ఉద్ధవ్ ఊరికే అనరు కదా?

మహారాష్ట్ర ముఖ్మమంత్రి ఉద్ధవ్ థాక్రే తీసుకున్న సంచలన నిర్ణయం కూటమి పార్టీలో చర్చనీయాంశమైంది. పౌరసత్వ చట్ట సవరణకు శివసేన అనుకూలమేనన్న సంకేతాలను ఉద్ధవ్ థాక్రే ఇచ్చారు. తన [more]

Update: 2020-02-03 18:29 GMT

మహారాష్ట్ర ముఖ్మమంత్రి ఉద్ధవ్ థాక్రే తీసుకున్న సంచలన నిర్ణయం కూటమి పార్టీలో చర్చనీయాంశమైంది. పౌరసత్వ చట్ట సవరణకు శివసేన అనుకూలమేనన్న సంకేతాలను ఉద్ధవ్ థాక్రే ఇచ్చారు. తన అధికార పత్రిక సామ్నాలో ఈ విషయాన్ని శివసేన స్పష్టం చేయడంతో కూటమి పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్లు స్పష్టమయింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ పేరిట కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కూటమి కట్టిన సంగతి తెలిసిందే.

తొలి నుంచి….

అయితే హిందువుల పార్టీగా ముద్రపడిన శివసేన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయంలో తొలినుంచి కొంత సుముఖంగానే ఉంది. లోక్ సభలోనూ ఈ బిల్లుకు మద్దతిచ్చింది. అయితే రాజ్యసభలో మాత్రం ఇవ్వలేదు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఉద్ధవ్ థాక్రే దీనిపై పలుమార్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో మహారాష్ట్రలో ఎవరికీ ఇబ్బంది లేదని ఆయన గట్టిగా చెబుతున్నారు.

మిత్రపక్షాలు వ్యతిరేకిస్తుండగా…..

కానీ కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీలు పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్త ఆందోళనలకు కూడా దిగాయి. కానీ మహారాష్ట్రలో హిందుత్వ పార్టీగా శివసేన అవతరించింది. తమ ఓటు బ్యాంకు అంతా అదే కావడంతో ఉద్ధవ్ థాక్రే ఒకింత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముస్లింలు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బిల్లుకు హిందువులు అత్యధిక మంది మద్దతిస్తున్నట్లు ఉద్దవ్ ధాక్రే పసిగట్టారు.

థాక్రే వ్యాఖ్యలతో…..

అందుకే ఉద్ధవ్ థాక్రే అధికార పత్రిక సామ్నాలో ఒకింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు తాము అనుకూలమేనని, అయితే ఎన్సార్సీ, ఎన్పీఆర్ లకు మాత్రం వ్యతిరేకమని సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. ఎన్సార్సీ విషయంలో హిందువులు కూడా ఇబ్బంది పడే ప్రమాదమున్నందున తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు సీఏఏ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News