మాజీ తమ్ముళ్ళకు మంత్రి కిరీటం ?

చంద్రబాబు మాయాజాలంలో, రాజకీయ మంత్రాంగమో ఏమైతేనేం. టీడీపీలో చంద్రబాబు పక్కన కుడి భుజంగా ఉంటూ వచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఇపుడు బీజేపీ [more]

Update: 2020-06-16 06:30 GMT

చంద్రబాబు మాయాజాలంలో, రాజకీయ మంత్రాంగమో ఏమైతేనేం. టీడీపీలో చంద్రబాబు పక్కన కుడి భుజంగా ఉంటూ వచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఇపుడు బీజేపీ ఎంపీలుగా మారిపోయారు. వారు అక్కడ ఉండి బాబు గురించి, టీడీపీ గురించి ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. సరే వారు కొత్త కమలనాధులో, పాత పసుపు నేతలో కానీ ఏపీకి చెందిన ఎంపీలుగా ఉంటున్నారు. వారికి ఇపుడు ఒక అవకాశం దక్కుతోందని ప్రచారం సాగుతోంది. మోడీ కేంద్ర మంత్రి వర్గం విస్తరిస్తారని, అందులో ఏపీలో ఒకరిని అదృష్టం పలకరిస్తుందని చెబుతున్నారు.

సుజనాదేనా…?

ఒకసారి కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి పేరు ఇపుడు మొదటి వరసలో ఉందని అంటున్నారు. సుజనా చౌదరి నాడు టీడీపీ ఎంపీగా బీజేపీ క్యాబినేట్ లో పంచుకున్నారు. ఇపుడు ఏకంగా కాషాయం కప్పుకుని పూర్తి స్థాయి పార్టీ మనిషిగా పగ్గాలు అందుకుంటారని అంటున్నారు. ఏపీలో కోస్తాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి ఆర్ధికంగా కూడా బాగా ఉన్నవారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ ఏపీలో లేస్తుందా అన్న ఆలోచనలు ఢిల్లీ పెద్దల్లో ఉన్నాయట.

రమేష్ కి ఆఫర్ …..

ఇక కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ కి కూడా భారీ ఆఫర్ ఉందని అంటున్నారు. రమేష్ కి జగన్ సొంత జిల్లా మనిషి కావడం, బీసీ వర్గానికి చెందిన నేతగా ఉండడం, రాయలసీమ ప్రాంతం ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు. పైగా ఆయన కూడా బాగా స్థితిమంతుడే. ఆయనకు పదవి ఇస్తే సీమ జిల్లాల్లో పార్టీ ఏమైనా పుంజుకునే చాన్స్ ఉంటుందా అన్న ఆలోచన కూడా ఢిల్లీ వర్గాల్లో ఉందిట.

ఈ ఇద్దరేనా….?

ఇక ఏపీ నుంచి ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఈ ఇద్దరూ కూడా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. అందులో ఒకరు జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ఆయన మోడీ, అమిత్ షాలకు తలలో నాలుక. ఈ మధ్యనే జగన్ ఏడాది పాలన భేష్ అని పొగిడింది ఆయనే. వైసీపీతో మంచి రిలేషన్స్ కొనసాగించాలంటే రాం మాధవ్ కే మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. పైగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారు. పార్టీకి మొదటి నుంచి కట్టుబడిన వారు అని చెబుతున్నారు. ఒకవేళ ఆయన కనుక వద్దు అంటే జీవీఎల్ నరసిం హారావు పేరు కూడా రేసులో ఉందని అంటున్నారు. ఆయన కూడా వైసీపీకి సన్నిహితుడు అని పేరు. అంటే చంద్రబాబుతో భవిష్యత్తు సంబంధాలు పెనవేసుకోవాలంటే ఫిరాయింపు ఎంపీలకు చాన్స్ ఉంటుంది. జగన్ తో కలసి నడవాలి అంటే ఈ ఇద్దరికీ అవకాశం ఉంటుంది. ఈ మంత్రి పదవి ఎంపికతో బీజేపీకి జగన్, బాబులలో ఎవరు కావాలో తేలిపోతుందని అంటున్నారు.

Tags:    

Similar News