బ్లాక్ మెయిలింగా? గన్నవరంలో గ్రిప్ కోసమేనా?

గన్నవరం రాజకీయం మళ్లీ గరంగరంగా మారుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఫేస్ బుక్ లో పోస్టింగ్ ఇందుకు కారణం. [more]

Update: 2020-04-17 03:30 GMT

గన్నవరం రాజకీయం మళ్లీ గరంగరంగా మారుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఫేస్ బుక్ లో పోస్టింగ్ ఇందుకు కారణం. పథ్నాలుగు సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో తన కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటూ వల్లభనేని వంశీ ఫేస్ బుక్ పోస్టింగ్ రాజకీయంగా కలకలం రేపింది. వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకే ఇలాంటి పోస్టింగ్ పెట్టారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

రెండు సార్లు గెలిచి….

గత శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వల్లభవనేని వంశీ విజయం సాధించారు. రెండుసార్లు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లోకి రావడమే ఆయన తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. 2019 లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో పాటు జిల్లా టీడీపీ నేతలతో వల్లభనేని వంశీకి పొసగకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను పార్టీ ఇంతవరకూ ఆమోదించలేదు.

మద్దతుదారుగా ఉన్నా…..

కానీ వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. అసెంబ్లీలో సయితం ప్రత్యేక సీటును వల్లభనేని వంశీ పొందారు. అయితే వైసీపీకి మద్దతు తెలిపిన తర్వాత కూడా గన్నవరం నియోజకవర్గంలో పూర్తిగా పవర్ తన చేతులో లేదని వల్లభనేని వంశీ భావిస్తున్నారు. గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జోక్యాన్ని వల్లభనేని వంశీ సహించలేకపోతున్నారని తెలిసింది. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నట్లు గన్నవరంలో ప్రచారం జరుగుతోంది.

నాలుగేళ్ల పదవీకాలం ఉన్నా…..

అయితే మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండటంతో వల్లభనేని వంశీ రాజీనామా చేసేంత పిచ్చోడు కాదన్నది టీడీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న వాదన. గన్నవరంలో మరింత గ్రిప్ కోసం వల్లభనేని వంశీ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారంటున్నారు. తొలినాళ్లలో సులువుగా లభించిన జగన్ అపాయింట్ మెంట్ ఇప్పుడు దొరకడం లేదట. అలాగే గన్నవరంలో తన మాటే చెల్లుబాటు కావాలంటే ఈరకమైన బ్లాక్ మెయిలింగ్ కు వల్లభనేని వంశీ దిగారంటున్నారు ఆయన ప్రత్యర్థులు. మొత్తం మీద వల్లభనేని వంశీ ఫేస్ బుక్ పోస్టింగ్ టీడీపీ, వైసీపీల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News