మా కోసం మళ్లీ జన్మించవూ...!

Update: 2018-08-17 05:00 GMT

చనిపోయాక అందరూ చెబుతారు. ‘ఆయన గొప్ప వ్యక్తి. మహొన్నతుడు. అటువంటి వ్యక్తిని మళ్లీ చూడలేం.’ అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. చచ్చినవారి కళ్లు చారడేసి అంటారు. కానీ బతికుండగానే అజాత శత్రువుగా అంతటి ప్రశంసలు పొందడం అసాధారణం. అనుపమానం. అంతటి గౌరవప్రతిష్టలు జీవనకాలంలో పొందిన అరుదైన వ్యక్తి అటల్ బిహారీ వాజపేయి. మిత్రులు,శత్రువులు అన్న భేదం లేకుండా అందరి మన్ననలు పొందడం రాజకీయాల్లో అపూర్వ ఘట్టం. దేశభక్తి, సిద్దాంతనిబద్ధత, నైతిక విలువలు మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశహితం కోసం ప్రత్యర్థిని సైతం ప్రశంసించే లక్షణం ఆయనకు సహజ ఆభరణం. ఆ వైశిష్ట్యమే సమకాలీన రాజకీయాల్లో శిఖరసమానుడిగా నిలిపింది. చిరస్మరణీయుడిని చేసింది.

నెహ్రూ మెచ్చిన నేత...

నాలుగు రాజకీయ తరాలను చూడటం చిన్నవిషయం కాదు. కేవలం ఆయా తరాల్లో జీవించడం కాదు. దేశం మొత్తాన్ని ప్రభావితం చేయడం, ప్రముఖ పాత్ర వహించడం వాజపేయి ప్రత్యేకత. స్వాతంత్ర్యానికి ముందు తరం నెహ్రూతో మొదలైన రాజకీయ ప్రస్థానం రాహుల్ ప్రవేశం వరకూ క్రియాశీలకం గా ఉండటం మాటల్లో చెప్పలేం. క్విట్ ఇండియా నినాదంతో దేశభక్తిని చాటుకుని జైలుజీవితంతో మొదలైన ఉద్యమస్వభావం, ఇందిర అత్యయిక పరిస్థితిని ఎదిరించి జైలుకెళ్లడం వరకూ కనిపిస్తుంది. 1950 లలోనే నెహ్రూ వంటి నేత భవిష్యత్తులో ఇతను దేశానికి ప్రధాని అవుతాడని ఢంకాబజాయించి చెప్పారంటే వాజపేయి శక్తిసామర్ధ్యాలు అర్థమవుతాయి. రెండో లోక్సభనుంచి 13 వ లోక్ సభ వరకూ రెండుపర్యాయాలు మినహాయించి వరసగా ఎన్నిక కావడం ప్రజల ప్రియతమ నేతగా ఆయన ప్రభావానికి అద్దం పడుతుంది. దాదాపు యాభైసంవత్సరాలపాటు అత్యున్నత చట్టసభలకు ప్రతినిధిగా కొనసాగుతూ భారత ప్రగతి రథంలో అన్నిటా తానున్నానని నిరూపించుకున్నారు. కష్టాలు, కడగండ్లతో మొదలైన స్వతంత్రభారత తొలి అడుగుతో మొదలుపెట్టి సంక్షేమపథకాలు, సంస్కరణలు, మౌలిక వసతులు, అధునాతన సాంకేతిక శకం వరకూ భారత్ వేసిన ప్రతి అడుగులోనూ తనదైన ముద్ర కలిగిన నాయకుడు వాజపేయి.

ఇందిరకు ఇమేజ్...

రాజకీయాల్లో ప్రత్యర్థిని శత్రువుగా చూస్తుంటారు. మంచి చేసినా పొగడలేరు. అదెక్కడ పొలిటికల్ మైలేజీ ఇచ్చేస్తుందోననే భయం. కానీ వాజపేయి ఇందుకు విరుద్ధం. పాకిస్తాన్ తో యుద్దం చేసి, బంగ్లాదేశ ఏర్పాటులో కీలకపాత్ర పోషించినప్పుడు దుర్గ అంటూ ఇందిర ను అభివర్ణించారు. 1974లో అణుపరీక్షలు నిర్వహించినప్పుడు దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ప్రధాని ఇందిరను మరోసారి గట్టిగా సమర్థించారు. అదే ఇందిర ఎమర్జెన్సీ విధిస్తే ఎదిరించి నిలిచారు. జనసంఘ్ ను జనతాలో భాగం చేసి కాంగ్రెసును మట్టి కరిపించారు. ప్రత్యర్థులు సందర్బానికే తప్ప శాశ్వతం కాదనేది ఆయన నేర్పిన సూత్రం. రాజకీయాల్లో అంటరానివారు ఉండరు అనేది తరచూ చెప్పే సూక్తి. మిత్రులను మార్చగలం. కానీ ఇరుగుపొరుగును మార్చలేం. అంటూ కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్ తో శాంతి కోసం నిరంతరం తపించారు. అలాగని హద్దు మీరితే సహించేది లేదని కార్గిల్ యుద్దంతో చాటిచెప్పారు. కశ్మీర్ లో శాంతికి ఆయన చేసిన ప్రతిపాదనలే నేటికీ సిద్దాంతాలుగా చెబుతారు.

ప్రతిపక్షాలకు ప్రియమిత్రుడు...

బీజేపీ అంటే గిట్టని వారికి కూడా అటల్ ప్రియమిత్రుడు. మతోన్మాదం పేరిట బీజేపీని అంటరాని పార్టీగా ముద్ర వేసి పక్కనకూర్చోబెట్టాయి ప్రతిపక్షాలు. వ్యతిరేకించిన పార్టీలనే కలుపుకుని అతిపెద్ద ఐక్యకూటమిని నిర్మించారు. బీజేపీ గద్దె నెక్కిందంటే కేవలం అది వాజపేయి వ్యక్తిత్వ చలవే. ఈరోజున ఇంతపెద్దపార్టీగా ఎదగడంలో ఆయన వేసిన పునాదులే మూలాలు. దేశ రక్షణలో రాజీ పడని తత్వం. దేశాభిమానానికి నిలువెత్తు అద్దం. ఐక్యరాజ్యసమితిలో తొలిసారిగా జాతీయభాషాభిమానంతో హిందీలో గళం విప్పారు. పోక్రాన్ అణుపరీక్షలతో దేశాన్ని అణ్వాయుధ సంపత్తి గల దేశాల సరసన చేర్చారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు ఈవిషయంలో ఎంత ఒత్తిడి చేసినా లొంగని ధీరత్వాన్ని కనబరిచారు. మౌలిక వసతులే మనదేశ ఆర్థికపథాన్ని మారుస్తాయని గ్రహించి స్వర్ణచతుర్భుజి రహదారులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి సడక్ యోజనను పట్టాలకెక్కించారు. సమాచార సాంకేతిక సంకెళ్లను తెంచేసి సెల్ ఫోన్ విప్లవానికి నాంది పలికారు. మధ్యతరగతి ప్రజానీకానికి మహర్దశ పట్టింది వాజపేయి కాలంలోనే. అలాగని పేదలనూ మర్చిపోలేదు...ధర్మనియతి లేని రాజ్యంలో రాజు ఎవరైతేనేం, కన్నీళ్లు కార్చాల్సింది నిరుపేద నిర్భాగ్యులే..అన్న తన కవితాసూత్రాన్ని ఆజన్మాంతం దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. భరత భూమిపై ఆయనకు గల ప్రేమ అచంచలం. ‘ యే వందన్ కీ దర్తీ హై, అభినందన్ కీ దర్తీ హై, యే అర్పణ్ కీ భూమి హై, తర్పణ్ కీ భూమి హై‘ అన్న ధీరోదాత్తునికి విషాదాశ్రువులతో అసేతు హిమాచలం అంతిమనివాళులర్పిస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News