అరుణ కుమార్ ఆశ నెరవేరుతుందా ...?

Update: 2018-07-20 03:55 GMT

ఎపి విభజన రాజ్యాంగ విరుద్ధంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిందన్నది మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ సుప్రీంకోర్ట్ కి ఎక్కిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘటనగా ఉండవల్లి ఆ వ్యవహారంపై సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి పార్లమెంట్లో జరిగే వాటిని కోర్ట్ పరిగణలోకి తీసుకోదు. కానీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగితే మాత్రం న్యాయస్థానాలు తలదూర్చే ఛాన్స్ ఉంటుంది. చట్ట సభల్లో జరిగిన తంతు రాజ్యాంగ విరుద్ధమనేది ఫిర్యాది ఆధారాలతో నిరూపించాలి. అధికార, విపక్షాలు ఏకమై చేసిన విభజన కావడంతో రెండు పార్టీలు మెజారిటీ లేకుండా బిల్లు ఆమోదానికి సంబంధించి ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు. దీన్ని కడిగేయాలిసిన ఏపీకి చెందిన టిడిపి, బిజెపితో మొన్నటిదాకా దోస్తీ కట్టడం వైసిపి బ్యాక్ డోర్ లో జై మోడీ అనడంతో ఇటు లోక్‌సభ లో పాత తప్పు ఎత్తి చూపే వారే లేకుండా పోయారు. అటు సుప్రీం లో కేంద్ర ప్రభుత్వం కావాలని తన వాదనకు దూరంగా వుంటూ కేసు ను ముందుకు సాగనీయడం లేదు. పార్లమెంటులోనూ చర్చ లేకుండా, కోర్ట్ లోను న్యాయం జరగక, జరిగిన ఘోరం సమాధి అయిపోయే పరిస్థితి ఏర్పడింది.

పూర్తి సాక్ష్యాధారాలతో ....

జరిగిన ఘోరం పై సవివర సాక్ష్యాలు కోర్ట్ కోసం సేకరించిన ఉండవల్లి అరుణ కుమార్ అవిశ్వాసం పై లోక్ సభలో చర్చ సందర్భంగా టిడిపికి అందజేశారు. ముఖ్యమంత్రి తో కలిసి వ్యూహం సెట్ చేశారు. ఎక్కడైతే కాంగ్రెస్, బిజెపిలు కలిసి అన్యాయం చేశాయో అక్కడే అమితుమీ తేల్చాలన్న పట్టుదలతో ప్రస్తుతం లోక్ సభ సభ్యుడు కాకపోయినా ఉండవల్లి పోరాటం మాత్రం వదిలిపెట్టలేదు. గత నాలుగేళ్లుగా అన్ని పార్టీల చుట్టూ తిరిగి తిరిగిన ఆయన శ్రమ ఎట్టకేలకు ఫలించింది. దీనికి బిజెపి, టిడిపి సంకీర్ణ భాగస్వామ్యాన్ని వదులు కోవడంతో ఉండవల్లి ప్రయత్నం కొలిక్కి వచ్చింది. టిడిపి మోడీ సర్కార్ పై పూర్తి స్థాయి పోరాట వైఖరి అవలంభిస్తే కానీ ఏపీలో మనుగడ సాధించలేని పరిస్థితి వుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి గతాన్ని తవ్వి ఉతికి ఆరేయక తప్పని స్థితి ఎదురైంది. టిడిపి ఈ వైఖరి తీసుకోక తప్పని పరిస్థితి ని వైసిపి, జనసేన లనుంచి కలిగించారు ఉండవల్లి.

ఇప్పుడు ప్రతీది సాక్ష్యమే అవుతుందా ...

ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగే చర్చలో అధికారంలో వున్న ప్రభుత్వం నాటి తప్పులకు జవాబు ఇవ్వక తప్పదు. అలాగే విపక్షంలో వున్న కాంగ్రెస్, బిజెపి ఏపీకి చేసిన అన్యాయంపైనా ధ్వజం ఎత్తితీరాలిసిందే. ఇలా అధికార విపక్షాలు సాగించే యుద్ధంలో పరస్పరం చేసుకునే వ్యాఖ్యలు ఆన్ రికార్డ్ గా నమోదు కాబడి, గత లోక్ సభలో రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదింప బడిన బిల్లు సంగతి మొత్తం తేటతెల్లం అవుతుంది. లోక్ సభ లో జరిగిన ఆ చర్చ రికార్డ్ లే సుప్రీం కోర్ట్ కి సాక్ష్యాలుగా సమర్పించే అవకాశం లభిస్తుంది. దేశంలో ఎప్పుడు జరగని ఇలాంటి పరిస్థితిపై సుప్రీం రాజ్యాంగ పరిరక్షణకు ఎలాంటి తీర్పు అప్పుడు ఇస్తుందన్నది జాతి మొత్తం ఎదురు చూస్తుంది. ఆ విధంగా జరగాలన్న ఆలోచనతోనే ఉండవల్లి గత నాలుగేళ్లుగా తాను ఎంపీగా వున్నప్పుడు పని చేసినదానికన్నా లేనప్పుడే ఎక్కువ కష్టపడి అనుకున్నది సాధించడానికి కృషి చేశారు. ఇప్పుడు అరుణ కుమార్ ఆశ ఏ మేరకు నెరవేరుతుందన్నది చూడాలి.

Similar News