ఉండవల్లి రివర్స్ అటాక్ అందుకేనటగా?

ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కరలేని పేరు ఇది. దాదాపుగా మూడున్నర దశాబ్దాల‌ పాటు రాజకీయాల్లో ఉన్న ఉండవల్లి మొదటి పేరు అనువాదకుడు, తరువాత పేరే నాయకుడు. [more]

Update: 2020-07-04 14:30 GMT

ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కరలేని పేరు ఇది. దాదాపుగా మూడున్నర దశాబ్దాల‌ పాటు రాజకీయాల్లో ఉన్న ఉండవల్లి మొదటి పేరు అనువాదకుడు, తరువాత పేరే నాయకుడు. ఢిల్లీ నుంచి ఎంత పెద్ద నాయకులు వచ్చినా కూడా ఆయన వారి ప్రసంగాలు అనువాదం చేయాల్సిందే. అలా రాజీవ్ గాంధీ ప్రసంగాన్ని అనువాదం చేస్తూ అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్సార్ కళ్లలో ఉండవల్లి అరుణ్ కుమార్ పడ్డారు. నాటి నుంచి ఆ బంధం గట్టిపడింది. ఉండవల్లి రెండు సార్లు రాజమండ్రీ నుంచి లోక్ సభకు ఎంపీ అయ్యారంటే అది వైఎస్ చలువతోనే వైఎస్ చరిష్మాతో ఆయన పార్లమెంట్ లో పదేళ్ల పాటు పనిచేయగలిగారు. ఇక వైఎస్ మరణానంతరం ఉండవల్లి కాంగ్రెస్ ని వీడలేదు, జగన్ మీద కూడా అయన ఓ దశలో గట్టిగానే రాజకీయ బాణాలు వేశారు.

అనుకూలంగా ….

ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన మూడేళ్ళ తరువాత పాదయాత్ర చేపట్టారు. ఆయనకు వచ్చిన జనాన్ని చూసి తొలిసారి ఉండవల్లి ప్రశంసలు వర్షం కురిపించారు. వైఎస్సార్ కి కూడా ఇంత జనం రాలేదని బాహాటంగానే అనేశారు. జగన్ తండ్రిని మించిన ప్రజాదరణ కలిగిన నేత అంటూ కితాబు ఇచ్చారు నాటి నుంచి జగన్ కి సమయం వచ్చినపుడల్లా మీడియా ముందుకు వచ్చి రాజకీయ సలహాలు ఇస్తూ తాను అండగా ఉన్నాను అనిపించుకున్నారు. మరో వైపు చంద్రబాబుని చెడుగుడు ఆడుతూ జగన్ కి కొంత అనుకూల వాతావరణం కల్పించారు.

ఆర్ధిక మంత్రిగా….

ఇక జగన్ ఒక సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానించారని అంటారు. అయితే ఉండవల్లి సున్నితంగా తిరస్కరించారని కూడా ప్రచారంలోకి వచ్చింది. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నాని కూడా ఉండవల్లి మీడియా ముఖంగా చెప్పేశారు. ఇక జగన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ని రాజమండ్రీలో ఓ కార్యక్రమంలో కలసినపుడు ఇద్దరు నాయకులు మనసు విప్పి మాట్లాడుతున్నారు. వైఎస్సార్ తమ ప్రియతమ నేత అని, ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవడం తనకు ఎంతో ఆనందమని పదే పదే మీడియాకు ఉండవల్లి చెప్పుకున్నారు. జగన్ గెలిచాక ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఆర్ధిక మంత్రి పదవి దక్కుతుంది అనేంతగా ఈ బంధం కొనసాగింది.

రివర్స్ గేర్……

అయితే గత ఏడాదిగా జగన్ మీద పెద్దగా విమర్శలు చేయని ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కసారిగా తాజా మీడియా మీటింగులో రెచ్చిపోవడంపై అందరూ షాక్ తిన్నారు. ప్రత్యేకించి వైఎస్సార్ అభిమానులు అయితే హర్ట్ అయ్యారు. జగన్ ని సీఎంగా ఇష్టపడడంలేదు అని ఉండవల్లి అనడం కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ రివర్స్ కావడం వెనక ఆయన అసంతృప్తి ఒకటి ఉందని అంటారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నా రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక మాత్రం ఉండవల్లికి ఉందని చెబుతారు.

నాలుగు వచ్చినా…

జగన్ కి ఏపీలో నాలుగు రాజ్య సభ సీట్లు వచ్చాయి. అందులో ఒకటి తనకు కేటాయిస్తారని ఆయన ఆశగా ఎదురుచూశారట. సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వస్తుందని కూడా వేచి చూసిన తరువాత నిరాశ దక్కడంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ రివర్స్ అయ్యారని వైసీపీలో ప్రచారం సాగుతోంది. మరి ఇదేంతవరకూ నిజమో తెలియదు కానీ జగన్ మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే గౌరవం ఇస్తారని చెబుతున్నారు. తన ప్రభుత్వం మీద ఉండవల్లి ఇంతలా రెచ్చి విమర్శలు చేసినా కౌంటర్ గా విమర్శలు చేయవద్దు అని జగన్ పార్టీ నాయకులతో అన్నట్లుగా కూడా ప్రచారం సాగింది. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కి మలివిడతలోనైనా రాజ్యసభ సీటు జగన్ ఇస్తారా. చూడాలి.

Tags:    

Similar News