ఉండవల్లి ఊరికే అనరు కదా

151 అసెంబ్లీ స్థానాలు… 51శాతం ఓట్లు… అయినా జగన్ కు ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసిన ఉండవల్లి వ్యాఖ్యల వెనక అర్థమేంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ [more]

Update: 2019-10-01 11:00 GMT

151 అసెంబ్లీ స్థానాలు… 51శాతం ఓట్లు… అయినా జగన్ కు ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసిన ఉండవల్లి వ్యాఖ్యల వెనక అర్థమేంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయ నేత. ఆయన ఒక మాట అనేముందు పలు కోణాల్లో అభిప్రాయాలను సేకరించే అలవాటుంది. ఒక ప్రకటన చేసే ముందు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని రకాలుగా అధ్యయనం చేసి మరీ చెబుతారు. అది పోలవరం ప్రాజెక్టు కావచ్చు. లేకుంటే రాజకీయాలు కావచ్చు. ఎన్నికలకు ముందు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని స్పష్టంగా చెప్పారు.

బాబు విషయలోనూ….

చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా ప్రజలు ఆయనను నమ్మరని ఉండవల్లి అరుణ్ కుమార్ ఖరాకండీగా చెప్పారు. అదే ఎన్నికల ఫలితాల్లో నిజమయింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపైన కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ సునిశిత విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శల్లో ముఖ్యమైంది ఎమ్మెల్యేల విషయంలోనే.జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోదని, వారిని సంతృప్తి పర్చాలని చెప్పారు. లేకుంటే పీవీ నరసింహారావు, ఎన్టీరామారావులకు ఎదురైన అనుభవమే జగన్ ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్.

టచ్ లో ఎమ్మెల్యేలు…..

ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. జగన్ గెలవాలని మనసులో కోరుకున్న వ్యక్తి ఉండవల్లి. ఆయనకు నేటికీ అనేకమంది నేతలతో సత్సంబంధాలున్నాయి. అన్ని పార్టీల నేతలూ ఆయనతో మాట్లాడుతూ రాజకీయ విషయాలను గురించి అడిగి తెలుసుకుంటారు. వైసీపీలోనిఅనేక మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, నియోజకవర్గాల్లో సమస్యలు ఎక్కువగా ఉండటం వంటి అంశాలపైనే ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నట్లు గుర్తించారు.

సమయం లేకపోవడం వల్లనేనా?

నిజానికి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించి నాలుగు నెలలే అవుతుంది. జగన్ ఎక్కువగా పాలనపైనే దృష్టి పెట్టారు. దీంతో జగన్ తో ఎమ్మెల్యేలు నేరుగా కలవలేక పోతున్నారు. కొందరు ముఖ్యనేతలను మినహాయిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ను కలిసిన ఎమ్మెల్యేలు అతి కొద్దిమంది మాత్రమే అని చెప్పాలి. వైఎస్సార్సీపీ ఎల్పీ సమావేశంలో మినహాయించి నియోజకవర్గ సమస్యలను వినేందుకు జగన్ కు సమయం లేదు. దీంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాట వాస్తవమేనని చెప్పాలి. అయితే ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా జగన్ మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను హెచ్చరికగా కాకుండా సూచనలుగా తీసుకోవాలని వైసీపీ నేతలూ అంగీకరిస్తున్న విషయం.

Tags:    

Similar News