యూటర్న్ తీసుకున్నారుగా

టీడీపీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ యూట‌ర్న్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఉద‌యం బీజేపీ నేత సుజ‌నా చౌద‌రితో [more]

Update: 2019-10-29 12:30 GMT

టీడీపీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ యూట‌ర్న్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఉద‌యం బీజేపీ నేత సుజ‌నా చౌద‌రితో భేటీ కావ‌డం, సాయంత్రాని క‌ల్లా.. ఆయ‌న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డంతో ఆయ‌న వైసీపీలోకి చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వెంట ఉండి జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకు వెళ్ల‌డాన్ని బ‌ట్టి ఆయ‌న చేరిక ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిపై మీడియాలో విస్తృతంగా క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే, ఇంత‌లోనే త‌న రాజీనామా లేఖ‌లో చంద్ర‌బాబుకు చిత్ర‌మైన విష‌యాన్ని వంశీ ప్ర‌స్తావించారు.

వత్తిడితోనే…..

“ ఈ రాజ‌కీయాల‌కు దూరం “- అంటూ వంశీ రాసిన వాక్యం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. జ‌గన్‌ను క‌లిసిన 24 గంటల్లోనే ఆయ‌న‌లో ఇంత నిర్వేదం ఎలా వ‌చ్చింది? రాజ‌కీయాల‌పై అంత వైరాగ్యం ఎందు కు వ‌చ్చింద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే, దీనిపై దృష్టిపెట్టిన విశ్లేష‌కులు కొంత లోతుగా ప‌రిశీలిం చారు. ఆయా విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వ్యూహాత్మ‌కంగా రెండు పార్టీలు చేసిన ఒత్తిడితోనే వల్లభనేని వంశీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం విష‌యంలో ఆయ‌న తొలుత బీజేపీ ఎంపీ సుజ‌నాను సంప్ర‌దించిన త‌ర్వాతే.. వైసీపీలోకి వెళ్లాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

సుజనాపై వత్తిడి తేవడంతో….

అయితే, నిన్న మొన్న‌టి వ‌రకు టీడీపీలో ఉన్న సుజ‌నా.. ఇప్పుడు కోరికోరి టీడీపీ నేత వల్లభనేని వంశీని వైరి పార్టీలోకి పంపుతుండ‌డాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హించ‌లేక పోయారు. దీంతో సుజ‌నాపై మిత్రుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇక‌, మ‌రో పార్టీ బీజేపీ కూడా సుజ‌నాపై ఫైరైంది. వల్లభనేని వంశీ మ‌న పార్టీలోకి వ‌స్తానంటే.. పోయి పోయి ప్ర‌త్య‌ర్థి పార్టీలో చేరాల‌ని స‌ల‌హా ఎలా ఇస్తావంటూ ఢిల్లీ స్థాయిలో ఆయ‌న‌ను ప్ర‌శ్నించినట్టు స‌మాచారం. దీంతో ఈ రెండు పార్టీల ఒత్తిడిని భ‌రించ‌లేని సుజ‌నా మ‌ళ్లీ త‌నే స్వ‌యంగా వల్లభనేని వంశీ కి ఫోన్ చేసి.. నువ్వు ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. నాపై ఒత్తిడి ప‌డ‌కుండా తీసుకోవాల‌ని సూచించ‌డంతో వంశీ ఇప్ప‌టికిప్పుడు పార్టీ మారే ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నెల రోజుల పాటు….

ప్ర‌స్తుతం ఆయ‌న దీక్ష‌లో కూడా ఉండడంతో మ‌రో నెల‌లో ఎలాగూ దీక్ష విర‌మిస్తారు క‌నుక .. అప్పుడు రాజ‌కీయంగా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్టుచెబుతున్నారు. అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి “అనుచ‌రుల ఒత్తిడి మేర‌కు“-అని ఓ మాట అనేసి త‌నకు న‌చ్చిన పార్టీలోకి చేరే అవ‌కాశం ఏర్పాటు చేసుకోవాల‌ని వల్లభనేని వంశీ భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. అంతే త‌ప్ప మాస్ లీడ‌ర్‌గా ఎదిగి, ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న వల్లభనేని వంశీ అక‌స్మాత్తుగా కాడి ప‌డేస్తారంటే.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఎవ‌రూ కూడా న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని, దీని వెనుక చాలానే జ‌రిగింద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News