‌Huzurabad : హుజూరాబాద్ లో ఒక్క ఓటు విలువ ఎంతో తెలుసా?

హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం మామూలుగా లేదు. ఒక్క ఓటును కూడా వదిలపెట్టకుండా రెండు పార్టీలూ జల్లెడ పడుతున్నాయి. ఓటుకు పది వేల నుంచి పదిహేను వేల [more]

Update: 2021-10-12 09:30 GMT

హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం మామూలుగా లేదు. ఒక్క ఓటును కూడా వదిలపెట్టకుండా రెండు పార్టీలూ జల్లెడ పడుతున్నాయి. ఓటుకు పది వేల నుంచి పదిహేను వేల వరకూ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకే కుటంబంలో పది కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వారికి మూడు లక్షలు ఇచ్చేందుకు కూడా అభ్యర్థులు సిద్దమవుతున్నారు. ఇక గ్రామాల్లో ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్దమయిపోయారు.

ఎప్పుడూ లేదు…..

గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పాలి. ఇంతటి కాస్ట్ లీ ఎన్నిక ఎప్పుడూ జరగలేదు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఇటీవలే జరిగిన ఈ స్థాయిలో ఖర్చు చూడలేదన్నది పరిశీలకుల భావన. హుజూరాబాద్ మండలంలోని ఒక గ్రామానికి రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో గ్రామస్థుల డిమాండ్ మేరకు ఒక పార్టీ నేరుగా రోడ్డు వేయించడం విశేషం.

కుటుంబాలనే….

ఇక ప్రతి పోలింగ్ కేంద్రం ఆధారంగా ఓటర్లను ముందుగానే గుర్తించి వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దాదాపు 12 మంది సభ్యులున్న ఒక కుటుంబానికి మూడు లక్షల నగదుతో పాటు ఒక పొటేల్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. తాము డబ్బులిచ్చిన ఓటర్లు ఖచ్చితంగా ఓటు వేయాలని వారిచేత ప్రమాణం కూడా చేయించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, తమ సంక్షేమ పథకాలను చూసే ఓట్లు వేస్తారని చెబుతోంది.

పరస్పర ఆరోపణలు…

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ ఓటుకు ఇరవై వేలు ఇస్తుందని ఆరోపిస్తున్నారు. తాను గెలిస్తే మరిన్ని పథకాలను కేసీఆర్ ప్రవేశ పెడతారని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రతి ఇంటికి గోడ గడియారాలు ఇవ్వడంతో పాటు ఓట్లను కూడా కొనుగోలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నికలో రెండు పార్టీలు లెక్కకు మించి ఖర్చు చేస్తున్నాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News