఖాళీ అయ్యాయని ఆరోపణలు వున్నాయి. అందులోనే టీడీపీ జిల్లా ఆఫీస్ కూడా కొంత భాగం కట్టారని కూడా నాడు వైసీపీ నేతలు విమర్శలు చేసి మరీ పసుపు తమ్ముళ్ళను ఎండగట్టారు.

వీరి వంతు అట…..

ఇక ఇపుడు చూసుకుంటే వాల్తేరు భూముల్లో మిగిలిన భాగాన్ని తాము కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తోందని ఓ వైపు ప్రచారం జోరుగా సాగుతోంది. వాల్తేరు భూములను వైసీపీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోవాలనుకుంటున్నారని అపుడే టీడీపీ విమర్శలు కురిపిస్తోంది. ఇక వాల్తేరు భూముల విలువ ఇపుడు గజం లక్షల్లో ఉంది, సిటీకి సెంటర్ పాయింట్ గా ఉండడంతో ఏకంగా పెద్దల కన్నే ఇటు పడుతోందని అంటున్నారు. దీంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఈ భూములే వేదికగా సమరం మొదలైంది.

చరిత్ర అదీ….

నిజానికి వాల్తేర్ క్లబ్ చరిత్ర 140 ఏళ్ళ నాటిది. 1883లో ఈ క్లబ్ బ్రిటిష్ వారి టైంలో ఏర్పడింది. అప్పట్లో బ్రిటిష్ అధికారులతో పాటు, జమీందార్లు, ధనవంతులు, నగర ప్రముఖులు ఈ క్లబ్ మెంబర్స్ గా ఉండేవారు సువిశాలమైన‌ ఈ క్లబ్ దేశంలోనే గొప్ప పేరు గడించింది. ఈ క్లబ్ తో పాటు చుట్టు పక్కల విస్తారంగా స్థలం కూడా ఉంది. అది దసపల్లా వారసుల భూములు అంటారు. అయితే వాటిని ప్రభుత్వానికి కొంత ఇచ్చారని చెబుతారు. కానీ ఆ భూములన్నీ తర్వాత రోజుల్లో ఆక్రమణ అయ్యాయి. అలాగే మిగిలిన వాటిని ఇపుడు పెద్దలు గద్దల్లా వేటాడుతున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ రాజధాని అన్న ప్రకటన వెలువడింది. దాంతో నగరానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో మిగిలిన భూములకు కూడా రెక్కలు వచ్చాయని ప్రచారం సాగుతోంది.

పెద్దలతో యుధ్ధమే…?

వాల్తేర్ క్లబ్ ని చుట్టు పక్కన భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని వార్తలు కూడా తాజాగా వినిపిస్తున్నాయి. వాల్తేర్ క్ల‌బ్ చరిత్ర దృష్ట్యా ఈ భూముల జోలికి సర్కార్ వెళ్ళకపోవడమే మంచిదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అపుడే తన గళం వినిపించారు. ఈ క్లబ్ ని అలాగే కొనసాగనీయాలని ఆయన అంటున్నారు. మరో వైపు వైసీపీ ఎంపీ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణం రాజు సైతం వాల్తేరు క్లబ్ తో పాటు అక్కడ భూముల జోలికి వస్తే ఎంతటి పెద్ద వారినైనా కూడా వదిలేది లేదని అంటున్నారు.

సర్కార్ కే హెచ్చరిక…..

నిజానికి విశాఖలో రాజధాని అంటే అనేక విలువైన స్థలాల‌ను ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. దాంతో ఈ క్లబ్ స్థలాన్ని కూడా ఉపయోగించుకోవాలన్న ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ఉందని అంటున్నారు. విమానాశ్రయానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్లబ్ అత్యాధునిక వసతులతో, అతి పెద్ద విస్తీర్ణంలో ఉంది. దాంతో ఇక్కడ కొత్త చిచ్చు రేగుతోంది. ఇక మరో వైపు ఇక్కడ ఉన్న ఖాళీ భూములను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వాటిని ముట్టుకోవద్దు అని కొత్త రాజకీయం ఒకటి రచ్చ చేస్తోంది, గట్టిగా హెచ్చరిస్తోంది. ఇక మరో వైపు సర్కార్ నీడన కబ్జాదారులు కూడా రాజమార్గంలోనే తమ పని సాగుతుందని ఆశపడుతున్నారు. దీంతో ఇపుడు విశాఖ వాల్తేర్ క్లబ్ సరికొత్త వివాదానికి తావు ఇస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News