గన్నవరంలో వంశీకి కొత్త మొగుడు రెడీ

కృష్ణాజిల్లా గన్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున వరుస విజ‌యాలు సాధిస్తున్న ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ కొన్నాళ్ల [more]

Update: 2020-07-26 12:30 GMT

కృష్ణాజిల్లా గన్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున వరుస విజ‌యాలు సాధిస్తున్న ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ కొన్నాళ్ల కింద‌ట వైఎస్సార్ సీపీకి మద్దతుదారుగా మారిన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగ‌డ్డ వెంక‌ట్రావుకు నామినేటెడ్ ప‌ద‌విని ఇచ్చిన జ‌గ‌న్‌ వ‌ల్లభ‌నేని వంశీకి అనుకూలంగా రంగం సిద్ధమ‌య్యేలా ప‌రోక్షంగా స‌హ‌క‌రించారు. వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేర‌క‌పోయినా ప‌రోక్షంగా వైసీపీకి స‌హ‌క‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే వంశీ సీఎం జ‌గ‌న్‌ను కూడా రెండు మూడు సార్లు క‌లిశారు. గ‌న్నవ‌రం వైసీపీ ప‌గ్గాలు త‌న‌వే అని త‌న‌కు ఎదురులేద‌నుకుంటోన్న టైంలో వంశీకి మ‌రో కొత్త నేత పోటీకి వ‌చ్చారు.

పొలిటికల్ గా యాక్టివ్ కావాలని…

వ‌ల్లభ‌నేని వంశీ త‌న ప్రయ‌త్నాల్లో తాను ఉండ‌గానే వైఎస్సార్ సీపీ సీనియ‌ర్ నాయకుడు దుట్టా రామ‌చంద్రరావు ఇక్కడ చ‌క్రం తిప్పేందుకు ప్రయ‌త్నించారు. దుట్టా రామ‌చంద్రరావు దివంగ‌త వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో గ‌న్నవ‌రంలో పోటీ చేసి వ‌ల్లభ‌నేని వంశీపై ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి స్వయంగా త‌ప్పుకున్న దుట్టా మ‌రో నేత యార్లగ‌డ్డ వెంక‌ట్రావు గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు వంశీ వైసీపీ ఎంట్రీతో పాటు పార్టీ అధికారంలోకి రావ‌డంతో దుట్టా వ‌ర్గం కూడా పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అవ్వాల‌ని డిసైడ్ అవ్వడంతో ఇక్కడ వైసీపీ రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా మారింది.

దుట్టా అల్లుడు….

వ‌ల్లభ‌నేని వంశీ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం, దుట్టా కాపు వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఇక్కడ రాజ‌కీయ వాతావ‌ర‌ణం వంశీకే అనుకూలంగా ఉంది. అయితే, ఇప్పడు దుట్టా అల్లుడు, రెడ్డి వ‌ర్గానికి చెందిన డాక్టర్ శివ‌భ‌ర‌త్ రెడ్డి గ‌న్నవ‌రం రాజ‌కీయాల్లోకి ప్రవేశించారు. దూకుడు పెంచారు. ముందు నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ల్లభ‌నేని వంశీని వ్యతిరేకించే వ‌ర్గాన్ని త‌న‌కు అనుకూలంగా తిప్పుకొనేందుకు ప్రయ‌త్నాలు ప్రారంభించారు. 2019 వరకు శివభరత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వైఎస్సార్ సీపీ వైద్యవిభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన హైదరాబాద్‌లో వైద్యవృత్తిలో ఉంటూ వచ్చారు.

జగన్ కు బంధువనంటూ….

అయితే ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఆయన వైద్యవృత్తిని వీడి గన్నవరం చేరుకున్నారు. రావడంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. తాను జగన్‌, ఆయన సతీమణి భారతికి బంధువునని, తనకు సీఎంతో సాన్నిహిత్యం ఉందని చెబుతూ నాయ‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్రయ‌త్నం చేస్తున్నారు. అయితే ఇక్కడే భ‌ర‌త్‌రెడ్డికి మ‌రో ప‌రిణామం కూడా క‌లిసి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ నుంచి ఓడిన యార్లగ‌డ్డ వెంక‌ట్రావుకు జ‌గ‌న్ డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి ఇవ్వడంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

వంశీ అంటే గిట్టని వారు….

ఈ గ్యాప్‌ను అందిపుచ్చుకుని భ‌ర‌త్‌రెడ్డి గ‌న్నవ‌రంలో దూసుకుపోయే ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు. దీంతో వ‌ల్లభ‌నేని వంశీ అంటే గిట్టని నాయ‌కులు, వైఎస్సార్ సీపీలో త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కులతో పాటు జ‌గ‌న్ బంధువును అన్న కోణం వాడుకుంటూ చాలా మందికి ద‌గ్గర‌వుతున్నారు. ఈ పరిణామాలు వ‌ల్లభ‌నేని వంశీ వర్గంలో తీవ్ర అసహనాన్ని రేపాయి. ఇదిలావుంటే, పార్టీని త‌న‌దైన శైలిలో అభివృద్ధి చేస్తాన‌ని నాయ‌కుల‌కు కూడా శివ‌భ‌ర‌త్ రెడ్డి హామీ ఇస్తున్నారు.

వంశీని కాదనుకుంటారా?

అంతేకాదు, వ‌ల్లభ‌నేని వంశీ అంటే గిట్టని వారికి త‌న ద‌గ్గర ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న గ‌న్నవ‌రం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ ప‌గ్గాల‌ను త‌న‌కు అప్పగించాల‌ని ఆయ‌న కోరుతున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక జ‌రిగితే సీటు కూడా భ‌ర‌త్‌రెడ్డిదే అంటూ ఆయ‌న వ‌ర్గం ప్రచారం చేస్తోంది. మ‌రి ఇదే జ‌రిగితే వ‌ల్లభ‌నేని వంశీ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏమ‌వుతారు? గ‌న్నవ‌రంలో కొన్నేళ్లుగా దూకుడుగా ఉన్న వంశీకి చెక్ పెడ‌తారా ? జ‌గ‌న్ నిర్ణయం ఎలా ఉంటుంది అనే చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News