కాశ్మీర్ ఇంకా కుంపట్లోనేనా?

కాశ్మీర్ సమస్యకు 370వ అధికరణం దర్దు ఒక్కటే సర్వరోగ నివారిణి అని భావించిన మోదీ సర్కార్ కు క్రమంగా వాస్తవాలు అర్థమవుతున్నాయి. దశాబ్దాల తరబడి రావణకాష్టంలా కాలుతున్న [more]

Update: 2019-11-24 18:29 GMT

కాశ్మీర్ సమస్యకు 370వ అధికరణం దర్దు ఒక్కటే సర్వరోగ నివారిణి అని భావించిన మోదీ సర్కార్ కు క్రమంగా వాస్తవాలు అర్థమవుతున్నాయి. దశాబ్దాల తరబడి రావణకాష్టంలా కాలుతున్న ఈ సమస్య పరిష్కారం అనుకున్నంత తేలిక కాదని ఆచరణలో తెలిసి వస్తుంది. ఆర్టికల్ 370ని రద్దుచేసి మూడు నెలలు దాటుతున్న రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనక పోవడంతో పరిస్థితిని సమీక్షిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణను రద్దు చేస్తూ ఆగస్టు 4న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. లడాఖ్ ను పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇక్కడ బౌద్ధులు ఎక్కువ. హిందువులు అధికంగా ఉండే జమ్మూ, ముస్లింలు ఎక్కువగా ఉండే కాశ్మీర్ ను మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇది ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగా పనిచేస్తుంది. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. కానీ లడాఖ్ లో మాత్రం అసెంబ్లీ ఉండదు. కాశ్మీర్ , లడాఖ్ లకు లెఫ్ట్ నెంట్ గవర్నర్లను నియమించింది. అసెంబ్లీ ఉండదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తమ వాడిగా చెప్పుకునే బీజేపీ ఆయన జన్మదినమైన అక్బోబరు 21 నుంచి కాశ్మీర్ లో కొత్త పాలన ప్రారంభమయినట్లు ప్రకటించింది. అంటే 370 అధికరణ రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఆవిర్భావ ప్రక్రియ ఆచరణలోకి వచ్చింది. ఇక నుంచి కాశ్మీర్, లడఖ్ దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే సాధారణ ప్రాంతాలు. వీటికి ఎలాంటి ప్రత్యేకప్రతిపత్తి ఉండదు.

మూడు నెలలు గడిచినా….

కానీ మూడు నెలలు గడిచినా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనక పోవడం అటు పాలకులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భావం రోజునే ఐదుగురు వలస బెంగాలీ నిర్మాణ కార్మికులును ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకా చక్కబడలేదన్న చేదునిజాన్ని తెలియజేస్తోంది. ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి మాజీ ముఖ్యమంత్రులు ఇంకా గృహనిర్భంధంలోనే ఉండటం గమనార్హం. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బయటకు వస్తే శాంతిభద్రతల పరిస్థితి తలెత్తుతుందన్నది కేంద్రం ఆందోళన. ఇప్పటికీ 50 వేల అదనపు బలగాలను కాశ్మీర్ లో మొహరించారు. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ లు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఇటీవల జరిగిన బ్లాక్ డెవెలెప్ మెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడంలో అర్థంలేదు.

బ్యూరోక్రాట్లనే నియమించి…..

నిజంగా అలాంటి పరిస్థితులే నెలకొంటే రాజకీయ పార్టీ నాయకుల కాశ్మీర్ సందర్శనను అడ్డుకోవాల్సిన పనిలేదు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితోనే రాష్ట్రాన్ని సందర్శించడం గమనార్హం. రెండు ప్రాంతాలకు తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బ్యూరోక్రాట్లనే మోదీ లెఫ్ట్ నెంట్ గవర్నర్లుగా నియమించారు. కాశ్మీర్ గవర్నర్ జి.సి. ముర్ముర్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఒడిశాకు చెందిన ఆయన 1985 ఐఏఎస్ అధికారి. ఇంకా సర్వీసులోనే ఉన్నారు. లడఖ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆర్.కె. మాధుర్ 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. సాధారణంగా రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమిస్తే పాలన వ్యవహారాల్లో వారు పట్టువిడుపులు ప్రదర్శిస్తారు. ప్రజల అంతరంగాన్ని పసిగట్టగలుగుతారు. కానీ బ్యూరోక్రాట్లకు అటువంటి లక్షణాలుండవు. ఈ నేపథ్యంలో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్యూరోక్రాట్లను గవర్నర్లుగా నియమించడం సరైనది కాదన్న వాదన వినపడుతోంది.

విదేశీలను ఆహ్వానించి మరీ…..

తాజాగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అంతర్జాతీయ సమాజానికి చాటేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల 20 మందికి పైగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులను కాశ్మీర్ సందర్శనకు కేంద్రం ఆహ్వానించింది. 23 మందిలో నలుగురు రావడానికి ఇష్పపడలేదు. వీరంతా ముస్లిం భావజాలనికి వ్యతిరేకులు. ఇమ్మిగ్రేషన్ విధానాలను వ్యతిరేకించేవారు. ఫ్రాన్స్ , ఇటలీ, జర్మనీ, బ్రిటన్, పోలండ్ దేశాలకు చెందిన ఈ ఎంపీలకు తమ దేశాల్లో అంత ప్రాధాన్యం లేదు. బ్రిస్సెల్స్ లో ఉండే భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ మహిళ మాదిశర్మ ఈ పర్యటనలను ఏర్పాటు చేశారు. ఆమె రాజనీతిజ్ఞురాలు కాదు. దౌత్యవేత్త కాదు. తనను తాను అంతర్జాతీయ వ్యాపార దళారిగా చెప్పుకుంటారు. యూరప్ లోని భిన్నత్వాన్ని, ప్రజాస్వామ్య హక్కులను పెద్దగా గౌరవించని రైటిస్టు భావజాలం గల వారిని కాశ్మీర్ పర్యటనకు ఎంపిక చేశారు. వీరు సాధారణ ప్రజలను పూర్తి స్థాయిలో కలవలేదు. అధికారులు, పాత్రికేయులతోనే మాట్లాడారు. మన దేశంలోని ఎంపీలను కాశ్మీర్ లో పర్యటించడానికి అనుమతించలేదు. ఆఖరుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు సైతం ప్రభుత్వం అంగీకరించలేదు. అటువంటప్పుడు తమకు డప్పా కొట్టే విదేశీ ఎంపీలను ఆహ్వానించడంలో అర్థం లేదన్న విమర్శలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కాశ్మీరీల మనసులను చూరగొనడం, వారి సమస్యలను పరిష్కరించడంపైనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తేనే కాశ్మీర్ లో పరిస్థితులు కుదుట పడగలవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News