ముగ్గురూ మొనగాళ్లే మనకు ఇబ్బంది లేదు

ఇటలీలో జీవన ప్రమాణాల కారణంగా ప్రతి వ్యక్తి 90 నుంచి 95 ఏళ్ళు జీవిస్తారు. అందుకే అక్కడ ఎక్కువ మంది వృద్ధులు కరోనా బారిన పడి ప్రాణాలు [more]

Update: 2020-03-26 05:00 GMT

ఇటలీలో జీవన ప్రమాణాల కారణంగా ప్రతి వ్యక్తి 90 నుంచి 95 ఏళ్ళు జీవిస్తారు. అందుకే అక్కడ ఎక్కువ మంది వృద్ధులు కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. ఇటలీలో ప్రజలు చేసిన నిర్లక్ష్యం మనం కానీ చేస్తే భారత్ కుప్పకూలిపోతుంది. అబ్బే… మనకేముంది అనుకుంటే రాజుగారి కథ లా ఉంటుంది. ఒకసారి రాజుగారితో చదరంగంలో గెలిచిన ఒక వ్యక్తి ఒక గడిలో ఒక పైసా పెట్టండి రెండో గడి లో రెట్టింపు అలా ప్రతీ గడి కి రెట్టింపు చేస్తూ వెళ్లాలని అంటాడు. ఆ లెక్క సరదాగా కడితే చదరంగంలో 64 గళ్ళు ఉంటాయి. చివరి గడి కి చేరేసరికి రాజుగారు చెల్లించాలిసి వచ్చేది తొమ్మిది వందల 19 కోట్ల 39 లక్షల 14 వేల 368 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ప్రపంచ జిడిపి లో ఒక శాతం అన్నమాట. కరోనా వైరస్ లెక్కా అలాగే ఉంటుంది అత్యంత ప్రమాదం. ఇంతే కదా అనుకుంటే వైరస్ వ్యాప్తి మొత్తం మనల్ని చుట్టేస్తుందని గ్రహించండి. అందరు పోతాం. అమెరికా,ఇటలీ, ఇరాన్, చైనా ల వంటి దేశాలతో పోలిస్తే అదృష్టం కొద్దీ మనకు అంత తీవ్రత లేదు అని గమనించి జాగ్రత్త పడదాం అని చెప్పారు ఉండవల్లి అరుణ కుమార్.

మోడీ మోనార్క్ …

మోడీ ప్రభుత్వ పాలనా తీరును నేను చాలా సందర్భాల్లో వ్యతిరేకించా. అది వేరు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సందర్భం లో మనకు నరేంద్ర మోడీ సరైన లీడర్. కరోనా నుంచి మోడీ నే దేశాన్ని గట్టెక్కిస్తారు అని నమ్ముతున్నా. జగన్ కి మంచి టీం ఉంది. వీరిద్దరూ పేదలకోసం ఆలోచించాలి. పేదవారికి అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వండి. అలాగే ప్రతిఒక్కరు వారికి సాయపడాలి. ఈ సందర్భం మనకు పీడకల కాదు అనుభవంగా మిగులుతుంది. నా వయస్సు వారికి కరోనా చాలా ప్రమాదకరం. జాగ్తత్తగా ఉండాలి. చిన్న వయస్సు వారు క్యారియర్స్ తోనే ప్రమాదం. దేశభక్తిని ప్రదర్శించాలిసిన తరుణం ఆసన్నం అయ్యింది. మీకు నచ్చినవి అన్ని తినండి. వెల్లుల్లి అల్లం ఇలా అనేకం. అలాగే ప్రార్ధనలు చేయండి ఏమి కాదు అయితే ఏమి చేసినా ఇంట్లో ఉండే చేయాలి. ఇంగ్లిష్ మందులు మాత్రం నెట్ లో చూసి వాడకండి. అది ప్రాణాంతంకం అని మర్చిపోవద్దు. బలమైన ప్రభుత్వాలు కేంద్రం లో రాష్ట్రం లో ఉన్నాయి అన్నారు ఉండవల్లి.

వారు రోడ్డెక్కకపోతే బతుకు లేదు …

రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పరిస్థితి దయనీయం. ఈ 21 రోజులు నిజమైన త్యాగం పేదవర్గాలదే అని మరిచిపోవద్దు. తిండి కోసం ఒక్కరుగా వెళ్లేవారు ఏ తిండి కోసమో రోడ్డెక్కుతారు. వారి పట్ల సానుభూతిగా మానవత్వంగా పోలీసులు వ్యవహరించాలి. గుంపులుగా కనిపిస్తే లాఠీకి పని చెప్పండి తప్పదు. తెలుగు వాళ్ళ సృజనాత్మకతకు అభినందనలు. దేవాలయాలు మూసివేశారంటే దేవుళ్ళు డాక్టర్లు గా బయటకు వచ్చారు అని అలాగే ఇంట్లో ఉంటే ఉగాది పచ్చడి తింటారు రోడ్డు ఎక్కితే పోలీసుల తో వళ్ళు పచ్చడి అంటూ రామ్ గోపాల్ వర్మ వంటి అనేకమంది పెడుతున్న పోస్ట్ లు స్ఫూర్తి దాయకం అన్నారు ఉండవల్లి అరుణ కుమార్.

జగన్ కి అపార బలం ఉంది …

దేశంలో ఏ రాష్ట్రానికి లేని బలగం జగన్ గ్రామ వాలంటీర్ల రూపంలో ఏర్పాటు చేసుకున్నారని దాన్ని సమర్ధవంతంగా ఆయన వినియోగించుకోవాలన్నారు ఉండవల్లి. ముఖ్యమంత్రి జగన్ కి వాలంటీర్లే శ్రీరామా రక్ష అన్నారు. కెసిఆర్ కి ఉన్న బలం ఆయనకు ఉందని తెలంగాణలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ప్రజలతో కమ్యూనికేషన్ లో కెసిఆర్ చాలా ముందు ఉన్నారని జగన్ ఈ విషయంలో తరచూ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెబుతూ ఉండాలన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు వంటివారు ప్రతిపక్షంలో ఉన్నారని, కనుక వారు తప్పులు వెతికి అధికారంలో వున్నవారిని విమర్శించడం సహజమే అని అది వారి బాధ్యత అన్నారు ఉండవల్లి అరుణ కుమార్. రాజకీయం తో ముడిపడకుండా దేశంలో ఏది లేదన్నారు ఆయన. విపక్షం చెప్పింది కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అనిపించినా ప్రభుత్వాన్నే ఫాలో కావాలన్నారు. అయితే మనకి మోడీ, జగన్, కెసిఆర్ వంటి దమ్మున్న నేతలు ఉన్నారని ఎవరు ఏమి చెప్పినా చివరికి ప్రభుత్వం ఏమి చెబితే అదే చేయాలని అన్నారు ఉండవల్లి. ఇండియా సంక్షోభం ఎదురైతే అంతా కలిసి పోతారని చాటిచెప్పాలి. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.

బయో వార్ అయినా కాకపోయినా …

చైనా బయోవార్ లో భాగమే కరోనా అయినా కాకపోయినా ప్రస్తుత కర్తవ్యం వైరస్ ను బ్రేక్ చేయడమే. ఇది ఎలా జరిగిందో తప్పకుండా బయటపడుతుంది. దానికోసం పరిశోధించి చెప్పేవాళ్ళు సమయం వచ్చినప్పుడు చెబుతారు. అది ఇప్పుడు సమయం కాదు. పేదల కోసం వారికి అండగా ఉండేందుకు తక్షణం ఎపి ప్రభుత్వం ఒక నిధిని ప్రకటించి అకౌంట్ నెంబర్ ఇవ్వాలని దానికి తనలాంటి వారు సాయం అందిస్తామన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ సంక్షోభం ముగిశాక మోడీ మనతో ఒక అడ్వేంచర్ చేయించారు అనిపించక మానదు. దీన్ని అవకాశం గా మలుచుకుందాం. వేయిలోపు దేశంలో కరోనా అరికట్టేలోగా ఉంటే మాత్రం ప్రపంచంలో టాప్ త్రీ లో గ్యారంటీ అన్నారు ఉండవల్లి అరుణ కుమార్. జగన్ చేతిలో వాలంటీర్లు అనే బ్రహ్మాస్త్రం ఉంది అది ప్రయోగించి ఖచ్చితంగా ఇక్కడ బ్రహ్మాంమైన ఫలితాలు సాధిస్తారు అని నమ్ముతున్నా. శ్రీరామ నవమి వెళ్లి దశమి వచ్చే నాటికి అంతా క్రమశిక్షణ పాటించి ఎదుర్కొని దేశభక్తి చాటితే కరోనాను తరిమి కొట్టేస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇది మోడీ వల్లే సాధ్యం అవుతుందని ముందుగానే ఆయన నిర్బంధం ఎత్తేసే అవకాశం ఉందని విశ్లేషించారు.

Tags:    

Similar News