కుదురుకునేలోపే…?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత కుదరుకోలేక పోతున్నారు. కరోనా వైరస్ పాలనను సజావుగా సాగనివ్వడం లేదు. గత ఏడాదిన్నర నుంచి మహారాష్ట్రను [more]

Update: 2021-05-27 16:30 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత కుదరుకోలేక పోతున్నారు. కరోనా వైరస్ పాలనను సజావుగా సాగనివ్వడం లేదు. గత ఏడాదిన్నర నుంచి మహారాష్ట్రను కరోనా వైరస్ కోలుకోనివ్వకుండా చేస్తుంది. ఇటు ఆర్థికంగా రాష్ట్ర చితికిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదనడం మినహా ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేక పోతున్నారు. ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగిపోతుండటంతో ఉద్ధవ్ థాక్రేకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి…..

ఉద్థవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొటారని భావించారు. బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టడంతో ప్రభుత్వాన్ని అస్ధిరపర్చేందుకు కుట్రలు జరుగుతాయని ఉద్ధవ్ థాక్రే భావించారు. అందుకే మిత్రపక్షాలతో సంయమనంతో వ్యవహరిస్తూ ముందుకు సాగారు. ఏదైనా మిత్రపక్షాల సమస్య ఉన్నా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వైరస్ రూపంలో….

కానీ కరోనా వైరస్ రూపంలో ఉద్ధవ్ థాక్రేకు ముప్పు ముంచుకొచ్చింది. రోజుకు యాభై వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నైట్ కర్ఫ్యూ అని తొలుత భావించినా లాక్ డౌన్ దిశగానే ఆయన ఆలోచనలు ఉన్నాయంటున్నారు. మరోవైపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని ఉద్ధవ్ థాక్రే ఆందోళన చెందుతున్నారు.

కేంద్రం నుంచి సహకారం…

అందుకే కేంద్ర ప్రభుత్వంపై శివసేన పార్టీ విరుచుకుపడుతోంది. కావాలని కక్ష కట్టే కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తున్నారు. తమ రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ లు, ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా సరఫరా చేయడం లేదని ఆయన విమర్శలు చేస్తున్నారు. మిత్రపక్షాల సహకారంతో ఎలాగోలా పాలనను నెట్టుకొస్తున్న ఉద్ధవ్ థాక్రేను కరోనా మహ్మమ్మారి రాజకీయంగా దెబ్బతీసిందనే చెప్పాలి.

Tags:    

Similar News