పెద్దాయనా… ఇది మన కాలం కాదు నాయనా?

వి.హనుమంతరావు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. కాంగ్రెస్ లోనే పుట్టి ఆ పార్టీలోనే ఎదిగిన నేత. అయితే తనకు తానుగా ఎక్కువ ఊహించుకుంటారు. జనాదరణ నేత అని [more]

Update: 2021-01-08 11:00 GMT

వి.హనుమంతరావు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. కాంగ్రెస్ లోనే పుట్టి ఆ పార్టీలోనే ఎదిగిన నేత. అయితే తనకు తానుగా ఎక్కువ ఊహించుకుంటారు. జనాదరణ నేత అని తెలిసినా తాను బీసీలకు లీడర్ నని చెప్పుకుని తిరుగుతారు. వైఎస్ హయాంలోనూ ఆయనకు వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. రాజీవ్ గాంధీ హయాంలో వి.హనుమంతరావు ఒక వెలుగు వెలిగారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన వి.హనుమంతరావు ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు.

ప్రతి దానికీ…..

వి.హనుమంతరావుకు ఆ అవకాశం కూడా రాలేదు. అయితే ప్రతి విషయంలో తాను పోటీలో ఉంటానని చెప్పడం ఆయన నైజం. ముఖ్యమంత్రి పదవికి కూడా తాను అర్హుడేనంటారు. పీసీసీ చీఫ్ పదవిని తనకు కాక ఇంకెవరికి ఇస్తారని ప్రశ్నించినా ఆయనకే చెల్లుతుంది. ఇందుకు ఆయన తన సీనియారిటీని, గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను ఉదాహరణగా చూపుతుంటారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వి.హనుమంతరావు ఆటలో అరటిపండుగానే మారిపోయారన్నది వాస్తవం.

పార్టీ కార్యక్రమాల్లో…..

ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ముందుగా జెండా పట్టుకుని నిలుచునేది వి.హనుమంతరావు మాత్రమే. అయితే ఆయనకు ప్రజాదరణ లేకపోవడంతో నేతలు కూడా ఆయనను లైట్ గా తీసుకుంటారు. ప్రతి కార్యక్రమంలో వి.హనుమంతరావు హడావిడి, వివాదాలు నిత్యం ఉంటాయి. అయినా ఆయనను నేతలు భరిస్తూ ఉంటారు. కారణం పెద్దాయన కాబట్టే. కానీ పీసీసీ చీఫ్ విషయంలో వి.హనుమంతరావు పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు మరింత చెడ్డ పేరును తెచ్చిపెట్టాయి.

అధిష్టానం సీరియస్…..

మాణికం ఠాగూర్ తమిళనాడు నుంచి వచ్చిన నేత. ఆయనకు తెలంగాణ రాజకీయాలు పెద్దగా తెలియవు. అయితే ఆయన మీదనే అవినీతి ఆరోపణలు చేయడంతో హైకమాండ్ సయితం వి.హనుమంతరావుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమచారం. పార్టీని వీడతానని చెప్పడాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో వి.హనుమంతరావును స్థానిక నేతలు కూడా దూరం పెట్టాలని భావిస్తున్నారు. ఆయనకు ప్రయారిటీ ఇచ్చే కొద్దీ రెచ్చిపోతారని, పట్టించుకోకుంటే తన పని తాను చేసుకు వెళతారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. వి.హనుమంతరావుకు భవిష్యత్ లో పార్టీలో పెద్దగా ప్రయారిటీ ఉండదన్నది వాస్తవం.

Tags:    

Similar News