అదే ఆఖరి విజయమా?

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. శశికళ ఇంకా [more]

Update: 2020-12-08 18:29 GMT

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. శశికళ ఇంకా జైలులోనే ఉండటం, వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయలేకపోవడం పార్టీకి పెద్ద మైనస్ గా చెప్పాలి. శశికళ వచ్చే ఏడాది ఫిబ్రవరికి గాని బయటకు వచ్చే అవకాశాలు లేవు. మరోవైపు పార్టీ నేతలు దినకరన్ పై నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. దీంతో మిగిలిన పార్టీలో ఉన్న ఉత్సాహం దినకరన్ పార్టీలో కనపడటం లేదు.

ఆర్కేనగర్ లో గెలిచిన తర్వాత…..

దినకరన్ రెండేళ్ల క్రితం ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పటికి పార్టీ పెట్ట లేదు. ప్రెషర్ కుక్కర్ గుర్తుమీద స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి దినకరన్ ఆర్కే నగర్ లో గెలవడం, అది కూడా జయలలిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి దినకరన్ గెలవడంతో శశికళ వర్గంలో ఆశలు చిగురించాయి. ఈ విజయం తర్వాతే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్ వైపు వచ్చి భంగపడ్డారు.

ఏ ఎన్నికల్లోనూ….

అయితే ఆర్కే నగర్ ఎన్నికలో గెలిచిన తర్వాతనే దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. శశికళ జైలులో ఉన్నప్పటికీ ఉప ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తన అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే ఎక్కడా విజయం దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొద్దో గొప్పో సీట్లు సాధించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తర్వాత గెలుపు రుచి దినకరన్ వర్గం చూడలేదు.

ఏ కూటమి కూడా…..

ఇప్పుడు కూడా దినకరన్ పార్టీ పరిస్థితిలో మార్పు లేదు. దినకరన్ పార్టీని ఏ కూటమిలో చేర్చుకునే అవకాశం కన్పించడం లేదు. ఆయన ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీకి క్యాడర్ లేదు. అక్కడక్కడ తప్ప సరైన నేత కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు దినకరన్ ను లైట్ గా తీసుకుంటున్నారు. కమల్ హాసన్ కూటమి ఏర్పాటు చేస్తే అందులో అవకాశం దక్కుతుందేమోనన్న చివరి ఆశ. అంతకు మించి దినకరన్ ఈ ఎన్నికల్లో సాధించేదేమీ లేదంటున్నారు.

Tags:    

Similar News