ఉండవల్లి జగన్ పై ఎందుకు ఉరుముతున్నారు?

ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయవేత్త. ఆయన పార్లమెంటు సభ్యుడిగా రెండు దఫాలు మాత్రమే చేసిన ఆయన అనుభవం అపారం. రాజకీయ విశ్లేషణలను చేయడంలోనూ, పరిస్థితులను అంచనా [more]

Update: 2021-07-12 06:30 GMT

ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయవేత్త. ఆయన పార్లమెంటు సభ్యుడిగా రెండు దఫాలు మాత్రమే చేసిన ఆయన అనుభవం అపారం. రాజకీయ విశ్లేషణలను చేయడంలోనూ, పరిస్థితులను అంచనా వేయడంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ దిట్ట. అందుకే ఆయన మాటలకు అంత విలువ ఉంటుంది. ఆయన చేసే సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీల నేతలకు ఉంటుంది. ఇటు చంద్రబాబు, అటు జగన్ చేసిన తప్పులను ఎత్తిచూపడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు.

తరచూ జగన్ పై….?

అయితే ఇటీవల కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై తరచూ విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలకు కూడా మింగుడుపడటం లేదు. అది పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో ఉండవల్లి వ్యాఖ్యలు ప్రభావితం చేసినా పార్టీకి నష్టమే. అదే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. ఎటువంటి పదవులను కూడా ఆయన ఆశించడం లేదు. ఆయనను లొంగదీసుకోవడం ఎలా? అన్నది ఇప్పుడు వైసీపీ నేతలకు పెద్ద టాస్క్ గా మారింది.

వైఎస్ అంటే…?

ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ కు వీరాభిమాని. ఆయనపై పుస్తకం కూడా రచించారు. వైఎస్ వల్లనే తాను రెండుసార్లు ఎంపీని అయ్యానని బహిరంగంగా చెప్పుకుంటారు ఉండవల్లి. అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ తనయుడు జగన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది పార్టీ నేతలకు అర్థం కాకుండా ఉంది. పోలవరం విషయంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి వైసీపీ నేతలది. కనీసం కౌంటర్ కూడా ఇచ్చుకోలేకపోయారు.

పోలవరం నిర్వాసితుల విషయంలో…

పోలవరం నిర్వాసితుల విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జగన్ కూడా పది లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతున్నారు. నిర్వాసిితుల సమస్యను జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తండ్రి వైఎస్ లాగానే నిర్వాసితుల విషయంలో ఆలోచించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు సూచించారు. ఇది సూచనే అయినా ఒకరకంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదే. అదే సమయంలో రఘురామ కృష్ణరాజు విషయంలోనూ జగన్ ఇగోను వదులుకోవాలని చెప్పి ఉండవల్లి జగన్ కు ఇచ్చిన సలహా కూడా పార్టీలోనూ, ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ను రాజకీయంగా ఇబ్బందిపెడుతున్నారనే అనుకోవాలి.

Tags:    

Similar News