కొడుకు కొరుకుడు పడటం లేదా?

డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పెత్తనం పార్టీలో ఎక్కువయిందా? సీనియర్లకు, ఉదయనిధి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. కరుణానిధి [more]

Update: 2019-11-07 18:29 GMT

డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పెత్తనం పార్టీలో ఎక్కువయిందా? సీనియర్లకు, ఉదయనిధి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే అధినేతగా స్టాలిన్ పగ్గాలు చేపట్టారు. తన వారసుడిగా ఉదయనిధిని రాజకీయ అరంగేట్రం చేయాలని స్టాలిన్ భావించినా ఉప ఎన్నికలకు మాత్రం ఉదయనిధిని దూరంగా ఉంచారు. అయితే పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉదయనిధిని నియమించారు.

ఓటమి చవిచూడటంతో…

వరసగా ఉప ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే సత్తా చాటింది. డీఎంకే కూటమికి ఇక తిరుగులేదని భావిస్తున్న తరుణంలో తిరిగి నాంగునేరి, విక్రంవాడి ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ రెండు చోట్లా అన్నాడీఎంకే విజయం సాధించింది. వరస విజయాలతో ఊపు మీద ఉన్న డీఎంకేకు ఈ ఎన్నికల్లో ఓటమి తేరుకోలేకుండా చేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉదయనిధితో పాటు స్టాలిన్ కూడా ప్రచారం నిర్వహించారు.

సీనియర్ నేతలే కారణమంటూ….

కానీ ఇక్కడ డీఎంకే సీనియర్ నేతల వైఖరి కారణంగానే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఉదయనిధి అభిప్రాయపడ్డారు. ఆయన ప్రత్యేకంగా నియోజకవర్గాల నుంచి ఓటమి తర్వాత నివేదికలు తెప్పించుకున్నారు. దీంతో కొందరు సీనియర్ నేతలు పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని స్టాలిన్ కు తెలియజేయడమే కాకుండా సమావేశంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు సీనియర్లను ఇబ్బంది పెట్టాయి.

స్టాలిన్ సర్దిచెప్పినా….

అయితే సీనియర్లు కూడా ఉదయనిధి విషయంలో తగ్గలేదు. ఉదయనిధి ఒక వ్యూహం లేకుండా ప్రచారం నిర్వహించారని సీనియర్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో స్టాలిన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో కనుగొనాలని కొందరు సీనియర్ నేతలకు అప్పగించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్టాలిన్ హెచ్చరికలు జారీ చేశారు. రెండు ఉప ఎన్నికల ఫలితాలు డీఎంకేలో చిచ్చుపెట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా యువనేత ఉదయనిధి సీనియర్ల పట్ల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Tags:    

Similar News