చికాకు పుట్టి చిర్రెత్తుకొస్తుందనేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు వ్యూహానికి తెరతీసింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీని పావుగా వాడుకుంటూ చంద్రబాబును చికాకు పెట్టాలని చూస్తోంది. [more]

Update: 2019-12-10 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు వ్యూహానికి తెరతీసింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీని పావుగా వాడుకుంటూ చంద్రబాబును చికాకు పెట్టాలని చూస్తోంది. ఒకరకంగా తొలిరోజు వైసీపీ ఈ విషయంలో సక్సెస్ అయినట్లే కన్పించింది. వల్లభనేని వంశీ లేచి మాట్లాడుతుండగానే టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబుకు ఎక్కడ చిర్రెత్తుకొస్తుందో అక్కడే దెబ్బకొట్టాలని వైసీపీ నిర్ణయంలో భాగంగానే వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశమిచ్చింది.

పరోక్షంగా లోకేష్ పై…..

శాసనసభలోనూ వల్లభనేని వంశీ తాను బయట మీడియా మీట్లో చెప్పిందే చెప్పారు. తాను జగన్ విధానాలకు ఆకర్షితుడునై ఆయన చేస్తున్న మంచి పనులను అభినందించడంలో తప్పేమిటని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. పప్పు బ్యాచ్ సోషల్ మీడియాలో తనపై పెడుతున్న పోస్టింగ్ ల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని పరోక్షంగా శాసనసభలోనూ నారా లోకేష్ పై వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు.

స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని…..

అందుకే తాను ఇక ఆ పార్టీలో కొనసాగలేనని, తనను స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని వల్లభనేని వంశీ చేసుకున్న విజ్ఞప్తిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఓకే చెప్పారు. వల్లభనేని వంశీకి ప్రత్యేక సీటు కేటాయించాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. ఇకపై వల్లభనేని వంశీ నిత్యం ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ, గత ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడమే ధ్యేయంగా సభలో ఉండనున్నారు. టీడీపీలో టెక్నికల్ గా ఉంటూనే ప్రత్యేక సభ్యుడిగా వల్లభనేని వంశీ కొనసాగనున్నారు.

ప్రతిరోజూ తప్పదా?

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు. దీంతో టీడీపీ దీనిని దొంగాటకంగా అభివర్ణించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టీడీపీ గుర్తుమీద గెలిచిన వల్లభనేని వంశీ చంద్రబాబును విమర్శించడమేంటని ప్రశ్నిస్తుంది. సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్పలు వల్లభనేని వంశీకి ప్రత్యేక సీటు కేటాయించడమేంటని ప్రశ్నించారు. పార్టీ మారాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల వేట రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. మొత్తం మీద వల్లభనేని వంశీ టీడీపీతో పాటు వ్యక్తిగతంగా చంద్రబాబుకు అసెంబ్లీ సమావేశాల్లో తలనొప్పిగా తయారయ్యారు.

Tags:    

Similar News