ఉద్దవ్ మొదలుపెట్టలేదు.. అంతకు ముందే?

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ప్రజాస్వామ్యపాలన కొనసాగుతోంది. ఒక్కోదేశంలో ఒక్క విధానం అమలులో ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా లో అధ్యక్షతరహా పద్ధతి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తన కనుసైగలతో [more]

Update: 2020-05-12 17:30 GMT

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ప్రజాస్వామ్యపాలన కొనసాగుతోంది. ఒక్కోదేశంలో ఒక్క విధానం అమలులో ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా లో అధ్యక్షతరహా పద్ధతి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తన కనుసైగలతో శాసించిన బ్రిటన్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న భారత్… ఆ దేశం అనుసరించే పార్లమెంటరీ ప్రజస్వామ్యాన్నే ఎంచుకుంది. ప్రధాని, ముఖ్యమంత్రులను ఈ విధానంలో ప్రత్యక్షంగా ఎన్నుకోరు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైనా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా ప్రజలచేత ఎన్నికైన మెజారిటీ ఎంపీల మద్దతున్న నాయకుడు ప్రధాని అవుతారు. అంతే తప్ప పత్యక్షంగా ప్రజలచేత ఎన్నికైన నాయకుడు ముఖ్యమంత్రి, ప్రధాని కావాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు.

ఉద్ధవ్ విషయంలోనూ…

దీనిని అవకాశంగా తీసుకుని ప్రజల చేతనేరుగా ఎన్నికకాని నాయకుడు కుాడా అధికార పగ్గాలు అందరుకుంటున్నారు. అయితే అందులో అధికారాన్ని అందుకున్న నాయకుడు ఆరునెలల్లో ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కేంద్రంలో అయితే లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రంలో అయితే శాసనసభ, శాసనమండలి ఏదో ఒక దానికి ఎన్నిక కావాలని రాజ్యాంగం పేర్కొంది. దీన్ని అవకాశంగా తీసుకుని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గత ఏడాది పవంబరు 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ఈ నెల 28 తో గడువుతీరుతుంది. ఆయనను శాసనమండలికి నామినేట్ చేస్తుా మంత్రివర్గం రెండు సార్లు తీర్మానం చేసి పంపినా భాజపా మనిషి అయిన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ స్పందించలేదు. కోశ్యరీ గతంలో ఉత్తరా‌‌ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితో ఠాక్రే వినతి మేరకు ప్రధాని జోక్యం చేసుకోవడంతో పరిస్ధితి సద్దుమణిగింది ఈ నెల 21న ఎన్నకలు నిర్వహించనుండటంతో ఉద్ధవ్ ఠాక్రే ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ గండం గట్టెక్కారు.

రాజ్యాంగ బద్ధమే అయినప్పటికీ….

వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారు. ఏదో ఒకసభలో సభ్యుడు అయి ఉండాలన్న రాజ్యాంగ నిబంధనను ఆయన అమలు చేశారు. ఇందులో రాజ్యాంగ విరుద్ధమైనది ఏమీలేదు. కానీ ఆయన చర్య రాజ్యంగ స్పుార్తికి విరుద్ధమన్న భావనను రాజ్యాంగ, న్యాయ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన నాయకుడు అధికార పగ్గాలు చేపట్టాలన్నది రాజ్యాంగ స్పుార్తి. ఈ విషయాన్ని నేరుగా, స్పష్టంగా చెప్పనప్పటికీ రాజ్యాంగ నిర్మాతల మనోగతం అదే ప్రజల చేత ఎన్నికైన నాయకుడు పదవి చేపడితేనే ప్రజాస్వామ్యానికి అర్ధం, పరమార్ధం. అలాకాని పక్షంలో అది స్పూర్తిని నీరుగార్చడమే అవుతుంది. ఇపుడు ఉద్ధవ్ చేస్తున్నది అదే కేవలం యుాపి, బీహార్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లోనే శాసనమండళ్ళు ఉన్నాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ మండలి రద్దుకు సిఫార్సు చేసింది. ఒకపుడు జమ్ముకాశ్మీర్ లో శాసనమండలి ఉండేది. గత ఏడాది ఆగస్టులో ఆ రాష్టాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం మార్చడంతో మండలి రద్దయింది.

ఉద్ధవ్ తోనే మొదలు కాలేదు…

ఎమ్మెల్సీలు సీఎం లు అవడం ఉద్ధవ్ ఠాక్రేతోనే మెుదలుకాలేదు. ఆయనతోనే ఈ సంప్రదాయం ఆగిపోదు. మహారాష్ట్రలో మెుదటినుంచి ఈ సంప్రదాయం నగుస్తోంది. ఉద్ధవ్ తో సహా ఇప్పటివరకు ఏడుగురు నాయకులు ఏ సభలోనుా సభ్యులు కాకుండానే ముఖ్యమంత్రులు అయ్యారు. 1980 లో అబ్దుల్ రెహమాన్ అంతులేతో ఈ ప్రక్రియ మెుదలైంది. ఆ తరువాత వసంత్ దాదాపాటేల్, శివాజీరావు నీలం గేకర్, ఎస్.బి.చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృధ్వీరాజ్ చౌ‍హాన్, శరద్ పవార్ ఉభయ సభల్లో కాకుండానే ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, యెాగి ఆధిత్యానాధ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ కూడా మండలి సభ్యులే. 80 ఏళ్ళ వీపీ సింగ్ కుాడా ఎమ్మెల్సీ గానే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో యూపీ లో మాయావతి, అఖిలేష్ యాదవ్, కర్ణాటకలో సదానందగౌడ, ఉమ్మడి ఏపి లో 1980 లో భవనం వెంకట్రామ్, 2019 లో కొణిజేటి రోశయ్య మండలి సభ్యులు గానే సీఎంగా చక్రం తిప్పారు. 1991 లో పి.వి.నరసింహరావు ప్రధాని అయ్యేనాటికి ఆయన ఏ సభలోనుా సభ్యుడు కాదు. అనంతరం నంద్యాల నుంచీ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఇందిరాగాంధి, దేవగౌడ, ఐకే గుజ్రాల్ ఉభయ సభల్లో సభ్యులు కాకుండానే ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఇందిరాగాంధీ, తర్వాత రాయబరేలి నుంచీ ఎన్నికయ్యారు. గుజ్రాల్ అర్ధంతరంగానే నిష్క్రమించారు. కేంద్రంలో లోక్ సభ, రాష్ట్రంలో శాసనసభ ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నకైన నాయకులకు వేదికలు. రాజ్యసభ, శాసన మండళ్ళు పరోక్షంగా ఎన్నికైన వారికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రజలచేత ప్రత్యక్షంగా చట్టసభ (లోక్ సభ, శాసనసభ) లకు ఎన్నికైన వారు పదవులను అధిష్టిస్తే రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్పుార్తిని గౌరవించనట్లు అవుతుంది. అది నాయకులకు కూడా గౌరవాన్ని, శోభను కలిగిస్తాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News