ఉండవల్లి కొత్త ఉద్యమం ఇదేనా?

Update: 2018-04-10 10:30 GMT

రాబోయేవి ఎన్నికలు. ఉద్యమాల వేళ......మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కొత్త తరహా ఉద్యమానికి సంఘ సంస్కరణల నిలయమైన గోదావరి తీరం నుంచి సదాశయంతో శ్రీకారం చుట్టారు. "అన్ని పార్టీలు రేపటి ఎన్నికల్లో మళ్ళీ ప్రజలను ఓటుకు రెండువేలరూపాయలు తక్కువ కాకుండా నోటు కొట్టి గెలవాలని చూస్తున్నారు. నేను ప్రజలను కోరేది ఒక్కటే పేదలు డబ్బులకు ఆశపడితే పడొచ్చు. మధ్యతరగతి వారు దీనినుంచి బయటపడలేక పోవొచ్చు, కానీ మీరు నోటు తీసుకుని ఇచ్చిన పార్టీకి మాత్రం ఓటు వేయొద్దు. అలా చేసి పాపం చేయకండి. అన్ని పార్టీలు ఇస్తే పుచ్చుకుని నోటా కు నొక్కండి. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు భాగస్తులు కండి" అని పిలుపునిచ్చారు ఉండవల్లి. దీనికి సంబంధించి ఆయన మాటల్లో ఏమి చెప్పారో చూద్దాం ...

ఇవి ఉండవల్లి లెక్కలు ....

"ఆ పార్టీ ద్రోహం చేసింది ఈ పార్టీ ద్రోహం చేసిందంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ తిరిగి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మీ ముందుకు రాబోతున్నారు. అలా గెలిచాక గతంలో ఏం జరిగిందో అదే సీన్ రిపీట్ అవుతుంది. కెవిపి రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమి జరిగింది. కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా ప్రయివేట్ బిల్లుకు విప్ కూడా జారీ చేసింది. దీన్ని బిజెపి తప్ప అన్ని పార్టీలు మద్దతుగానే నిలిచాయి. టిడిపి గోడమీద పిల్లిలా వున్నా వ్యతిరేకించలేదు. కానీ స్పీకర్ ఆఫీస్ లో సెక్రెటరీ జనరల్ తిరస్కరించారంటూ ఆ బిల్లుకు తిలోదకాలు ఇచ్చారు. అంటే సెక్రటరీ జనరల్ స్పీకర్ కన్నా ఎక్కువ అన్న మాట. ఆఫీసర్ కన్నా అటెండర్ మాటకే విలువ ఇచ్చినట్లుగా వుంది పరిస్థితి. ఇలా ప్రజాస్వామ్య హక్కులను, విలువలను కాలరాస్తున్నారంతా. ఎన్నికలు అయ్యాక హోదా ఎలా తెస్తారో ప్రతి పార్టీ చెప్పాలి. టిడిపి వైసీపీలు కేంద్రంలో ప్రధాని స్థాయిలో ఉండేవారు కాదు. ఎలా తెస్తారు..? రేపటి ఎన్నికల్లో యుపిఎ రావొచ్చు లేదా ఎన్డీయే రావొచ్చు. రాహుల్ హోదా కోసం సంతకం చేస్తా అని ఇప్పుడు చెప్పొచ్చు. కాంగ్రెస్, బిజెపి నేరుగా తలపడే సీట్లు 154 మాత్రమే. అధికారంలోకి రావాలంటే మెజారిటీ 273 సీట్లు కావాలి. అన్ని సీట్లు కాంగ్రెస్ సింగిల్ గా సాధించే పరిస్థితి లేదు. ఇక బిజెపి మొన్నటి ఎన్నికల లాగా పూర్తి మెజారిటీ సాధించలేదు. దాంతో ఈ రెండు పక్షాల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా మిత్రపక్షాలపై ఆధారపడవలిసిందే. ఐదేళ్ల తరువాత కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇప్పటికే ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎలా ఇస్తారు ప్రత్యేక హోదా అని ప్రశ్నించారు. వెనుకబడిన రాష్ట్రం ప్రాతిపదికన అయితే ఒడిస్సా ఆంధ్ర కన్నా అభివృద్ధి చెందలేదని ఆయన అంటున్నారు. పోనీ ఆ వాదన ఖండిద్దాం అనుకుంటే మన ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన చూడండి. 18 లక్షల 50 వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటున్నారు. దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఏపీకి నాలుగోవంతు వచ్చాయని ప్రకటించారు చంద్రబాబు. ఇవే లెక్కలు సాకుగా చూపి ఇతర రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీయవా ? మళ్ళీ గెలుస్తారు వెళతారు కానీ ఏమి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు వైఫల్యానికి ప్రతిపక్షం కారణమనడం ఏమిటో ఎక్కడన్నా విన్నామా..? ప్రభుత్వ వైఫల్యాలకు ప్రతిపక్షం బాధ్యత వహించాలా విడ్డురం కాదు." అని అన్నారు ఉండవల్లి.

ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు ...

"ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా నడుస్తుంది. మనది ఫెడరల్ వ్యవస్థ అని చెప్పడం తప్పు. యూనియన్ వ్యవస్థలో వున్నాం. రాష్ట్రాల మొత్తం బలం కేంద్రం చేతిలోనే ఉంటుంది. ఏ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నా విడగొట్టొచ్చు. కలపొచ్చు అనుకుంటే కలిపేయొచ్చు. అంతా వారి ఇష్టం. ప్రభుత్వంలో వుంది మీరు ఉద్యమాలు చేయడం కాదు. రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన స్ట్రేటజీ సిద్ధం చేయండి. ఏపీలో నాకు తెలిసి బిజెపి, కాంగ్రెస్ లు ఒక్క ఎంపీ సీటు గెలిచే పరిస్థితిలో ఇప్పటికైతే లేవు. మీకు ఓటేస్తే ఎలా హోదా తెస్తారో ప్రజలకు చెప్పండి. రాష్ట్రంలో అధికార పక్షం ఓటుకు రెండువేలరూపాయలకు కొనేందుకు సిద్ధమని ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్షం కూడా రెండు వేలు ఇచ్చేవారు ఎవరున్నారా? అని సీట్లు ఇచ్చేందుకు వెతుకుతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒకటే మార్గం. డబ్బు ఇచ్చి ఓట్లు కొనే పార్టీలను మూకుమ్ముడిగా ఓడించండి. పేదవారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అందువల్ల తీసుకుంటే తీసుకోండి కానీ ఆ పార్టీలను ఓడించండి." అని ఉండవల్లి పిలుపునిచ్చారు.

మీ ఓటు విలువ తెలుసుకోండి ...

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే తీసుకుంటే మనపై ఐదేళ్లలో బడ్జెట్ రూపంలో వెచ్చించే డబ్బు తో మీ విలువ లెక్క కడితే ఇలా వుంది. ఓటుకు రెండువేల రూపాయలకు అమ్ముకుంటే ఏడాదికి లక్షా 90 వేలకోట్ల రూపాయల బడ్జెట్ ను ఐదేళ్లకు గణిస్తే 9 లక్షల 50 వేలకోట్ల రూపాయలు. రాష్ట్ర ఓటర్లు మూడు కోట్ల మందిని లెక్కేస్తే తలసరి ప్రతి ఒక్కరు రూపాయి తొమ్మిది పైసలకు ఓటును అమ్ముకుని అధికార పార్టీ తప్పులు భరించేందుకు సిద్ధపడిపోతున్నారు. ప్రతి రోజు ఒక్కో ఓటరు పై 523 రూపాయలు ప్రభుత్వం చేసే ఖర్చును రూపాయికి అమ్మేసుకుంటారా ? ముష్టివాడు సైతం రూపాయి వేస్తే తిరస్కరిస్తున్నాడు. మనం పప్పు, ఉప్పు , సారాయి ,బస్సు , బియ్యం, సెల్ ఫోన్ , సినిమా , ఇలా ఏది కొన్నా కట్టే టాక్స్ ప్రతి ఏటా 65535 కోట్ల రూపాయలు. తలసరి 59.84 పైసలు పన్ను కడుతున్నాం. 11.75 పైసలు గతేడాది కన్నా ఎక్కువ." అని ఉండవల్లి వివరించారు.

20 నుంచి 30 కోట్లు ...

"అధికారంలోకి రావడానికి 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది రికవరీ చేసుకోరా ..?ప్రజా సేవ కోసం ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి గెలవాలని భావిస్తారా ? ఆలోచించండి. మీకు కనిపించే ప్రతివారికి చెప్పండి. ఆటో వారికి ఇంట్లో పనివారికి ఇలా అందరికి ఓటు విలువ ప్రబోధించండి. డబ్బు తీసుకుని ఇచ్చిన వారికి మాత్రం ఓటేయొద్దని చెప్పండి." అని ఉండవల్లి విన్నూత్న తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

Similar News