జగన్ ఓకే చెప్పారటగా

రాజ‌కీయాల్లో మార్పులు అనివార్యం.. అధికారంలో ఉన్న పార్టీ వైపే నాయ‌కులు మొగ్గుతున్న ప‌రిస్థితి దేశంలో మ‌నం చూస్తున్నాం. ఇప్పుడు ఏపీలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ఇక్కడ [more]

Update: 2019-07-23 08:00 GMT

రాజ‌కీయాల్లో మార్పులు అనివార్యం.. అధికారంలో ఉన్న పార్టీ వైపే నాయ‌కులు మొగ్గుతున్న ప‌రిస్థితి దేశంలో మ‌నం చూస్తున్నాం. ఇప్పుడు ఏపీలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ భారీ రేంజ్‌లో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది. అనేక సంస్కర‌ణ‌లు, ప్రక్షాళ‌న దిశ‌గా అధికార పార్టీఅధినేత జ‌గ‌న్ దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు మ‌నుగ‌డ క‌ష్టమ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్నమొన్నటి వ‌ర‌కు కూడా అధికారంలో ఉన్న టీడీపీకి ఫ్యూచ‌ర్ పూర్తిగా ముగిసిన‌ట్టే అంటున్నారు. అధినేత చంద్రబాబు ఉంటేనే పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. రేపు ఆయ‌న త‌ప్పుకొని ఈ ప‌గ్గాల‌ను ఎవ‌రికైనా అప్పగిస్తే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ అంత‌ర్గతంగా సాగుతోంది.

దూకుడు మరింత పెంచితే….

ప్రస్తుతం చంద్రబాబు పాల‌న‌ను కూడా అవినీతియ‌మ‌ని, ఆయ‌న పాల‌నా ద‌క్షుడ‌ని న‌మ్మిన ప్రజ‌లు ఘోరంగా మోస పోయార‌ని, ఆయ‌న పాల‌న అంతా అవినీతి మ‌య‌మ‌ని అధికార పార్టీ వైసీపీ చేస్తున్న యుద్ధం దాదాపు స‌క్సెస్ అవుతోంది. ప్రతి విష‌యంలోనూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్న జ‌గ‌న్ తాను అనుకున్న ల‌క్ష్యాన్ని త్వర‌లోనే సాధించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ అంత‌రించ‌డానికి చాలా త‌క్కువ స‌మ‌య‌మే ప‌డుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాదు, ఇప్పటి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్రకారం జ‌గ‌న్ దూకుడు మ‌రింత పెంచితే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా విజ‌యం ఆయ‌న సొంతం చేసుకునే అవ‌కాశంలేక పోలేద‌ని చెబుతున్నారు.

వంశీ పార్టీ మారతారన్న ప్రచారంతో….

దీనిని గుర్తిస్తున్న కీల‌క‌మైన టీడీపీ నేత‌లు త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటివారిలో కృష్ణా జిల్లా గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇటీవ‌ల గెలిచిన వ‌ల్లభ‌నేని వంశీ పేరు ముందు వ‌రుస‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఆయ‌న గెలిచినా.. అధినేత నుంచి స‌రైన గుర్తింపు లేక పోవ‌డం, సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే అయినా ఓడిపోయిన వారికి ఇస్తున్న ప్రయార్టీ కూడా త‌న‌కు ల‌భించ‌క పోవ‌డంతో ఇప్పుడు వంశీ.. వైసీపీ దారి ప‌ట్టాల‌ని నిర్ణయించుకున్నార‌న్న టాక్ బెజ‌వాడ పాలిటిక్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని….

దీనికితోడు వైసీపీలోనూ త‌న‌కుఅనుకూల‌మైన గుడివాడ కు చెందిన మంత్రి కొడాలి నాని వంటి వారు ఉండ‌డంతో త‌న సులువుగా పూర్తి అవుతుంద‌ని భావించారు. అవ‌స‌ర‌మైతే..త‌న పార్టీ ప‌ద‌వికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి.. వైసీపీలోకి వెళ్లాల‌ని నిర్ణయించుకున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి జ‌గ‌న్ కూడా ఓకే చెప్పార‌ని, త్వర‌లోనే నిర్ణయం ప్రక‌టిస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News