‌Huzurabad : భారీ పోలింగ్… ఎవరి వైపు మొగ్గు చూపిందంటే?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ పోలింగ్ పెరగడం ఎవరికి అనుకూలం అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ [more]

Update: 2021-10-30 13:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ పోలింగ్ పెరగడం ఎవరికి అనుకూలం అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిన తీరే వేరు ఆ తర్వాత జరిగిన పరిస్థితి వేరు. అందుకే పెరిగిన ఓట్ల శాతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు లాభమా? అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు దోహద పడుతుందా? అన్న చర్చ జరుగుతోంది.

మామూలుగా జరిగి ఉంటే…

హుజూరాబాద్ ఉప ఎన్నిక మామూలుగా జరిగి ఉంటే అంచనాలు వేరే విధంగా ఉండేది. కాని ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డింది. అన్ని రకాలుగా ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నం చేసింది. వేలాది కోట్లను ఎన్నికలకు ముందే హజూరాబాద్ అభివృద్ధికి నిధులు వెచ్చించింది. పింఛన్ల సంఖ్యను పెంచింది. రేషన్ కార్డులను కూడా కావాలన్న వారికి మంజూరు చేయగలిగారు. దీంతో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలతగా ఉండే అవకాశం ఉంది.

అన్ని రకాలుగా హామీలు…

మరోవైపు దళిత బంధు పథకాన్ని కూడా అధికార పార్టీ హుజూరాబాద్ లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇక కులాల వారీగా కమ్యునిటీ భవనాలకు, వారి డిమాండ్లను నెరవేరుస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కుల సమావేశాల్లో సయితం మంత్రులు పాల్గొని హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు. దీంతో పెరిగిన ఓట్ల శాతం అధికార పార్టీకి అనుకూలంగానే ఉండవచ్చన్న అభిప్రాయం ఒకవైపు వ్యక్తం అవుతుంది.

ఈటలలో పెరిగిన ఆశలు…

కానీ బీజేపీ మాత్రం తమ అభ్యర్థిపై సానుభూతితో పాటు, నమ్మకంతోనే ప్రజలు వేలాదిగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని అంచనా వేస్తుంది. ఈటల రాజేందర్ సయితం అదే అభిప్రాయంలో ఉన్నారు. పోలింగ్ శాతం పెరగడం తన విజయానికి అవకాశాలు మరింత పెరిగినట్లేనని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు అనుకూలంగా పడిందని బీజేపీ, అధికార పార్టీపై నమ్మకం వల్లనే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని టీఆర్ఎస్ చెబుతోంది. మొత్తం మీద ఎవరి వాదనలు ఎలా ఉన్నా హుజూరాబాద్ లో పోలింగ్ శాతం పెరగడం తాము ప్రజల్లో ఓటు పట్ల అవగాహన పెంచడం వల్లనేనని ఎన్నికల సంఘం చెబుతోంది.

Tags:    

Similar News