దూల తీరింది సేనకు

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. అర్థరాత్రి బీజేపీ రాజకీయ సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తుందని శివసేన ఊహించనే లేదు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపడతానన్న [more]

Update: 2019-11-23 08:00 GMT

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. అర్థరాత్రి బీజేపీ రాజకీయ సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తుందని శివసేన ఊహించనే లేదు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపడతానన్న ధీమాగా ఉన్నారు. కానీ అంతలోనే కుదుపు. బీజేపీలో ఉంది ఒకప్పటి వాజ్ పేయి కాదు.. అద్వానీ కాదన్న విషయాన్ని శివసేనాధిపతి విస్మరించారు. అక్కడ మోడీ, అమిత్ షాలు ఉన్నారన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయం చేయాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు.

అనుభవ లేమితో…..

నిజానికి శివసేన అధినేత ఉద్ధవ్ ధాక్రే రాజకీయ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కన్పించింది. గత నెల రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న హైడ్రామాను చూస్తున్న సామాన్యుడు ఎవరికైనా బీజేపీ చూస్తూ చూస్తూ పక్క వాడికి మహారాష్ట్ర పగ్గాలను అప్పగిస్తుందని అనుకోరు. కానీ ఉద్ధవ్ థాక్రే మాత్రం ధీమాగా ఉన్నారు. బాల్ థాక్రే ద్వేషించిన ఎన్సీపీ శరద్ పవార్ తో కలసి నడిచేందుకు సిద్దమయ్యారు. శరద్ పవార్ ను కూడా ఉద్దవ్ థాక్రే అంచనాలు వేయలేకపోయారు. శరద్ పవార్ ను గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్లారు.

స్మెల్ చేయలేక….

శరద్ పవార్ గత కొన్ని రోజులుగా నానుస్తూ వస్తున్నప్పుడయినా ఉద్ధవ్ థాక్రే స్మెల్ చేయలేకపోయారు. కాంగ్రెస్ తో చర్చలంటారు. కామన్ మినిమం ప్రోగ్రాం అంటారు. ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రిగా ఒప్పుకోమని చెబుతారు. ఉద్ధవ్ థాక్రేనే సీఎంగా ఉండాలంటారు. మంత్రి వర్గంలో సభ్యులపై కసరత్తు చేస్తారు. ఇలా శరద్ పవార్ చేస్తున్న హడావిడి వెనక గడిబిడిని ఉద్దవ్ థాక్రే గమనించలేకపోయారు. ఆయన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలపరని బ్లైండ్ గా ముందుకు వెళ్లారు.

తేడా కన్పిస్తున్నా……

ఇటీవల శరద్ పవార్ కామెంట్స్ లో తేడాలు కన్పిస్తున్నాయి. శివసేనతో తమకు సంబంధమేంటి? వారి కూటమి వేరు అంటూ శరద్ పవర్ కామెంట్స్ చేసి ఒక క్లూ కూడా ఇచ్చారు. దాన్ని సయితం ఉద్ధవ్ థాక్రే పట్టుకోలేకపోయారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీని కలసి నలభై నిమిషాలు రైతు సమస్యలపై చర్చించి వచ్చానని చెప్పిన శరద్ పవార్ మాటలను కూడా అనుమానించలేకపోయారు. ప్రధాని భేటీలోనే బీజం పడిందన్నది ఇప్పుడు తెలుసుకుని ప్రయోజనం లేకపోయింది. మొత్తం మీద శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే రాజకీయ అనుభవ లేమిని శరద్ పవార్ చక్కగా వినియోగించుకున్నారని చెప్పక తప్పదు. మారాఠా యోధుడి చేతులో చావుదెబ్బ తిన్నారు థాక్రే. మరి ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేకపోయినా పులి చూస్తూఊరుకోక తప్పదేమో.

Tags:    

Similar News