డైలాగులు…డప్పాలే.. గ్రౌండ్ లెవెల్లో మాత్రం?

కోవిడ్ తో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించేందుకు భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత అభియాన్ ను రెండు నెలల క్రితం ఘనంగా [more]

Update: 2020-07-31 16:30 GMT

కోవిడ్ తో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించేందుకు భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత అభియాన్ ను రెండు నెలల క్రితం ఘనంగా ప్రకటించింది. చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార వర్గాలు, వివిధ రంగాలకు ఇందులో భారీగా రుణాలిచ్చే పథకాలను వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో పదిశాతం మేరకు ఆర్థిక సాయం అందుతుందంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి నేరుగా రాయితీలు, ఇతర రూపాల్లో పొందే సాయం నామమాత్రమేననే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ప్రభుత్వ పద్దునుంచి చెల్లించేది రెండు లక్షల కోట్ల రూపాయల లోపునకే పరిమితమనే గణాంకాలు ఉన్నాయి. మిగిలిన 80 శాతం మేరకు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించే సదుపాయమే. అయినా 21 లక్షల కోట్ల రూపాయల భారత్ అభియాన్ అమలైతే నిధులైనా పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తాయని అంతా అనుకున్నారు. ఆర్థికవేత్తలు సైతం ఏదో రూపంలో వివిధ రంగాలు గాడిన పడతాయని ఆశించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని చూస్తుంటే ఆత్మ నిర్భర భారత్ అతిశయంగా మిగిలిపోతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిక్కుల్లో స్కీములు…

లక్షలాది చిన్నమధ్యతరహా పరిశ్రమలకు , కోట్లమంది వ్యాపారులకు, వ్యవసాయ, మత్స్య, కుటీర రంగాలకు భారత్ అభియాన్ లో పెద్ద పీట వేశారు. ప్రభుత్వ ఆశయం మంచిదే అయినా నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఈ పథకం కింద రుణాల మంజూరు పెద్దఎత్తున సాగడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు ఉదారంగా రుణాలివ్వాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకు అనేక రకాల సడలింపులను ఇచ్చింది. తాను బ్యాంకులకు అప్పులు ఇచ్చే వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రికార్డు స్థాయిలో కేవలం నాలుగు శాతం రేటుకే వడ్డీని కుదించుకుంది. ఇంత చేసినా ఆర్థిక వ్యవస్థలో ఆత్మ విశ్వాసం నెలకొనలేదు. లక్ష్యాల మేరకు పెద్ద ఎత్తున నిధులు ఉత్పాదక రంగాలలోకి వస్తే లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ప్రజా జీవనం తిరిగి గాడిన పడుతుంది. ఆగస్టు నెల నాటికి కనీసం 50శాతం మేరకైనా అభియాన్ పథకాల నిధులు వ్యవస్థలోకి ప్రవహించాలని ప్రభుత్వం ఆశించింది. కానీ ఇంతవరకూ 20శాతం కూడా రుణ మంజూరులు సాగలేదని గణాంకాలు చాటి చెబుతున్నాయి. పైపెచ్చు ప్రజలు నిధులను బ్యాంకుల్లో పెద్ద మొత్తాల్లోనే డిపాజిట్లు చేస్తున్నారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల వినిమయం, ఉత్పత్తిరంగాల్లో ఖర్చు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. కానీ ఆ పరిస్థితులు దేశంలో ఇంతవరకూ కనిపించడం లేదు.

తీరుమారని బ్యాంకులు…

కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశం తిరిగి పునరుద్దీపన పొందాలంటే బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని పైస్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. కానీ బ్యాంకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. సాధారణ పరిస్థితుల్లోని షరతులనే అమలు చేస్తున్నాయి. సులభ రీతిలో రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. తిరిగి చెల్లింపు సామర్థ్యం, ఆయా కంపెనీలు, వ్యాపార సంస్థల ట్రాక్ రికార్డునే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. నిరర్థక ఆస్తుల పేరిట ఖాతాలు పేరుకు పోకుండా జాగ్రత్త పడుతున్నాయి. పెద్ద ఎత్తున నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ అతి జాగ్రత్తకు పోతున్నాయి. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఏమాత్రం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. పైస్థాయిలో నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థలు సైతం కరవు అయ్యాయి. ఒకవైపు ప్రజలు పొదుపు పాటిస్తున్నారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించి వేశారు. దీనికి తోడు బ్యాంకులు ఆశ్రిత రక్షణ మార్గాలనే అవలంబిస్తున్నాయి. అభియాన్ సక్రమంగా అమలైతే జనవరి నాటికి వ్యవస్థ కొంతమేరకు కుదుటపడుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆత్మనిర్భర భారత్ కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇంతవరకూ రుణాలకు దరఖాస్తులు చేస్తున్న వారి సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిధులు పేరుకుంటున్నాయి. కార్పొరేట్, ప్రయివేటు రుణ గ్రహీతలూ వెనకంజ వేస్తున్నారు. తమ వద్ద వృథా గా నిధులు ఎందుకనే భావనలో బ్యాంకులు సతమతమవుతున్నాయి. రిజర్వ్ రెపోలో ఆర్బీఐ వద్దనే నిధులుంచాలని భావిస్తున్నాయి. మొత్తం వ్యవస్థ రివర్స్ ట్రాక్ లోనే నడుస్తోంది.

రంగంలోకి ప్రధాని…

ఆర్థిక వ్యవస్థ దిగాలు పడిపోయిందన్న వాస్తవాన్ని కేంద్రం గుర్తించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వృద్ధి రేటుకి పడిపోతుందని నిపుణుల అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. నిరర్థక ఆస్తుల విధానాన్ని పక్కన పెట్టమని బ్యాంకింగ్ రంగాన్ని ప్రధాని కోరాల్సి వచ్చింది. ఉత్పాదక రంగాలకు రుణాలిచ్చి ఆత్మనిర్భర్ లక్ష్యాలను ఆచరణాత్మకం చేయాలని సూచించారు. అయితే లాభదాయకత, సురక్షిత వసూళ్లు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, కార్పొరేట్ రుణాల పట్ల మక్కువ చూపే బ్యాంకులు ప్రధాని మాట చెవికెక్కించుకుంటాయా? అన్నది అనుమానమే. సాకులు వెదుకుతూ కాలయాపన చేసేంత టైమ్ మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పటికే భారత జవజీవాలు కుచించుకుపోయాయి. అన్నిరంగాలూ కుదేలైపోయాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News