ఉన్నా లేనట్లేనా? ఉనికిని కోల్పోయినట్లేనా?

ఐక్యరాజ్య సమితి… అత్యున్నత అంతర్జాతీయ సంస్థ. దీనిని ప్రపంచ దేశాల పార్లమెంట్ అని కూడా పిలుస్తుంటారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కొలువైన ఈ సంస్థ అక్టోబరు మొదటి [more]

Update: 2020-10-24 16:30 GMT

ఐక్యరాజ్య సమితి… అత్యున్నత అంతర్జాతీయ సంస్థ. దీనిని ప్రపంచ దేశాల పార్లమెంట్ అని కూడా పిలుస్తుంటారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కొలువైన ఈ సంస్థ అక్టోబరు మొదటి వారంలో 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రపంచదేశాధినేతలు గంభీరమైన ప్రసంగాలు చేశారు. అయితే అసలు విషయమైన సంస్కరణలపైన ఉద్దేశ పూర్వకంగానే మౌనం వహించారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం మళ్లీ అటువంటి పరిస్థితి ఎదురవకుండా ఓ అంతర్జాతీయ సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో 1945లో దీనిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఏ వ్యవస్థకైనా, సంస్థకైనా , దేశానికైనా, ప్రభుత్వాలకైనా మార్పు అవసరం. కాలానుగుణంగా మారని వ్యవస్థలు, సంస్థలు క్రమంగా ఉనికిని కోల్పోతాయి. మనుగడకు ముప్పు కలుగుతుంది. నామమాత్ర సంస్థలుగా మిగిలిపోతాయి. ఇప్పడు ఐక్యరాజ్యసమితి కచ్చితంగా అలాంటి పరిస్థితి నే ఎదుర్కొంటోంది.

ఆ ఐదు దేశాలే…..

అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాల విశ్వసనీయతను కోల్పేయే ప్రమాదం ఏర్పడింది. అది కొన్ని కీలక దేశాల గుప్పెట్లో చిక్కుకు పోయిందని, వర్థమాన దేశాల వాణిని బలంగా వినిపించడంలో, వాటి తరఫున నిలబడటంలో విఫలమైందన్న వాదన చాలా వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆన్ లైన్ లో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. తద్వారా ప్రపంచ దేశాల వాణిని వినిపించారు. ఐరాస అనుబంధ సంస్థ అయిన భద్రతా మండలిలో అయిదు శాశ్వత, 15 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. ఫలితంగా ఇవి వీటో అధికారం కలిగి ఉన్నాయి. దీంతో ఈ అయిదు దేశాలు ప్రపంచ వ్యవహారాలను నియంత్రిస్తున్నాయి.

విన్నపాలు అరణ్య రోదేనే……

అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వీటికి శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. వీటిల్లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఐరోపా దేశాలు. ఒకే ఖండానికి చెందివి. చైనా ఆసియా ఖండానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇక అమెరికా పరిస్థితి ప్రత్యేకం. ప్రపంచంలో ని ఏ ఇతర దేశానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కావాలన్నా ఈ అయిదు దేశాలూ అంగీకరించాలి. ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఇంతే సంగతులు. దీంతో గత ఏడున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ నిర్ణయాల్లో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం కొరవడుతోంది. వెనకబడిన, సమస్యాత్మక ప్రాంతమైన ఆఫ్రికా ఖండానికి భద్రతా మండలిలో నేటికీ ప్రాతినిథ్యం లేకపోవడం ఆందోళన, ఆవేదన కలిగించే విషయం. ఈ ఖండానికి చెందిన దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి దేశాలు మండలిలో సభ్యత్వం కోసం చేస్తున్న విన్నపాలు అరణ్య రోదనలు అవుతున్నాయి.

ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా…..

ప్రపంచంలోనే అతి పెద్ద ఖండంగా గుర్తింపు పొందిన ఆసియాకు అరకొర ప్రాతినిథ్యమే. ఈ ప్రాంతం నుంచి ఒక్క చైనా మాత్రమే మండలిలో సభ్యత్వం కలిగి ఉంది. భారత్, జపాన్ మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉంది పరిస్థితి. జపాన్ మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. మండలి హోదాకు అది అన్నివిధాలా అర్హురాలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల వల్ల ఎక్కువగా నష్టపోయింది ఆ దేశమే. ఈ ఖండంలోని భారత్ శాశ్వత సభ్యత్వం పొందడానికి అన్నివిధాలా అర్హురాలనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జనాభా పరంగా నూ చైనా త రవాత రెండో అతి పెద్ద దేశం. క్రమం తప్పకుండా ఎన్నికలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మైనార్టీలకు స్వేచ్ఛ, విభిన్న మతాలు, కులాలు, వర్గాలు సామరస్యంగా జీవించడం వంటి ప్రత్యేకతలతో యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అయినా భారత్ వాదనపై స్పందన కొరవడింది. తాజా ప్రసంగంలో ప్రదాని మోదీ ఈ విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు. ఒక్క చైనా మినహా మిగిలిన నాలుగు శాశ్వత సభ్యత్వ దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా భారత్ విషయంలో సుముఖంగా ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో అంతర్జాతీయ యవనికపై బ్రిటన్, ఫ్రాన్స్ పాత్ర శూన్యం. ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేసే స్థితిలో అవి లేవన్నది చేదునిజం. అప్రాధాన్య దేశాలను
తొలగించడమో, లేదా విస్తరించి భారత్ , జపాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడం నేటి అవసరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News