అణు"బాంబు" పేలిన చోట ఎవరిది విజయం...??

Update: 2018-12-10 18:29 GMT

పోఖ్రాన్.... ఈ పేరు తెలియని భారతీయుడు ఎవరూ ఉండరు. అణుపరీక్షలు నిర్వహించిన ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. 70వ దశకంలో ఇందిరాగాంధీ హయాంలో, 90వ దశకం చివర్లో అటల్ బిహరీ వాజ్ పేయి హయాంలో నిర్వహించిన అణుపరీక్షల ద్వారా "పోఖ్రాన్" అంతర్జాతీయ చిత్రపటంలోకి ఎక్కింది. రాజస్థాన్ లోని జైసల్మార్ద జిల్లాలో గల ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. పూర్తిగా ఎడారి ప్రాంతమైన పోఖ్రాన్న మున్సిపల్ కేంద్రం. పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. కనీస అవసరమైన మంచినీరు కూడా ఇక్కడ దొరకడం గగనమే. ఇక మిగిలిన మౌలిక సౌకర్యాల గురించి చెప్పనక్కరలేదు.

అన్నీ సమస్యలే......

గడ్డకట్టే చలిగల పోఖ్రాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వేడితో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన పోరు జరుగుతుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తరుపున ఆధ్యాత్మిక వేత్తలు పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి దానిపైనే కేంద్రీకృతమైంది. తారా తారా మఠం అధిపతి మహంత్ ప్రతాప్ పూరీని బీజేపీ బరిలోకి దించింది. ముస్లిం మత గురువు ఘాజీ ఫకీర్ తనయుడు షేక్ మహ్మద్ ను కాంగ్రెస్ పార్టీ పోటీలోకి దింపింది. ఇద్దరు అభ్యర్థులకు భారీ స్థాయిలో అనుచరులు, శిష్యులు ఉన్నారు. సామాజికంగా చూస్తే అత్యధికంగా 55 వేల మంది ముస్లింలు ఉన్నారు. వారి తర్వాత రమారమి 50 వేల మంది రాజ్ పుత్ లు ఉన్నారు. వీరు కాక 40 వేల మంది ఓబీసీలు, 35 వేల మంది ఎస్సీలు, 15 వేల మంది బ్రాహ్మణ, వైశ్య ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు. ముస్లింలు, ఎస్సీల మద్దతు తమకే ఉంటుందని, అదే సమయంలో సంప్రదాయంగా అండగా ఉండే ఇతర వర్గాల ఓట్లతో ఎన్నికల తీరాన్ని దాట వచ్చని హస్తం పార్టీ అంచనా వేస్తుంది. రాజపుత్రులు, బ్రాహ్మణ, వైశ్య ఓటర్లతో విజయం సాధించవచ్చని బీజేపీ ధీమాగా ఉంది. 2008లో కాంగ్రెస్, 2013లో బీజేపీ ఇక్కడ విజయం సాధించాయి. 2013లో బీజేపీ అభ్యర్థి షైటన్ సింగ్ కు 85 వేల ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ కు 50 వేల ఓట్లు లభించాయి. ఇప్పుడు కూడా మహ్మద్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2008లో మహ్మదర్ 42 వేల ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి షైటన్ సింగ్ 42 ఓట్లు సాధించారు. పాత ప్రత్యర్థులే మళ్లీ బరిలోకి దిగడం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ను బీజేపీ ప్రచారంలోకి దించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఓటర్లలో మతపరమైన, సామాజకి పరమైన చీలిక తెచ్చేందుకు ఉభయ పార్టీలూ ప్రయత్నించాయి.

పూరీ నమ్మకం అదేనా?

నియోజకవర్గంలో మంచినీరు, రహదారులు వంటి మౌలిక వసతుల లోపం తీవ్రంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజాకర్షక, మతపరమైన అంశాల గురించే ఎక్కువగా ప్రచారంలో మాట్లాడారు. గో సంరక్షణ గురించి భారతీయ జనతా పార్టీ పెద్దయెత్తు ప్రచారం చేసింది. రాజపుత్ర సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి, 51 సంవత్సరాల పూరీ హిందుత్వ గురించి బహిరంగంగా మాట్లాడారు. సామాజిక కార్యక్రమాలతో పాటు, పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని, మద్యపాన వ్యసనాన్ని నిర్వీర్యం చేసే కేంద్రాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. పూరీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా ప్రజానీకానికి చేరువయ్యేందుకు శ్రమించారు. ముఖ్యమంత్రి వసుంధరరాజే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ తదితరులు సైతం ఈ నియోజకవర్గంలో పర్యటించారు. అర్థబలం గల నేత కావడంతో ప్రచారంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు.

మహ్మద్ ఆశలు ఇవే.....

కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ (41) కూడా ప్రచారం గట్టిగానే నిర్వహించారు. మంచినీరు వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన ప్రచారం జోరుగానే నిర్వహించారు. మహ్మద్ తండ్రికి స్థానిక ముస్లింలలో ముఖ్యంగా సింధీ ముస్లింలలో మంచి పట్టుంది. ముస్లింల మద్దతుతో పాటు రాజే ప్రభుత్వ వ్యతిరేకత కలసి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో మోదీ ప్రభ తగ్గడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు బీజేపీకి నష్టం కలిగించి, తమకు మేలు చేస్తాయని విశ్వసిస్తున్నారు. మొత్తం 11 మంది అభ్యర్తులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ పూరీ, మహ్మద్ మధ్యనే ఉంది. వీరిద్దరూ ఎవరికి వారు విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. ఎవరి ధీమా ఎంత వరకూ నిజమవుతుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News