రాజకీయ రక్షణే … రాజ్య రక్షణ..?

తెలంగాణ రాజకీయ చక్రంలో సమీకరణలు మారుతున్నాయి. వ్యూహాలు, ఎత్తుగడల్లో కొత్త ట్రిక్స్ ప్రయోగించేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. బీజేపీ, కాంగ్రెసులు కూడా వేగంగానే పావులు కదుపుతున్నాయి. కిషన్ రెడ్డికి [more]

Update: 2021-07-09 15:30 GMT

తెలంగాణ రాజకీయ చక్రంలో సమీకరణలు మారుతున్నాయి. వ్యూహాలు, ఎత్తుగడల్లో కొత్త ట్రిక్స్ ప్రయోగించేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. బీజేపీ, కాంగ్రెసులు కూడా వేగంగానే పావులు కదుపుతున్నాయి. కిషన్ రెడ్డికి తెలంగాణ నుంచి తొలి కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది. పార్టీ రాజకీయ అవసరాలను ద్రుష్టిలో పెట్టుకునే కేంద్రం కిషన్ కు ప్రత్యేక గుర్తింపు నిచ్చింది. కాంగ్రెసు పార్టీ దూకుడు కనబరుస్తూ రేవంత్ ను అధ్యక్షుడిని చేయడం కూడా కిషన్ రెడ్డికి కలిసి వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వీరందరికీ తొలి పరీక్ష కాబోతోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో నిన్నామొన్నటివరకూ రాజేందర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన టీఆర్ఎస్ సైతం తన స్ట్రాటజీలో సవరణలు చేసుకుంటోంది. ఆయా పరిణామాలతో ఈటల రాజకీయ రక్షణ పరిధిలోకి వచ్చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాలు తెలంగాణ రాష్ట్రసమితి కి కొంచెం ఇబ్బందికరంగా , బీజేపీ లో చేరిన రాజేందర్ కు అనుకూలంగా రూపుదిద్దుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న రీతిలో ఈటల రాజేందర్ పై కేసులకు ప్రతిగా టీఆర్ఎస్ నేతలపై కేసులకు కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా రెండు వైపులా బ్యాలెన్స్ గా తటస్థ వైఖరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగాలనేది బీజేపీ వ్యూహం. ఈ ఎత్తుగడ ఫలిస్తున్న సూచనలే కనిపిస్తున్నాయి. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సహచరుడు రాజేందర్ తల ఎగరవేస్తున్నాడనే అనుమానంతో ఆయనకు పొగ బెట్టారు సీఎం కేసీఆర్. తప్పని సరి పరిస్థితుల్లోనే ఆయన బయటకు రావాల్సి వచ్చింది. మరో మూడేళ్ల పాటు కుదురుగా ఉండాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఆశ్రయించారు. తొలి దశలో ఆయనను వదిలేది లేదని కేసుల్లో జైలుకు వెళ్లక తప్పదని తీవ్రంగా విరుచుకుపడిన టీఆర్ఎస్ నాయకులు దాడి తగ్గించారు. కమలం పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో పావులు కదపడం వారికి చెక్ పెట్టింది. .

స్పీడు తగ్గిందా..?

అసైన్డ్ భూములు, దేవాదాయ భూములను ఈటల రాజేందర్ ఆక్రమించారనే ఆరోపణలతో తేనె తుట్టను కదిలించిన ప్రభుత్వం ప్రస్తుతం నెమ్మదించింది. దర్యాప్తుకు సంబంధించి డెవలప్ మెంట్ పూర్తిగా పక్కన పెట్టేసింది. మందకొడిగా, నత్తనడకన విచారణ సాగడానికి రాజకీయ కారణాలు దోహదం చేస్తున్నాయి..రాజేందర్ ఉదంతం ఊపు అందుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. టీఆర్ఎస్ లోకసభా పక్ష నేత నామా నాగేశ్వరరావు సంస్థలపై దాడులు చేసింది. టీఆర్ఎస్ కు సంబంధించి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారాలపైనా దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు టీఆర్ఎస్ ఇమేజ్ కు ఇబ్బందికరంగా మారాయి. దాంతో ప్రభుత్వం ఈటల రాజేందర్ పై విచారణల్లో జోరు తగ్గించింది. బీజేపీలో చేరేముందు ఈటల వేసుకున్న అంచనాలు ఫలించాయి. లేకపోతే ఈపాటికే ఆయన కేసుల చక్రబంధం లో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మొత్తమ్మీద కేంద్ర ప్రభుత్వ రక్షణ లభించడంతో రాజేందర్ ఊపిరి పీల్చుకున్నట్లయింది.

మధ్యేమార్గం..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసే వరకూ కక్ష సాధింపుగా కనిపించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. స్థానికంగా ఈటల రాజేందర్ కు మంచి ఇమేజ్ ఉండటం ఇందుకు కారణం. ప్రభుత్వం వైపు నుంచి తప్పులు కనిపిస్తే సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఉంటుంది. మరోవైపు తమ అభ్యర్థి జోలికి వస్తే ప్రతీకార చర్యలుంటాయని కేంద్రం చెప్పకనే చెబుతోంది. అందువల్ల ఈటల రాజేందర్ ను నేరుగా టార్గెట్ చేయకుండా ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా ఆదిక్యం సాధించాలని టీఆర్ఎస్ బావిస్తోంది. 2018 ఎన్నికలలో ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెసు నిలిచింది. స్వతహాగా ఉన్న ఆ పార్టీ ఓటు బ్యాంకు చెల్లాచెదురు కాకుంటే టీఆర్ఎస్ సునాయాసంగా గట్టెక్కగలుగుతుంది. బీజేపీ అభ్యర్థి రాజేందర్, టీఆర్ఎస్, కాంగ్రెసులు త్రిముఖ పోరుతో తలపడాల్సి ఉంటుంది. కాంగ్రెసు బలపడితే తమకు ఈటల రాజేందర్ తలపోటు వదిలిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాజకీయ సాహసాలు చేయకుండా రాజేందర్ ప్రాధాన్యాన్ని తగ్గించాలనే యోచనతోనే కేసుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

లోకల్ నుంచి స్టేట్ వరకూ…

హుజూరాబాద్ పుణ్యమా? అని కేసీఆర్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా మారారు. నిజానికి ఈ ఉప ఎన్నిక ప్రజలకు మంచి చేసే సూచనలే కనిపిస్తున్నాయి. కేవలం స్థానికంగా పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తాన్ని సెంటిమెంటుతో నింపాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందుకే 57 ఏళ్లకే పేదలకు పింఛన్లు వంటి అంశాలను హామీ ఇస్తున్నారు. రైతు రుణమాఫీ వంటి పెండింగు అంశాన్ని సైతం ఎన్నికలలోపు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరో వైపు ఆంధ్రప్రదేశ్ తో జలజగడం లేవనెత్తడం ద్వారా కేంద్రాన్ని బరిలోకి లాగాలనుకుంటున్నారు. బీజేపీకి కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ మీద వ్యక్తిగత కక్ష సాధిస్తున్నట్లు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ను గెలిపించాల్సిన అవసరాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మొత్తమ్మీద మరో రెండేళ్ల వరకూ పెద్దగా ఎన్నికలు లేని నేపథ్యంలో పొలిటికల్ స్ట్రాటజీని పునర్నిర్వచించుకునేందుకు హుజూరాబాద్ తోడ్పడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News