జగన్ ఈ పథకాన్ని డైవర్ట్ చేస్తున్నారా?

ఎక్కడి గోదావరి మరెక్కడి విశాఖ. రెండు వందల కిలోమీటర్ల దూరం. అయినా మెగా సిటీకి గొంతెండిపోతే గోదారే శరణ్యం అవుతోంది. ఇది ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల [more]

Update: 2020-12-07 11:00 GMT

ఎక్కడి గోదావరి మరెక్కడి విశాఖ. రెండు వందల కిలోమీటర్ల దూరం. అయినా మెగా సిటీకి గొంతెండిపోతే గోదారే శరణ్యం అవుతోంది. ఇది ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల క్రితమే గోదావరి జలాలు విశాఖకు తరలించాలని నాటి కాంగ్రెస్ నాయకులు ఉద్యమాలు చేశారు. చంద్రబాబు సర్కార్ మీద వత్తిడి తెచ్చారు. ఆ తరువాత వైఎస్సార్ హయాంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరిట ప్రాజెక్ట్ కి శంఖుస్థాపన చేశారు. అప్పట్లో యాభై కోట్లతో పనులు మొదలుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరణించడంతో ఈ పధకం కూడా అటకెక్కింది.

కొబ్బరి కాయలే మిగిలాయా…?

ఇక వైఎస్సార్ తరువాత వచ్చిన సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మరోమారు కొబ్బరి కాయ కొట్టేసి ఈ పధకం మాదేనని చెప్పేసుకున్నారు. ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి అయి ఏడాదిన్నర అయింది. జగన్ ఈ మధ్య ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల మీద అధికారులకు సూచనలు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం ఇంకా ఏదీ జరగలేదు అని చెప్పాలి.

పైప్ లైన్ ద్వారానా…?

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మరో కొత్త ప్రాజెక్ట్ ని తెర మీదకు తెస్తున్నారు, గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్ ఉంచి పైప్ లైన్ల ద్వారా విశాఖ నగరానికి తీసుకురావాలనుకుంటున్నారుట. సరిగ్గా ఇక్కడే తెలుగుదేశం అభ్యంతరం పెడుతోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకం ఉంది కదా. దాన్ని పూర్తి చేస్తే గోదావరి నీళ్ళు వస్తాయి కదా అంటోంది. పైగా చంద్రబాబు హయాంలోనే తాము పూర్తి చేద్దామనుకున్నామని పొలిటికల్ కలరింగ్ ఇస్తోంది. విశాఖ దాహార్తిని తీర్చేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా లేదని ఆడిపోసుకుంటున్నారు. పోలవరం వెంటనే పూర్తి చేయాలని, విశాఖ కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా తలపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అయ్యే పనేనా…?

నిజానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మంచి పధకం. వైఎస్సార్ కాన్సెప్ట్ ఇది. దీని వల్ల విశాఖ సహా మూడు జిల్లాలకు తాగు, సాగు నీరు అందుతుంది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఈ పాటికి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని చెబుతారు.అలాగే పారిశ్రామిక అవసరాల కోసం సమృద్ధిగా నీరు ఉపయోగించుకోవడమే కాకుండా ముప్పై లక్షల జనాభాకు తాగు నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. గోదావరి నుంచి వచ్చే వరద నీటిని ఉపయోగించుకోవాలని అలా 63 టీఎంసీల నీరు మళ్ళిస్తే ఈ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని కూడా అంచనా వేశారు. ఇందుకోసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో ఆలోచన చేయకుండా ఈ ప్రాజెక్ట్ చేపడితే శాశ్వతంగా ఉత్తరాధ్రాకు పరిష్కారం చూపించిన వాళ్ళు అవుతారని అంటున్నారు. మరి తమ ప్రభుత్వం విశాఖకు గోదావరి జలాలను తీసుకువస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు కానీ ఆ దిశగా కచ్చితమైన చర్యలు ఉన్నాయా అన్నదే సందేహమే.

Tags:    

Similar News