వినయ విధేయుడయితే కాదు

అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడం వల్లభనేని వంశీ తత్వం. పరిటాల మరణం తర్వాత గన్నవరం అసెంబ్లీ స్థానం మీద కన్నేసి.. ఓ పథకం ప్రకారం తల్లి పేరుతో [more]

Update: 2019-10-28 08:00 GMT

అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడం వల్లభనేని వంశీ తత్వం. పరిటాల మరణం తర్వాత గన్నవరం అసెంబ్లీ స్థానం మీద కన్నేసి.. ఓ పథకం ప్రకారం తల్లి పేరుతో ట్రస్ట్ పెట్టి గ్రామాల్లోకి వెళ్లడం మొదలు పెట్టాడు. అప్పటికే గద్దె రామ్మోహన్, దాసరి బాల వర్ధన రావు వంటి వారి నుంచి ఆ స్థానంపై తీవ్ర పోటీ ఉంది. మధ్యలో పుట్టగుంట సతీష్ లాంటి వాళ్ళు అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశారు. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత 2009లో గన్నవరం దాసరికి దక్కింది. గద్దె విజయవాడ తూర్పులో పోటీ చేయాల్సి వచ్చింది. వంశీ ఇష్టం లేకున్నా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు.

అవసరమైతే తలొగ్గి….

2006 నుంచి విజయవాడలో టీడీపీ భారాన్ని భరించానని ప్రచారం చేసుకోవడం, ఫ్యాక్షన్ వివాదాలు, భూ దందాలు, మధ్యలో సినిమాల నిర్మాణం, కొడాలి, వంగవీటి వంటి వారితో దోస్తీ దేవినేని కుటుంబంతో వైరం ముదిరి జగన్ తో చేతులు కలుపుతున్నారనే ప్రచారం అన్నీ కలగలిసి సాగేవి. రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అనుకున్నప్పుడు తానే స్వయంగా లీకులు ఇచ్చేవాడు. తన మీద అనుమానంతో బెంగళూరులో ఓ రోజంతా వేచి చూసేలా చేశారని, మరో సందర్భంలో ల్యాండ్ సెటిల్మెంట్ లో వచ్చిన డబ్బు కూడా తనకే వదిలేయడం అవతలి వారి గొప్పతనం అని చెప్పడం ద్వారా ప్రత్యర్థి తనకంటే చాలా రెట్లు బలవంతుడు అని ఒప్పుకునే వాడు. తద్వారా వారి నుంచి తనకు ముప్పు రాకుండా జాగ్రత్త పడేవాడు
.
పబ్లిసిటీ కోసం…..

అప్పట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులు మీద వ్యక్తిగత దాడి కూడా వ్యూహాత్మకంగా చేయడమే కాకుండా, దానికి కులం, మీడియా మద్దతు కూడగట్టి అనుకున్నది సాధించగలిగాడు. ఆ తర్వాత పోలీస్ అధికారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, అందుకు సాక్ష్యంగా ఆర్జీవీని తీసుకొచ్చి హడావుడి చేశాడు. ఇప్పటికి చాలా సందర్భాల్లో వైసీపీ అధినేత జగన్ మీద వినయ విధేయతలు ప్రదర్శించినా అవన్నీ అవసరాన్ని బట్టి చేసినవే. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకుని మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకోవడం ద్వారా 2014కి ముందు టీడీపీలో పట్టు పెంచుకోగలిగాడు. వల్లభనేని వంశీ నైజం తెలిసి అతనిలా మాట మార్చే వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని జగన్మోహన్ రెడ్డి అతని సన్నిహిత మిత్ర ద్వయం కొడాలి, వంగవీటిలకు 2014 ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా జిల్లాలో తిరుగులేని హవా చెలాయించడం, మట్టి తవ్వకాలతో భారీగా సంపాదించడంతో అడ్డూ అదుపు లేకపోయింది. 2019 ఎన్నికల్లో సైతం గెలుపు కోసం రకరకాల ఎత్తులతో అనుకున్నది సాధించాడు. తాజాగా జగన్ ని కలవడం ద్వారా పార్టీ మారతాడనే ప్రచారంతో పాటు, తనను వైసీపీ ఇబ్బంది పెడుతోందనే వార్తలను విస్తృతంగా ప్రచారం చేయగలిగారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప మరొకటి కాక పోవచ్చు.

కొత్తగా వచ్చే ప్రయోజనం…?

చివరగా వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీకి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. టీడీపీని దెబ్బ కొట్టడం., ఓ ఎమ్మెల్యేని అదనంగా పొందడం తప్ప ఏమి ఉండదు, ఫలితంగా నాలుగున్నరేళ్ళు వల్లభనేని వంశీకి ప్రశాంతత లభిస్తుంది. విలువలు, విశ్వసనీయత అని తరచూ చెప్పే జగన్మోహన్ రెడ్డి సైతం వల్లభనేని వంశీ మిత్రుల మాట విని పార్టీలోకి ఆహ్వానించినంత మాత్రాన కృష్ణా జిల్లాలో ఆ కులం మొత్తం గంపగుత్తగా వైసీపీ పక్షం అయిపోదు. అదను కోసం ఎదురు చూడటమే ప్రత్యర్థుల వంతు.

Tags:    

Similar News