ఇప్పుడే లెక్కలు తేల్చలేం

వందరోజుల తరువాత మాట్లాడతా అన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ చెప్పినట్లు గానే మీడియా ముందు నోరు విప్పారు. ఈసారి ఆయన టార్గెట్ ప్రధాని మోడీ [more]

Update: 2019-10-02 03:30 GMT

వందరోజుల తరువాత మాట్లాడతా అన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ చెప్పినట్లు గానే మీడియా ముందు నోరు విప్పారు. ఈసారి ఆయన టార్గెట్ ప్రధాని మోడీ కావడం విశేషం. ముఖ్యంగా కాశ్మీర్ అంశంలో కేంద్రం వైఖరి అనేక అనర్ధాలకు దారితీస్తుందని గత చరిత్రను ఉటంకిస్తూ ఉండవల్లి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోను జరుగుతున్న పరిణామాలను తనదైన శైలిలో విశ్లేషించారు.

ప్రమాదాలకు కారణం ప్రభుత్వాలే వహించాలి…

గోదావరి లో జరిగిన బోటు ప్రమాదం కి బాధ్యత ప్రభుత్వంలో ఎవరు వున్నా వారు వహించాలిసిందే అన్నారు ఉండవల్లి. దురదృష్టకరమైన ఆ సంఘటనలో చనిపోయిన వారికి ఆయన సంతాపం ప్రకటిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం తరువాత కచ్చులూరు సాహసవీరులను తాను కలిశానని వారికి వున్న సమస్యలు విన్నానని అవి పరిష్కరించాలని జగన్ సర్కార్ కి సూచించారు. గోదావరిలో బోటు మునిగిన ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనదని అక్కడి నుంచి దాన్ని వెలికితీయడం కష్టమైన పనే అని చెప్పుకొచ్చారు.

అవసరమైతే గాంధీని కూడా …

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు రెండు నెలలపాటు కర్ఫ్యూ విధించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. చరిత్రను మోడీ సర్కార్ వక్రీకరించి ఓట్ల కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. నెహ్రు వల్లే కాశ్మీర్ కి ఈ గతి పట్టిందని బిజెపి సాగిస్తున్న ప్రచారం లో వాస్తవం లేదని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిందే నెహ్రు పాటించారని వారిద్దరూ అనుకునే అన్ని చక్కబెట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ విశదీకరించారు. కానీ నెహ్రు ను తప్పుపడుతూ రాజకీయ లబ్ది కోసం మోడీ, షా చేస్తున్న ప్రచారం మంచిది కాదన్నారు. కాశ్మీరీలపై అణచివేత మరింత తీవ్రవాదానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పాకిస్థాన్ భారత్ నుంచి వేరు పడిన సందర్భంలో జిన్నా నెహ్రు గాంధీ పటేల్, అంబేద్కర్ మధ్య జరిగిన చర్చలు షేక్ అబ్దుల్లా, జునాగఢ్ వివాదాలు అన్ని వివరించారు. దేశ వాసులు ఎంత గగ్గోలు పెట్టినా ఆరెస్సెస్ విధానాలను బిజెపి అమలు చేస్తుందని ఇది 70 ఏళ్ళక్రిత్రం దేశ వాసులు వ్యతిరేకించినది అని మరువకూడదు అని అన్నారు ఉండవల్లి.

చర్చలే పరిష్కారం …

కాశ్మీర్ లో అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేసి చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలని ఉండవల్లి సూచించారు. ఎప్పటికైనా కాశ్మీర్ లో చర్చలే సమస్యను పరిష్కరిస్తామని సైన్యం కాదని చెప్పారు అరుణ కుమార్. కానీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది కి జరుగుతున్న పరిణామాలు ప్రమాదకరమని హెచ్చరించారు. మోడీకి సమీప భవిష్యత్తులో ప్రత్యర్ధి లేరని ఆయన ఓట్ల రాజకీయం చేయడం మంచిది కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఇటీవల అమెరికా పర్యటనలో ట్రంప్ మోడీ ని జాతిపిత గా అభివర్ణించడాన్నిఎద్దేవా చేశారు ఉండవల్లి.

జగన్ నాలుగు నెలల పాలనపై …

జగన్ నాలుగు నెలల పాలనపై ఇప్పుడే వ్యాఖ్యానించడం సరికాదన్నారు అరుణ కుమార్. జగన్ నవరత్నాల అమలు జరగాలని వాటి మీద ప్రచారం చేసే అధికారంలోకి వచ్చారని చెప్పారు. అత్యధిక మెజారిటీ తో అధికారం చేపట్టడం వల్ల చిన్న మైనస్ కూడా పెద్దదిగానే కనపడుతుందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. విద్యుత్ విషయంలో ప్రభుత్వం పై ప్రజల్లో అసహనం ఏర్పడిందని అలాగే ఎమ్యెల్యేల గోడు ను ముఖ్యమంత్రి పట్టించుకోవాలని సూచించారు. ఇక ఇసుక పాలసీ గాడిన పడుతుందని పోలవరం లో రివర్స్ టెండరింగ్ లో అన్ని కోట్లు మిగులు రావడం అద్భుతమని వ్యాఖ్యానించారు. మరికొంత కాలం ఆగితే సర్కార్ పనితీరు లెక్కేయొచ్చని ప్రస్తుతం జగన్ పాలన మహా గొప్పగా లేదు అలాగని చెత్తగా లేదన్నారు ఉండవల్లి.

Tags:    

Similar News