అమిత్ షాను కలవడంతోనే అంత జరిగిపోతుందా?

తెలుగుదేశం పార్టీకి దాదాపు రెండేళ్ల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో టీడీపీలో రెట్టించిన ఉత్సాహం కన్పిస్తుంది. టీడీపీ ఎంపీలు అమిత్ [more]

Update: 2021-02-04 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి దాదాపు రెండేళ్ల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో టీడీపీలో రెట్టించిన ఉత్సాహం కన్పిస్తుంది. టీడీపీ ఎంపీలు అమిత్ షాను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ప్రధానంగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, మతమార్పిడులు, టీడీపీ నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులు, దాడుల విషయాన్ని కూడా అమిత్ షా వద్ద ప్రస్తావించారు.

చర్యలు తీసుకుంటామని…..

అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎంపీలు తమకు అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర హోంశాఖకు ఆధారలను సమర్పించాలని కోరారన్నారు. తాము ఆధారాలతో సహా హోంశాఖకు ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. అమిత్ షా తో భేటీ కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ఎంపీలు ఇచ్చిన వినతి పత్రాన్ని అమిత్ షా స్వీకరించారని అంతకు మించి అక్కడ ఏం జరగలేదని వెంటనే బీజేపీ నేతలు రియాక్ట్ కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

దాదాపు రెండేళ్ల తర్వాత…

2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక బీజేపీ నేతలతో టీడీపీ నేతలు కలిసింది లేదు. పైగా ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇవన్నీ ఎలా మర్చిపోతామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకూ ఢిల్లీ గడప కూడా తొక్కలేదు. రెండేళ్ల తర్వాత తొలిసారి అమిత్ షా టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తొలి అడుగు అంటూ….

అమిత్ షా అపాయింట్ మెంట్ మంచి సంకేతాలని టీడీపీ భావిస్తుంది. భవిష్యత్ లో కలసి పనిచేసేందుకు తొలి అడుగు పడిందంటున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని చెబుతున్నారు. బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఆలోచన ఉంటే అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ లో మాత్రం తమ ఫిర్యాదుపై అమిత్ షా స్పందించకున్నా పరవాలేదు కాని, అపాయింట్ మెంట్ ఇచ్చారు చాలన్న తృప్తిలో ఉన్నారు.

Tags:    

Similar News