సుదీర్ఘ యుద్ధానికి ఉండవల్లి సిద్ధం అయ్యారా ?

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ రూటే సపరేట్. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏ పార్టీలో లేకున్నా ఉండవల్లి మాటలకు చాలా విలువే [more]

Update: 2021-04-17 08:00 GMT

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ రూటే సపరేట్. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏ పార్టీలో లేకున్నా ఉండవల్లి మాటలకు చాలా విలువే ఉంది. పక్కా రికార్డ్ లతో ఏ అంశం అయినా పండితుడి నుంచి పామరుడి వరకు అర్ధం అయ్యేలా వివరించడం లో ఆయనకు ఆయనే సాటి. మంచి అనువాదకుడిగా రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల వరకు ఆయన పనిచేశారు. దేశ రాజకీయాలపై మంచి పట్టున్న నేత కావడం హస్తినలో జరిగే పరిణామాలను సామాన్యుడికి సులువుగా అర్ధం అయ్యేలా బోధించడమే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాకా ఆయన పెట్టుకున్న పని. మరీ ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చేస్తున్న పనుల్లో రంధ్రాన్వేషణ చేయడమే ఉండవల్లి అరుణ కుమార్ కొంతకాలంగా చేస్తున్నారు. కేంద్రంలో తిరుగులేని బలంతో అధికారంలో ఉన్న మోడీ పై సుదీర్ఘ పోరాటమే చేయాలని ఉండవల్లి సంకల్పించారని ఆయన సన్నిహితుల టాక్.

కోర్టుల్లో నలుగుతున్న ప్రధాన కేసులు…

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు వరకు ప్రత్యేక హోదాపై పోలవరంపై ఆయన పదేపదే గళం ఎత్తేవారు. ఇక విభజన అశాస్త్రీయత పైన, రామోజీరావు మార్గదర్శిపైన సుప్రీం కోర్ట్ లో ఆయన కేసులు నడుస్తూనే ఉన్నాయి. వీటి అప్ డేట్స్ ను చెప్పడంతో బాటు ఎపి సర్కార్ లోపాలను ఉండవల్లి అరుణ కుమార్ ప్రస్తావిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఓటుకు నోటు కేసు వంటి సంచలన కేసులో సైతం ఉండవల్లి ఇంప్లిడ్ అయ్యారు.

మోడీ ప్రవేటీకరణపై పోరాటం …

ఈ దేశానికి ప్రయివేటీకరణ మంత్రం పని చేయదని ఉండవల్లి అరుణ కుమార్ త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు. ప్రభుత్వ – ప్రయివేట్ ల నడుమ సమానత ఉన్నప్పుడే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మోడీ పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాటానికి సంకల్పించారు ఉండవల్లి. గురూజీ గోల్వాల్కర్ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ఆర్ ఎస్ ఎస్ భావజాలం ప్రమాదకరమని వెల్లడిస్తూ విశాఖ ఉక్కు ప్రవేటీకరణ మొదలు అన్ని అంశాలపై అరుణకుమార్ ఉద్యమిస్తున్నారు. రైల్వే, ఎల్ ఐ సి వంటి వందకు పైగా ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించేందుకు మోడీ సర్కార్ రెడీ కావడంతో మొత్తం ఈ విధానంపైనే అంతా పోరాడాలని ఉండవల్లి చైతన్యపరుస్తున్నారు. ఉత్తరాదిన రైతు ఉద్యమానికి ఆయన తన సంఘీభావం ప్రకటించి రైతుల గిట్టుబాటు ధరలను కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తుందంటూ కామ్రేడ్స్ తో కలిసి పోరాటం చేస్తున్నారు.

పోలవరంపై బాంబులు పేలుస్తూ …

వైఎస్ మానస పుత్రిక పోలవరం ప్రాజెక్ట్ అంటే ఉండవల్లి అరుణ కుమార్ కు ప్రత్యేక ప్రేమ అన్నది ఆయన పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అన్న తరహాలో అనుమతుల సాధన ఉండవల్లి కి నాడు వైఎస్ అప్పగించడం తో కూడా ఇది పూర్తి అయ్యే వరకు దీంట్లో లోపాలపై ఎలుగెత్తి చాటడం ఉండవల్లి అరుణ కుమార్ ముఖ్య అజండాల్లో ఒకటిగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నా, వైఎస్ జగన్ సిఎం గా ఉన్నా పోలవరం అంశంలో తప్పులను మొహమాటం లేకుండా ఎండగడుతున్నారు ఉండవల్లి. కరోనా కారణంగా ఉండవల్లి అరుణ కుమార్ మీడియా సమావేశాలు జోరు తగ్గించుకున్నా పోలవరం పై లోతైన అధ్యయనంలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ శరవేగంగా నడుస్తున్న పోలవరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఉతికి ఆరేసేందుకు ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి కరోనా తగ్గుముఖం పట్టాకా ఉత్తుత్తినే అనే టైటిల్ తో భారీ బహిరంగ సభ ద్వారా గళం విప్పనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏ పదవిలో లేకపోయినా అకస్మాత్తుగా తెరమీద ప్రత్యక్షం అవుతూ ఎపి రాజకీయాల్లో ఉండవల్లి అరుణ కుమార్ వెలుగుతుండటం విశేషం.

Tags:    

Similar News