ముందుకు వెళితే ముప్పు తప్పదా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎక్కువ కాలం పదవి లో కొనసాగే అవకాశం కన్పించడం లేదు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు ముందు సెంటిమెంట్ తో విజయం [more]

Update: 2021-01-16 18:29 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎక్కువ కాలం పదవి లో కొనసాగే అవకాశం కన్పించడం లేదు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు ముందు సెంటిమెంట్ తో విజయం సాధించాలని భావించడమే ఉద్ధవ్ థాక్రే కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని నగరాలకు, మున్సిపాలిటీలకు పేర్లు మార్చాలని ఉద్ధవ్ థాక్రే నిర్ణయించడమే వివాదంగా మారింది. పేర్ల మార్పిడికి కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీలే వ్యతిరేకిస్తుండం గమనార్హం.

ఎప్పడూ సెంటిమెంట్ తోనే….

శివసేన ఎప్పుడూ ప్రజల సెంటిమెంట్ తోనే ముందుకు వెళుతుంది. అదే దాని బలం.. బలహీనత. ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్ గా మార్చాలన్నది ఉద్ధవ్ థాక్రే నిర్ణయం. ఇది తన తండ్రి బాల్ థాక్రే ఆలోచన అని ఆయన చెబుతున్నారు. అయితే దీనికి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అంగీకరించడం లేదు. ఇరవై ఏళ్ల నుంచి ఇది శివసేన నినాదంగా ఉంది. ఇప్పుడు ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో మరోసారి ఉద్ధవ్ థాక్రే దీనిని తెరపైకి తెచ్చారు.

పేర్లు మార్చాలంటూ….

ఇక ఔరంగాబాద్ ఒక్కదానితోనే శివసేన సరిపెట్టలేదు. ఔరంగాబాద్ ఎయిర్ పోర్టు పేరును ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎయిర్ పోర్టు గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పౌర విమానయాన శాఖకు లేఖ రాయడం మళ్లీ వివాదాన్ని రాజేసింది. ఇక ముంబయి సెంట్రల్ పేరును సయితం నానా శంకర్ సేఠ్ స్టేషన్ గా మార్చాలన్న ప్రతిపాదనను శివసేన తీసుకువచ్చింది.

ఆ రెండు వ్యతిరేకం….

అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు ఇందుకు అంగీకరించలేదు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ఉందని ఉద్ధవ్ థాక్రే గుర్తుంచుకోవాలని ఎన్సీపీ, కాంగ్రెస్ లు సూచిస్తున్నాయి. మూడు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని, దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆ రెండు పార్టీలు తేల్చి చెప్పాయి. అయితే వాటిని కాదని ముందుకు వెళ్లే పరిస్థితి ఉద్ధవ్ థాక్రేకు లేదనే చెప్పాలి. కానీ కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తాయనే చెప్పాలి. కానీ ఇది ఉద్ధవ్ థాక్రే ఎన్నికల స్టంట్ గానే ఆ రెండు పార్టీలు చూస్తున్నాయి. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News