ఈ ఇద్దరి వల్లనే అది సాధ్యమయిందా?

పోలవరం ప్రాజెక్ట్ కి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్, కేవీపీ రామచంద్రరావు లకు అవినాభావ సంబంధం ఉంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతంగా [more]

Update: 2020-03-14 06:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ కి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్, కేవీపీ రామచంద్రరావు లకు అవినాభావ సంబంధం ఉంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతంగా చేపట్టిన ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ఆయన మరణం తరువాత అటక ఎక్కినట్లే అంతా భావించారు. ఏ అనుమతులు లేకుండానే వైఎస్ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టి రాష్ట్ర ఖర్చు తో వేగంగా పోలవరం కుడి ఎడమ కాలువలు తవ్వించారు. కీలకమైన అనుమతుల కోసం ఉండవల్లి అరుణ కుమార్ కి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ అరుణ కుమార్ తిరగడమే పనిగా పెట్టుకుని అనేక అనుమతులు లాబీయింగ్ ద్వారా సాధించేస్తూ వచ్చేవారు. ఆయనకు కెవిపి రామచంద్రరావు ఈ వ్యవహారంలో పూర్తి గైడెన్స్ ఇచ్చేవారు. ఇలా వీరిరువురికి పోలవరం అనుమతులే నాడు ప్రధాన అజెండా. వైఎస్ మరణం తరువాత కూడా ఉండవల్లి, కెవిపి లు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటూ నిరంతరం పోరాటం సాగించేవారు. రోశయ్య నేతృత్వంలో కొంత పనులు అయినా తెలంగాణ ఉద్యమం కారణంగా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాజెక్ట్ పనితీరు నత్తనడకనే సాగింది.

యుపిఎ వరం … ఎన్డీయే కొనసాగింపు …

అయితే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాంగ్రెస్ నష్టపోతున్న నవ్యాంధ్ర కు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి వరం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి అయ్యే మొత్తం వ్యయం కేంద్రమే భరించేలా పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది యుపిఎ సర్కార్. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా జరిగిన విభజన బిల్లు లో అంతా గందరగోళమే వుంది. దాంతో యుపిఎ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ దీనిపై రకరకాల ట్విస్ట్ లు ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ప్రాజెక్ట్ కి అత్యంత వ్యయం అయ్యే పునరావాస ప్యాకేజ్ కేంద్రం భరిస్తుందా లేదా అన్నది ఇప్పటివరకు తేల్చింది లేదు. గత టిడిపి ప్రభుత్వం పోలవరం తామే నిర్మించుకుంటామని కేంద్రం నుంచి లాక్కున్నా పునరావాస ప్యాకేజ్ ఎవరు ఇస్తారు అనే అంశం తేల్చకుండా మోడీ సర్కార్ ను గట్టిగా నిలదీయలేకపోయింది.

ఢిల్లీ లో కేవీపీ … గల్లీదాకా ఉండవల్లి …

అయితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడమే లక్ష్యంగా పెట్టుకున్న కెవిపి రామచంద్రరావు ఒక పక్క రాజ్యసభలో ఎప్పటికప్పుడు తన గళం వినిపిస్తూ ఉమ్మడి హై కోర్టు కి సైతం వెళ్ళి పునరావాస ప్యాకేజీ సంగతి తేల్చండంటూ ఒక్కడై ఉద్యమమే సాగించారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి విభజన బిల్లు సమయంలో బహిష్కృతుడు అయిన ఉండవల్లి అరుణ కుమార్ కెవిపి చట్టబద్ధంగా పోరాడితే తన పదునైన మాటల తూటాలతో ఎపి వాసుల దశాబ్దాల కల కోసం అలుపెరగని పోరాటమే చేస్తూ వస్తున్నారు. 2019 లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినా వీరిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తమ కు అత్యంత ఇష్టుడైన వైఎస్ తనయుడి పైనా వత్తిడి పెంచారు. అనవసర అంశాల జోలికి పోకుండా వేగవంతంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని వీలైతే కేంద్రానికి ఇది అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అంతేకాదు 33 వేలకోట్ల రూపాయల వరకు వ్యయం అయ్యే పునరావాస ప్యాకేజీ కేంద్రం చెల్లిస్తుందా లేదా అన్నది తేల్చమని తీవ్ర వత్తిడి తెచ్చారు. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన ఎంపిలను పార్టీలకు అతీతంగా కలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ పార్లమెంట్ లో వారు ప్యాకేజీ పై మాట్లాడేలా బాగా కృషి చేశారు. కేవీపీ సైతం పదేపదే లేఖలు ప్రశ్నోత్తరాల సమయాన్ని పోలవరం నిర్మాణ అంశంలో కేంద్రం తప్పించుకోకుండా, విభజన చట్టం అమలు చేయడం అనే అంశాలపైనే గట్టి ఫోకస్ పెట్టారు.

ఎట్టకేలకు కరుణించిన కేంద్రం …

అన్ని వైపులా పెరుగుతున్న వత్తిడి తో బాటు వైసిపి తో రాజ్యసభలో ఉన్న అవసరాల రీత్యా మోడీ సర్కార్ మొత్తానికి పునరావాస ప్యాకేజీ కేంద్రమే భరించేందుకు ముందుకు వచ్చింది. ఏపీ లో బిజెపి క్రేజ్ పెరగాలంటే కేంద్రం ఏమి చేసిందనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన జవాబు ఇవ్వలేని కమలం పార్టీకి పోలవరం జవాబు దొరికేలా చేయనుంది. అన్ని ఈక్వేషన్స్ ఆలోచించే కేంద్రం సైతం మొత్తానికి ప్రాజెక్ట్ అంశంలో వెనక్కి పోకుండా ముందుకు వచ్చి భరోసా ఇచ్చింది. పునరావాస ప్యాకేజీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా పోలవరం పై కమ్ముకున్న నీలినీడలు తొలిగేలా చేసింది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు పెరిగి నీటి నిల్వ మొదలు పెట్టినప్పటినుంచి ముంపు గ్రామాలను ఒక క్రమ పద్దతిలో పునరావాసం, నష్టపరిహారం ఇస్తూ రావాలి. కనుక దీనిపై ప్రాజెక్ట్ నిర్మాణం సాగిస్తున్న ఎపి సర్కార్ వేగంగా దూసుకుపోవొచ్చు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఇప్పటికే జగన్ సర్కార్ హామీ ఇచ్చినా అది ఎంత వేగంగా చేసినా పూర్తి కాదన్నది నిపుణులు చెబుతున్న మాట. అయితే కేంద్రం పూర్తి సహకారం నిధుల రూపంలో భారీగా ఉంటే మాత్రం మరో రెండు ముడేళ్ళల్లో పోలవరం కల సాకారం కానుంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం వైఎస్ అప్పగించిన పనిని ఆయన తదనంతరం కూడా కొనసాగించిన ఉండవల్లి అరుణ్ కుమార్, కెవిపి లు మాత్రం పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో రాజశేఖర రెడ్డి తో పాటు నిలిచిపోతారనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News