ఫైర్ బ్రాండ్ మళ్లీ చెలరేగిపోతారా?

బీజేపీలో సీనియర్ నేత ఉమాభారతి పార్టీ అధినాయకత్వంపైనే కాలుదువ్వుతున్నారు. ఉమాభారతి ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ, అమిత్ షాల ఎంట్రీతో అప్పటి వరకూ [more]

Update: 2021-03-01 16:30 GMT

బీజేపీలో సీనియర్ నేత ఉమాభారతి పార్టీ అధినాయకత్వంపైనే కాలుదువ్వుతున్నారు. ఉమాభారతి ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ, అమిత్ షాల ఎంట్రీతో అప్పటి వరకూ ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఉమాభారతికి పార్టీ చెక్ పెట్టింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉమాభారతి అనేక పదవులు పొందారు. అయితే గత ఏడేళ్ల నుంచి ఉమాభారతికి రాజకీయంగా గడ్డుకాలమే ఎదురవుతుంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తొలిసారి ఆయన మంత్రివర్గంలో ఉమాభారతి పనిచేశారు.

వాజ్ పేయి, అద్వానీ హయాంలో…

వాజ్ పేయి, అద్వానీల హయాంలో ఉమాభారతి ఒక వెలుగు వెలుగొందారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఆమెకు ముద్ర ఉంది. అయోధ్య మసీదు కూల్చి వేత సమయంలోనూ ఉమాభారతి కీలక పాత్ర పోషించారు. అయితే వయసు పై బడటం, అద్వానీ టీంగా ముద్రపడటంతో ఉమా భారతిని పార్టీ పక్కన పెట్టింది. అయినా గత ఆరేళ్లుగా ఉమా భారతి రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. కావాలని తనను మోదీ టీం పక్కన పెట్టిందని ఆమె భావిస్తున్నారు.

మద్యనిషేధం కోరుతూ…

కానీ తాజాగా ఉమాభారతి మరోసారి తనసత్తా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీపైనే ఉమాభారతి నిప్పులు చెరుగుతున్నారు. మధ్యప్రదేశ్ కేంద్రంగా మరోసారి తన పట్టును నిరూపించుకునేందుకు ఉమాభారతి ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో పూర్తిస్థాయి మద్యనిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ ఉమాభారతి వచ్చే నెల 8వ తేదీన పెద్దయెత్తున ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పైనే ఆమె ఆరోపణలకు దిగడం సంచలనం గా మారింది.

కేంద్ర నాయకత్వానికి తలనొప్పి…..

మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కూడా ఉమాభారతి ఇరుకున పడేశారు. బీజేపీ అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లోనూ మద్యనిషేధాన్ని అమలు చేయాలని ఉమాభారతి కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉమాభారతి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ కూడా రాశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమాభారతి పార్టీకి తలనొప్పిగా మారారు. తనను రాజకీయంగా దూరం పెట్టడం వల్లనే ఉమాభారతి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఉమాభారతిని ఏ విధంగా అధినాయకత్వం కంట్రోలో చేయగలుగుతుందో చూడాలి.

Tags:    

Similar News