శాంతి కాముకుడిగా ముద్ర పడాలని…..ఎన్ని ఫీట్లు చేసినా..?

పశ్చిమాసియా… దీనినే మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా భారత్ ఈ ప్రాంతాన్ని పశ్చిమాసియా అని, విదేశీయులు మధ్య ప్రాచ్యం అని పిలుస్తుంటారు. [more]

Update: 2020-09-11 16:30 GMT

పశ్చిమాసియా… దీనినే మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా భారత్ ఈ ప్రాంతాన్ని పశ్చిమాసియా అని, విదేశీయులు మధ్య ప్రాచ్యం అని పిలుస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతం.ఈ ప్రాంతంలోని అరబ్ దేశాలు- ఇజ్రాయిల్ మధ్య ఎప్పడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఈ ప్రాంతం నిత్య రావణ కాష్టాన్ని తలపిస్తుంది. అమెరికా అండతో యూదు దేశమైన ఇజ్రాయిల్ చెలరేగి పోతుంటుంది. పేరుకు చిన్న దేశమైనా ఇజ్రాయిల్ అధునాతన సైనిక సంపత్తితో శక్తిమంతంగా ఉంది. అరబ్ దేశాల విషయంలో దూకుడుగా ఉంటుంది. ఏ చిన్న విషయమైనా వాటిపై ఒంటికాలిపై లేస్తుంది. అరబ్ దేశాలదీ అదే వైఖరి. ఇజ్రాయిల్ ను అవి తమ ఉమ్మడి శత్రువుగా భావిస్తాయి. తమలో తమకు ఎన్ని విభేదాలు ఉన్నప్పట్టికీ యూదు రాజ్యం దగ్గరకు వచ్చేసరికి ఒక్కటవుతాయి. ఆయా దేశాల మధ్య కనీస దౌత్య సంబంధాలు కూడా లేవు. కానీ కాలక్రమంలో ఈ పరిస్థతి మారుతూ వస్తోంది.

శాంతి ఒప్పందం…..

తాజాగా అరబ్ దేశమైన యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఈనెల 13న ఇజ్రాయిల్ తో శాంతి ఒ్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ‘అబ్రహం’ ఒప్పందం అని వ్యవహరిస్తారు. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ కుదుర్చుకున్న మూడో శాంతి ఒప్పందమిది. మొదట 1979లో ఈజిప్టుతో ఇజ్రాయిల్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాలోని క్యాంప్ డేవిడ్ నగరంలో నాటి ఇజ్రాయిల్, ఈజిప్టు అధినేతలు మోనాచిన్ బేగిన్, హోస్నీ ముబారక్ మధ్య అప్పటి అమెరికా అధినేత జిమ్మీ కార్టర్ ఈ ఒప్పందాన్ని కుదిర్చారు. తరవాత 1994లో జోర్డాన్, ఈజిప్టు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. తాజాగా యూఏఈ ఆ జాబితాలో చేరింది. ఏడు ఎమిరేట్స్ తో కూడిన దేశమే యూఏఈ. అబుదాబి, దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్మన్, ఉమ్ అల్ క్వైన్, ఫుజైన్ … యూఏఈలోని ఎమిరేట్స్. వీటిల్లో అబుదాబి యూఏఈ రాజధాని.

శాంతికాముకుడిగా పేరు తెచ్చుకోవాలని……

ఈ ఒప్పందం రూపుదాల్చడానికి కారణాలు అనేకం. ఏ దేశానికి తగ్గ కారణాలు ఆ దేశానికి ఉన్నాయి. ఒప్పంద సూత్రధారి అయిన అమెరికా అధినేత ట్రంప్ గత నాలుగేళ్లలో అంతర్జాతీయంగా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. దేశీయంగానూ ఇదే పరిస్థితి. రేపు నవంబరు 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఆయనకు అటు ఇజ్రాయిల్, ఇటు యూఏఈ రెండు కావలసిన దేశాలే. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంతో తాను శాంత కాముకుడిగా పేరు తెచ్చుకోవాలన్న బలమైన కోరిక ఆయనలో అంతర్గతంగా బలంగా ఉంది. దీనిని తాను సాధించిన విజయంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అష్గానిస్థాన్లో అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చానని ట్రంప్ ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇజ్రాయిల్, యూఏఈ కి వాటికి తగ్గ కారణాలు వాటికి ఉన్నాయి.

ఏకాకి కావడంతో….

పాలస్తీనా వివాదం కారణంగా ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. అమెరికా, భారత్ తప్ప దానికి చెప్పుకోదగ్గ మిత్రదేశాలు లేవు. దీనితోపాటు అమెరికా ఒత్తిడి కూడా ఒక కారణం. ఇక అరబ్ దేశాల్లో కీలకమైన యూఏఈ కి దానికి తగ్గ కారణాలు దానికి ఉన్నాయి. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. చాలా దేశాలు సొంత ఉత్పత్తులపై ఆధారపడటం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సమకూర్చుకోవడంతో ముడి చమురుకు డిమాండ్ భారీగా పడిపోయింది. మున్ముందు ధర పెరిగే అవకాశాలు కూడా లేవు. దీనికితోడు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు తమ దేశంలోకి చొచ్చుకు రావడంపై ఆందోళనగా ఉంది. మరోపక్క షియా-సున్నీ వివాదం సమస్యాత్మకంగా మారింది. షియా ఆధిపత్యం గల శక్తిమంతమైన ఇరాన్ ను నిలువరించడానికి గట్టి మద్దతు కావాలి. ఈ పరిస్థితిలో ఒప్పందానికి ముందుకు వచ్చింది ఈ అరబ్ దేశం. సౌదీ అరేబియా ప్రాబల్యానికి అతీతంగా సొంత విదేశాంగ విధానాన్ని రూపొందించు కోవాలన్నది యూఏఈ లక్ష్యం.

ఒప్పందం కుదిరిందని చెబుతున్నా…..

శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమ్ నెతన్యాహూ, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతకాలు చేశారు. ఈ ఏడాది జనవరి 28న అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో జరిగిన కార్యక్రమానికి పునాది పడింది. దీనిని పూర్తి శాంతి ఒప్పందంగా పరిగణించలేం. పాలస్తీనా వివాదం పరిష్కారం కానంత కాలం తాము ఇజ్రాయిల్ లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించమని యూఏఈ విస్పష్టంగా పేర్కొంది. అదే సమయంలో వెస్ట్ బ్యాంకులో తమ విస్తరణ కార్యక్రమాన్ని ఆలస్యం చేస్తామని ఇజ్రాయిల్ పేర్కొంది. తమ దేశాల్లో రాజకీయంగా ముఖ్యంగా విపక్షాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రెండు దేశాలు ఒప్పందంలో ఈ అంశాలను పొందుపరిచాయి. సహజంగానే ఈ ఒప్పందాన్ని పాలస్తీనా, ఇరాన్, పాకిస్థాన్, టర్కీ వంటి దేశాలు వ్యతిరేకించాయి. ఈజిప్టు, బహ్రెయిన్, అమెరికా, చైనా బ్రిటన్, జోర్డాన్, భారత్ తదితర దేశాలు స్వాగతించాయి. అదే సమయంలో పాలస్తీనాలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్న ఇజ్రాయిల్ యూదులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఇది పెద్ద తప్పిదమని ఇరాన్ వ్యాఖ్యానించింది. పైకి ఎన్ని చెప్పినప్పటికీ స్వప్రయోజనాలే ఏ దేశానికైనా ముఖ్యం. ఇజ్రాయిల్, యూఏఈ ఈ కోణంలోనే ఆలోచించి ముందడుగు వేశాయన్నది వాస్తవం. ట్రంప్ సైతం ఇదే కోణంలో ఆలోచించారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News