తడవకో మాట.. వైగోను నమ్ముతారా?

వైగో అంటే ఎవరికీ తెలియని పేరు కాదు. తమిళనాడులోనే కాదు వైగో పేరు దేశమంతా సుపరిచితమే. వివాదాల్లో ఎక్కువ కాలం ఉండే వైగో ఈసారి తమిళనాడు ఎన్నికల్లో [more]

Update: 2021-01-03 18:29 GMT

వైగో అంటే ఎవరికీ తెలియని పేరు కాదు. తమిళనాడులోనే కాదు వైగో పేరు దేశమంతా సుపరిచితమే. వివాదాల్లో ఎక్కువ కాలం ఉండే వైగో ఈసారి తమిళనాడు ఎన్నికల్లో కీలకపాత్రను పోషించనున్నారు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో జత కట్టడం వైగో హాబీ. అలాగే తాను ముఖ్యమంత్రిని పలానా వాళ్లను చేస్తానని శపథం చేసి మరీ బరిలోకి దిగుతారు వైగో. అలాంటి వైగో ఈసారి డీఎంకే కూటమిలో ఉన్నారు.

డీఎంకే నుంచి…..

వైగో నిజానికి డీఎంకే నేతగానే చెప్పాలి. కరుణానిధితో విభేదించి 1993లో ఆయన డీఎంకేని వీడి బయటకు వచ్చారు. తర్వాత ఎండీఎంకే (మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం) పార్టీని స్థాపించారు. అయితే వైగో తమిళనాడులో అన్ని పార్టీలతో కలసి నడిచిన చరిత్ర ఉంది. 1998లో అన్నాడీఎంకే తో కలసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈఎన్నికల్లో వైగో పార్టీకి మూడు స్థానాలు దక్కాయి. 1999లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో డీఎంకేతో కలసి పోటీ చేశారు. నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఇలా రెండు ప్రధాన పార్టీలతో జత కట్టిన వైగో ఎప్పటికప్పడు తన వైఖరి ఇదేనని చెబుతున్నారు.

అన్ని పార్టీలతో కలసి…..

2016లో జరిగిన ఎన్నికల్లో వైగో డీఎంకే, అన్నాడీఎంకేలను విభేదించారు. తానే ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేశారు.వైగోకు డీఎండీకే టీఎంసీ, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలతో కలసి విడిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆ ఎన్నికల్లో తాను విజయ్ కాంత్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రచారంలో ప్రధానంగా వైగో ప్రస్తావించారు. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ డీఎంకేతో పాత్తు పెట్టుకుని డీఎంకే గుర్తు మీద పోటీ చేసి ఒక్క స్థానాన్ని దక్కించుకున్నారు.

స్టాలిన్ ను సీఎం చేస్తానంటూ….

ఇప్పుడు తాజాగా వైగో పార్టీ డీఎంకేతోనే కొనసాగుతుంది. తాను ఈసారి స్టాలిన్ ను ముఖ్యమంత్రిని చేస్తానని తమిళనాడులో మళ్లీ బయలుదేరారు వైగో. గతంలో విజయకాంత్ ను చేస్తానని, ఇప్పుడు స్టాలిన్ ను చేస్తానని చెప్పడాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో వల్ల డీఎంకే నష్టపోయింది. అందువల్ల ఈసారి వైగో పార్టీని వదులుకోకపోయినా ఆయన ఎన్ని సీట్లు ఆశిస్తారన్న టెన్షన్ స్టాలిన్ ను పట్టుకుంది. మొత్తం మీద వైగో మరోసారి ముఖ్యమంత్రిని చేస్తానని బయలుదేరడం తమిళనాడులో హాట్ టాపిక్ అయింది.

Tags:    

Similar News