నీవు లేక నేను లేను

కార్యేశు దాసి… కరణేశు మంత్రి, శయనేశు రంభ, భోజ్యేశు మాత…. ఇవి ప్రతి స్త్రీ సహజ లక్షణాలని శాస్త్రం చెబుతోంది. వేదాలు ఉద్ఘాటిస్తున్నాయి. అదే విధంగా ప్రతి [more]

Update: 2019-12-20 18:29 GMT

కార్యేశు దాసి… కరణేశు మంత్రి, శయనేశు రంభ, భోజ్యేశు మాత…. ఇవి ప్రతి స్త్రీ సహజ లక్షణాలని శాస్త్రం చెబుతోంది. వేదాలు ఉద్ఘాటిస్తున్నాయి. అదే విధంగా ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందన్నది ఆధునిక నానుడి. ఇది ఇప్పటికిప్పుడు రుజువవుతున్న సత్యం. దాన్ని ఎవరూ కొట్టి పారేయలేరు. తోసి పుచ్చలేరు. తాజాగా దేశంలో పెద్ద సంపన్న రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే సతీమణి రశ్మికి పై విషయాలు పూర్తిగా వర్తిస్తాయి. ఆయన ఈ పదవి చేపట్టడం వెనక రశ్మీ వ్యూహం, పంతం, పట్టుదల దాగి ఉన్నాయన్నది శివసేనలో విన్పిస్తున్న కామెంట్స్. పరస్పర విరుద్ధ పార్టీలను కూడగట్టి భర్తను పీఠంపై కూర్చోబెట్టడంలో రశ్మీ చాణక్యం, నైపుణ్యం అనన్య సామాన్యం. విద్యార్థి దశలోనే ప్రేమ వివాహంతో ఒక్కటైన ఉద్ధవ్, రశ్మి జీవితంలో రశ్మీ పాత్ర కీలకం. రాజకీయంం అంటే ఇష్టంలేని ఉద్ధవ్ ను అందుకు ఒప్పించడం, ఆయనకు అధికార పగ్గాలు అందించడంలో ఆమె పాత్ర కీలకం. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన రశ్మి అత్యంత వేగంగా రాజకీయాలను అర్థం చేసుకున్నారు.

వ్యాపార కుటుంబం నుంచి…..

ఉద్ధవ్, రశ్మిల తొలి పరిచయం జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో జరిగింది. ఉద్ధవ్ తండ్రి బాల్ థాక్రే అప్పటికే మహారాష్ట్ర రాజకీయాల్లో పులిగా పేరుండేది. కానీ ఆయన కుమారుడైన ఉద్ధవ్ థాక్రే మాత్రం చాలా అమాయకంగా, సౌమ్యంగా ఉండేవారు. చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. రాజకీయాల పట్ల అస్సలు ఆసక్తి లేదు. తండ్రి బాల్ థాక్రే కారణంగా ఉద్ధవ్ ఎక్కడకు వెళ్లినా రాచ మర్యాదలు లభించేవి. ఈ పరిస్థితుల్లోనే ముంబయిలోని వ్యాపారవేత్త కుమార్తెగా రశ్మి తనను తాను ఉద్ధవ్ కు పరిచయం చేసుకుంది. రెండు కుటుంబాల నేపథ్యాలు వేర్వేరు. అయినప్పటికీ ఫొటోగ్రఫీపై గల ఉమ్మడి ఆసక్తి వారిని కలిపిింది. కొంతకాలం ఉద్ధవ్ సొంతంగా “చౌరంగ్” పేరుతో యాడ్ ఏజెన్సీని నడిపారు.

పరిచయం… ప్రేమగా మారి…..

ఉద్ధవ్, రశ్మి పరిచయం ప్రేమగా మారి అది వివాహంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. 1989 డిసెంబరు 13న వారి వివాహం జరిగింది. రశ్మీ తల్లి మీనారాయ్, తండ్రి మాధవ్ పటంకర్ తో పాటు ఓ సోదరి ఉండేది. మెట్టింట్లో బాల్ థాక్రే అత్త మీనా థాక్రే, మరుదులు బిందు మాధవ్ థాక్రే, అజయ్ దేవ్ థాక్రే ఉండేవారు. బాల్ థాక్రే సోదరుడి కుమారుడు రాజ్ థాక్రే ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. రాజ్ థాక్రే ఇప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు. బాల్ థాక్రే తో విభేదాలు రావడంతో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఉద్ధవ్ తో వివాహంతో థాక్రే కుటుంబలోకి ప్రవేశించిన రశ్మి అనతికాలంలోనే ఆ కుటుంబానికి చేరువయ్యారు. అత్తగారికి కుటుంబ వ్యవహారాల్లో అన్ని విధాలుగా అండగా నిలిచారు. మామ బాల్ థాక్రే జీవించి ఉన్నంత కాలం ఆయనకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా నిలిచారు. ఆయన మంచాన పడినప్పుడు సేవలు అందించారు.

రాజ్ కు చెక్ పెట్టి…..

బాల్ థాక్రే వార్థక్య సమయంలోనూ ఆయన రాజకీయ వారసుడు ఎవరు అన్న చర్చ మొదలయింది. ఉద్ధవ్ కు రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. ఫొటోగ్రఫీ రంగంలో స్థిరపడిపోయారు. ఇక బాల్ థాక్రే తమ్ముడి కుమారుడు రాజ్ థాక్రే అప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బాల్ థాక్రే కూడా తన కుమారుడు ఉద్ధవ్ కన్నా రాజ్ థాక్రే వైపు మొగ్గు చూపేవారు. అప్పటికే బాల్ థాక్రే రాజకీయ వారసుడు రాజ్ థాక్రే అన్న భావన పార్టీలో ఉండిపోయింది. ఆ మేరకు సంకేతాలు కూడా వెళ్లాయి. కానీ చివరిక్షణంలో రంగంలోకి దిగిన రశ్మి పరిస్థితిని ఒక్కసారిగా మార్చారు. తండ్రి వారసత్వాన్ని తన భర్త ఉద్ధవ్ కే రావాలని భావించారు. ఈ విషయంలో బాల్ థాక్రేను సయితం ఒప్పించగలిగారు. సొంత కుమారుడిని కాదని సోదరుడి కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించడంలో అర్థం లేదని వాదించారు. చివరకు ఆయనను ఒప్పించారు. తద్వారా శివసేన పగ్గాలు ఉద్ధవ్ కు అందాయి. ఈ విషయంలో రశ్మి పాత్ర ఎంతో కీలకం. ఆరోజు ఆమె క్రియశీల పాత్ర పోషించకపోతే ఉద్ధవ్ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది. ఉద్ధవ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా రశ్మి చురుగ్గా వ్యవహరించారు. అప్పటి వరకు థాక్రే కుటుంబం తెరవెనక రాకీయాలకే పరిమితమైంది. ప్రత్యక్ష్య ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండేది. ఇది సరికాదని థాక్రే కుటుంబం అధికారాన్ని అందుకోవాలని రశ్మి తలపోశారు.

కూటమిని కట్టడంలోనూ….

ఇందులో భాగంగానే కుమారుడు ఆదిత్య థాక్రేను ఎన్నికల బరిలోకి దింపారు. ముంబయి నగరంలోని వర్లి నియోజకవర్గం నుంచి ఆయనను గెలిపించడంలో రశ్మి క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నికల అనంతరం భర్రత లేదా కుమారుడు సీఎం కావాలని రశ్మి పట్టుబట్టారు. 60 లోపు సీట్లు సాధించినా పార్టీ ఏకంగా అధికారం కోసం నిచ్చెన వేయడం అసాధారణమే. అందులో శక్తిమంతమైన మోదీ, అమిత్ షా ద్వయాన్నిి ఢీకొనడం ఆషామాషీ కాదు. పరస్పర వైరుథ్యాలు గల శివసేన, కాంగ్రెస్ ను ఏకం చేయడంలో రశ్మి పాత్ర అమోఘం. అధికారం అండ చూసుకుని మోదీ, షా వేసిన ఎత్తుగడలను చిత్తు చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా శివసేనదే విజయం అయింది. మొత్తానికి భర్త ఉద్ధవ్ థాక్రే సీఎం కావడంలో రశ్మి పాత్ర అనన్య సామాన్యం. రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ రశ్మి రాణించారు. సామ్ వేద్ రియల్ ఎస్టేట్, సహయోగ్ డీలర్స్ అనే సంస్థల్లో రశ్మి డైరెక్టర్. ఎలోరియా సోలార్, హై బిస్కట్ ఫుడ్స్, కోమో స్టామ్ అండ్ ప్రాపర్టీస్ కంపెనీల్లో రశ్మి భాగస్వామి. మొత్తానికి అటు రాజకీయాలు, టువ వ్యాపారాల్లోనూ రశ్మి రాణించడం విశేషం. ఇప్పుడు పాలన వ్యవహారాల్లోనూ ఉద్ధవ్ థాక్రేకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News